Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఎవరికి వారే యుమునా తీరే

Election Tension In Congress Party In Telangana

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హస్తం పార్టీలో ఐక్యత కరువైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టిఆర్‌ఎస్ ధాటికి కుదేలైన కాంగ్రెస్ పార్టీని ముందుండి సమర్ధవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ రోజు రోజుకు డీలాపడుతుంది. పటిష్టమైన కార్యకర్తల బలం…సమర్ధవంతమైన క్షేత్రస్థాయి నాయకత్వం ఉన్న నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ముందుండి నడిపించే నేతలు చాలా నియోజకవర్గాలలో లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పంచాయతీ ఎన్నికలకు అధికార పార్టీ ఇప్పటికే కదనరంగంలోకి దూసుకుపోతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం అంతర్గత పంచాయతీలకు, గాంధీభవన్ కార్యక్రమాలకు పరిమితం అయ్యారు. పంచాయతీ ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేసి నియోజకవర్గాలలో నేతల మధ్య సమన్వయం కుదర్చవలసిన జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటుతో జిల్లా స్థాయిలో కొత్త నాయకత్వం వస్తుందని తమకు పదవులు వస్తాయని ఆశించిన నేతల ఆశలు అడియాశలయ్యాయి. పాత జిల్లాల ప్రతిపాదికన పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయడం తప్ప ఇతర కార్యవర్గం ఏర్పాటు చేసే వాతావరణం కనిపించడం లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత క్యామ మల్లేష్‌ను ఎంపిక చేసిన 2019 ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగాలన్న ఆశతో ఎక్కువ సమయం నియోజకవర్గానికి, గాంధీ భవన్‌కు పరిమితం అవడం మినహా జిల్లాలోని మిగత 13 నియోజకవర్గాలలో నామ మాత్రపు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న దాఖలాలు కరువయ్యా యి. గాంధీభవన్‌లో కార్యక్రమాలు నిర్వహణ సమాచారం సైతం బయటకు పంపలేని నిస్సహాయస్థితిలో జిల్లా నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది.
బడానేతలున్నా…ఐక్యత కరువు….
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో హేమహేమి నేతలు ఉన్న ఉమ్మడి జిల్లాను ముందుండి నడిపే నేతలు మాత్రం కరువయ్యారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఎక్కడి వారు అక్కడి కార్యక్రమాలకు పరిమితం కాగా రాష్ట్ర, జాతీయ నాయకత్వం మాత్రం ఉమ్మడి జిల్లా కమిటీలను ప్రకటించడం విమర్శలకు తావిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు. ఇబ్రహీంపట్నంలో డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నట్లు వేరు వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్‌ను పరేషాన్ చేస్తున్నారు. ఎల్‌బినగర్‌లో సుధీర్‌రెడ్డి తనదైన శైలీలో ముందుకు పోతున్నారు. షాద్‌నగర్‌లో సైతం రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నాయి. రాజేంద్రనగర్, చేవెళ్లలో సబితారెడ్డి పార్టీని ముందుకు నడిపిస్తున్నా నియోజకవర్గ స్థాయిలో నడిపించే నాయకత్వం కరువైంది. శేరిలింగంపల్లిలో క్యాడర్ డీలా పడి కనీస కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు వలసపట్టిన పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. చేవెళ్ళ పార్లమెంట్ బరిలో ఎవరు నిలబడుతారో అన్న దానిపై పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నుంచి బరిలో దిగడం ఖాయమని ప్రచారం జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే కెఎల్‌ఆర్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు పార్లమెంట్ నుంచి బరిలో దిగుతారని సైతం వినికిడి. వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రులు చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్ జనంలోకి దూసుకుపోతుండగా చంద్రశేఖర్ సైతం తనదైన లాబీయింగ్ చేస్తున్నారు. తాండూరులో మహరాజ్‌లు ఒకవైపు, డిసిసిబి మాజీ చైర్మన్ లకా్ష్మరెడ్డి మరోవైపు పార్టీని నడిపిస్తూ ప్రజల ముందు పార్టీని చులకనగా తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి తనకు తిరుగులేదని అంచనాలు వేసుకుని ఊహలపల్లకీలో తేలియాడుతున్నారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై వికారాబాద్ జిల్లా పార్టీ నేతలు పెద్దగా ఆశలు పెట్టుకున్న గత కొన్ని రోజులుగా ఆయన డైలమాలో ఉండటం క్యాడర్ నరాజ్‌లో పడింది. మేడ్చల్‌లో కెఎల్‌ఆర్, ఉప్పల్‌లో లకా్ష్మరెడ్డి, కు త్బుల్లాపూర్‌లో శ్రీశైలం గౌడ్‌లు తమ పని తాము చేసుకుంటు న్న మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లిలో క్యాడర్ పూర్తిగా డీలాపడింది.
కాంగ్రెస్‌లో రైతుబందు టెన్షన్…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుబందు పథకం ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్ నాయకులు పరేషాన్ అవుతున్నారు. గ్రామాలలో రైతు కుటుంబాల ఓట్లు గంపగుత్తగా టిఆర్‌యస్ బలపరిచిన అభ్యర్ధికి పోల్ అవుతాయన్న లెక్కలు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే అభ్యర్దులను కలవరంకు గురిచేస్తున్నాయి. రిజర్వేషన్‌లు ప్రకటించిన వెంటనే అధికార పార్టీలో చేరి అవకాశం దక్కించుకోవడానికి చాలా మంది నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరుతో విసిగిన నేతలను గుర్తించి పంచాయతీ ఎన్నికలలో తమ పార్టీలో చేర్చుకోవడానికి టిఆర్‌యస్ పార్టీ నాయకత్వం సైతం ప్లాన్‌లు వేస్తుంది. గ్రామ పంచాయతీలను ఎకగ్రీవంగా దక్కించుకోవడం ద్వారా సత్తాచాటి కెసిఆర్ దృష్టిలో పడి అసెంబ్లీ టికెట్ పక్కా చేసుకోవాలని నేతలు ముందస్తు స్కేచ్‌లు వేసుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో ఆపరేషన్ కాంగ్రెస్ విజయవంతం చేసి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రిష్ణారెడ్డి, అబ్రహంను కారు ఎక్కించుకోవడంతో ఇక రంగారెడ్డి జిల్లాలో మరోమారు ఆపరేషన్ నిర్వహణకు సైతం నేతలు ప్లాన్‌లు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

Comments

comments