Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

ట్రంప్‌ను గెలిచిన కిమ్

Deal with trumpet leader with the North Korean leader

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన్ను తాను గొప్ప డీల్ మేకర్ (కార్యసాధకుడు) అని చెప్పుకుంటాడు. చరిత్రాత్మకమైన ఈ సమావేశంలో తన వయసులో సగం కూడాలేని ఉత్తరకొరియా నాయకుడితో ట్రంప్ చేసుకున్న డీల్ చరిత్రాత్మకమైనదా? అనే ప్రశ్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఉత్తరకొరియా నాయకుడు ఇచ్చింది కొన్ని వాగ్దానాలు మాత్రమే. అవి కూడా నిర్దిష్టంగా లేవు. అమెరికా నుంచి తనకు కావలసినవన్నీ సాధించుకున్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ డీల్ మేకర్ చతికిలబడినట్లు కనిపిస్తున్నది. ఈ సమావేశం తర్వాత ట్రంప్ నోబుల్ బహుమతి పొందగలడా? అసలు ట్రంప్ సాధించిందేమిటన్నది ముఖ్యం.రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నప్పుడు, ఉత్తరకొరియా వరుసగా అణుపరీక్షలతో హోరెత్తిస్తున్నప్పుడు జరిగిన ఈ సమావేశం నిస్సందేహంగా చరిత్రాత్మకమైనదే. కాని ఈ సమావేశంలో కిమ్ ఒక గొప్ప వ్యూహకర్తగాను ప్రపంచానికి పరిచయమయ్యాడు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రరహితంగా మార్చడానికి కిమ్ పూర్తి నిబద్ధత కనబరుస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాకు చెప్పడం కాస్త హాస్యాస్పదంగానే ఉంది. ఇంతకన్నా గట్టిగా నిర్దిష్టంగా చేసుకున్న ఒప్పందాలనే ఉత్తరకొరియా గడ్డిపరకల్లా జమకట్టింది గతం లో. ఆ మాటకొస్తే ఇప్పుడు అమెరికా కూడా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించనవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో “అణ్వస్త్రరహితంగా మారడానికి ప్రయత్నిస్తాం” అని కిమ్ తో ఒక్క మాట చెప్పించడమే గొప్ప విజయంగా ట్రంప్ ప్రపంచాన్ని నమ్మమంటున్నాడు. ఇద్దరు నేతలు కలిసి జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో నిర్దిష్టమైన సమయం చెప్పలేదు, నిర్దిష్టమైన ప్రక్రియ లేదు. ఇది కేవలం తమ ఉద్దేశాలను, సదుద్దేశాలను ప్రకటించిన పత్రం మాత్రమే.
ఉత్తరకొరియాలో ఉన్న అణ్వస్త్రపరీక్షల స్థావరాలను ధ్వంసం చేయ డం, అణ్వాయుధాలను ధ్వంసం చేయడం, క్షిపణి పరీక్షలు మానుకోవ డం వగైరాలకు సంబంధించి ఒక్క నిర్దిష్టమైన మాట కూడా లేదు. ఉత్తరకొరియా నాయకుడు అణ్వాయుధాలను వదిలించుకోవాలని భావిస్తున్న ట్లు ట్రంప్ చెబుతున్నారు. అసలు ఈ ఒప్పందంలో ట్రంప్ ఎంతో గొప్ప గా చెప్పుకున్న “కంప్లీట్ వెరిఫియబుల్ ఇర్రివర్సిబుల్ డీన్యూక్లియరైజేషన్‌” అంటే, మళ్ళీ అణ్వస్త్రాలు తయారు చేయకుండా పూర్తి నిరాయుధీకరణ, దానికి సంబంధించిన వెరిఫికేషన్ అవకాశాలు కల్పించడం గురిం చి ఒక్క మాట కూడా ఈ ఒప్పందంలో లేదు. ఈ విషయం గురించి ట్రంప్‌ను ప్రశ్నిస్తే ఆయన దాటవేశాడు. అంతర్జాతీయ ఒప్పందాల్లో గత చరిత్రకూడా ఎంతో ముఖ్యమైనది. ఇరాన్‌తో అణు ఒప్పందంనుంచి తప్పుకున్న, లిబియా విషయంలో వెన్నుపోటు పొడిచిన అమెరికా విషయంలో ప్రతిదేశం ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది. అదేవిధంగా ఉత్తరకొరియా గత చరిత్ర కూడా అలాంటిదే.
1992లో అణ్వస్త్రాలను నిర్మూలించడానికి రెండు కొరియాలు కలిసి చేసిన ప్రకటనలో ఇంతకన్నా కాస్త నిర్దిష్టంగానే చాలా మాటలు చెప్పారు. అణ్వస్త్రాలను కొరియా దేశాలు తయారు చేయరాదని, నిలవఉంచరాదని, పరీక్షించరాదని నిర్దిష్టంగా చేసుకున్న ఆ ఒప్పందాన్నే ఉత్తరకొరియా మన్నించలేదు. 1993లో కూడా అమెరికాతో ఒక ఒప్పందం కుదిరింది.2005లోను మరో ప్రయత్నం జరిగింది. ఉత్తర కొరియా దేన్నీ లక్ష్యపెట్టలేదు. ఈ మధ్యకాలంలో మరింత శక్తివంతమైన బాంబులు తయారు చేసింది. క్షిపణులు పరీక్షించింది. అమెరికా ప్రధాన భూభాగాలనులక్ష్యం చేసుకోగల స్థాయి కి చేరుకుంది. ఉత్తరకొరియా ఇచ్చిన హామీకి బదులుగా ఇప్పుడు అమెరికా కొరియా ద్వీపకల్పంలో సైనిక విన్యాసాలు ఆపేస్తోంది. ద.కొరియా నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తోంది.ఈ రెండు పనులవల్ల అమెరికా అపారంగా ఖర్చు పెట్టవలసి వస్తుందని ట్రంప్ కూడా బాధపడిపోతున్నాడు. ఇవి రెండు కూడా కిమ్ డిమాండ్లు. కిమ్ డిమాండ్లన్నింటికి ట్రంప్ ఒప్పుకున్నాడు. కాని ఈ సమావేశం తర్వాత నిజానికి జరిగిందేమిటంటే ఉత్తరకొరియా నియంతగా నిన్నటి వరకు పిలవబడిన కిమ్ ఇప్పుడు ప్రపంచ నాయకుడిగా మారాడు. అణ్వస్త్ర దేశంగా ఉత్తరకొరియాను ప్రపంచం గుర్తించేలా చేశాడు. అమెరికాతో సమానహోదాలో చర్చల్లో పాల్గొన్నాడు. అణ్వస్త్రాలను సాధించడం వల్లనే కిమ్ చర్చల్లో తన మాట చెల్లేలా చేసుకున్నాడన్నది కూడా ప్రపంచం గుర్తించేలా చేశాడు. ట్రంప్ సాధించిన విజయాలేమిటి?ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తరకొరియా నాయకుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ అనేక మార్పులకు గురవుతోంది. అన్ వెయిలింగ్ ది నార్త్ కొరియన్ ఎకానమీ (ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ) అనే పుస్తకంలో ప్రముఖ దక్షిణ కొరియా విద్యావేత్త బ్యోంగ్ యోన్ కిమ్ అక్కడి స్థితిని తెలియజేశారు. 1990లలో ఎదుర్కొన్న దారుణమైన కరువు తర్వాత ఉత్తరకొరియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్ కనిపిస్తోంది. 2013లో ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జాంగున్ అణ్వాయుధాలకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడో, ఆర్థికవ్యవస్థకు కూడా అంతే ప్రాముఖ్యం ఇచ్చాడు. 400 మార్కెట్లు, ఆరులక్షల స్టాళ్ళు వెలిశాయి. ఇవి అధికారికమైనవి. ఇవి కాక అసంఖ్యాక అనధికారిక వాణిజ్య కేంద్రాలున్నాయి. ఉత్తరకొరియా ప్రజల ఉపాధిఅవకాశాలకు ఇవి ఎంతో తోడ్పడ్డాయి. ఉత్తరకొరియా అణ్వస్త్రాల గురించి ఆలోచనల్లోనే అమెరికా మునిగిపోయింది కాని దాని ఆర్థిక కార్యకలాపాలను చూడలేదు. మార్కెట్ సంస్కరణలు వచ్చాయి. ప్రయివేటు కార్యకలాపాలను ఆమోదించడం జరుగుతోంది. దీనివల్ల ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు విధించినా చైనా వంటి దేశాలు తమ ప్రయోజనాల రీత్యా పట్టించుకోవు. మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత ఉత్తరరియా పాలకుడు తన ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించకపోతే, ఉక్కుపాదంతో ప్రయివేటు కార్యకలాపాలు అణిచేస్తే తిరుగుబాటు రావచ్చు. అందువల్ల బహుశా కిమ్ జాంగున్ చైనా శైలి విధానం వైపు మరలుతున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరకొరియా ఆర్ధిక వృద్ధి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. బ్యాంక్ ఆఫ్ కొరియా (సియోల్) ప్రకారం అది 2015లో మైనస్ 1 శాతం, కాని హ్యూండయ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం 9 శాతం. గత నెల దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంకు ప్రకారం 2016లో ఉత్తరకొరియా ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదల 3.9 శాతం. ఉత్తరకొరియా ధరలను కూడా అదుపులో పెట్టగలిగింది. అణ్వస్త్రాలను వదులుకుంటే ఉత్తరకొరియాలో పెట్టుబడులు పెట్టి దానిని చాలా సంపన్నదేశంగా మార్చేస్తామని ట్రంప్ చెప్పిన మాటలకు అర్థం పర్థం లేదు. ఆంక్షల సడలింపుల వెంటనే అధికారికంగా ఉత్తరకొరియాలో పెట్టుబడులు పెట్టేది చైనా. ఉత్తరకొరియా అమెరికా శైలి పెట్టుబడిదారీ వ్యవస్థను కాదు, చైనా మాదిరి ప్రభుత్వ నియంత్రణలో నడిచే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. చైనాలో డెంగ్ జియావో పింగ్ చేసిన మార్పులే కిమ్ చేస్తాడని చాలా మంది భావిస్తున్నారు. చైనాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నేడు చైనా ప్రపంచంలో తిరుగులేని ఆర్ధికశక్తిగా మారింది. ట్రంప్ చర్చల తర్వాత ప్రపంచంలో ఆమోదయోగ్యమైన స్థానాన్ని కిమ్ సాధించుకొన్న తర్వాత, ఆంక్షలు తొలగిపోయిన తర్వాత, ఉత్తరకొరియాలో చైనా పేరే వినిపిస్తుంది కాని అమెరికా పేరు కాదు, అమెరికా సైన్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దక్షిణ కొరియా కూడా చైనా నీడకే చేరుతుంది. దౌత్యపరంగా అమెరికా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నట్లే. ఈ ఒప్పందం తర్వాత అమెరికా ప్రపంచదేశాలకు, ముఖ్యంగా దక్షిణ కొరియాకు ఇచ్చిన సందేశం ఏమిటి? రక్షణ విషయంలో అమెరికాను నమ్మకుంటే నట్టేట మునిగినట్లేనన్నదే ఆ సందేశం. దక్షిణ కొరియాను బలిపెట్టయినా సరే ఉత్తరకొరియాతో స్నేహం కోసం ట్రంప్ ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, వాటిని వెంటనే ఆపేస్తామని ట్రంప్ చెప్పాడు. దక్షిణ కొరియాకు ఇవి రుచించే మాటలు కాదు. దక్షిణ కొరియాను ఇప్పుడు అమెరికా పట్టించుకోదన్న సంకేతం ఈ మాటల్లో ఉంది.

Comments

comments