Search
Tuesday 19 June 2018
  • :
  • :

బదిలీల ఫీవర్

Employees Transfer Process In telangana

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. కలెక్టరేట్‌ల నుంచి పల్లెల్లోని ప్రభుత్వ బడి వరకు ఇద్దరు ఉద్యోగులు కలిస్తే చాలు ఇదే చర్చ నడుస్తుంది. ప్రభుత్వం పారదర్శకంగా బదిలీలను చేపట్టడానికి ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా బదిలీలు చేపట్టినా శివారులోని మంచి పోస్టింగ్ సాధించుకోవాలన్న తపనతో ఉద్యోగులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రమాణికంగా అన్ని శాఖలలో పారదర్శకంగా బదిలీల తంతును పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగిస్తుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమయంలో వర్క్ టు సర్వ్  కింద రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు వెళ్లిన చాలా మంది తిరిగి  సొంత జిల్లాకు తరలిరావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రభుత్వ శాఖలలో 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా స్థాన చలనం కల్పించడానికి సిద్ధమవగా రెండు సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్న వారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పల్లెల నుంచి పట్నం వైపు తరలిరావడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించుకున్నారు. సోమవారం రాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడంతో నగర శివారులోని అధిక హెచ్‌ఆర్‌ఎ స్థానాలను దక్కించుకోవడానికి ఒక్కో స్థానంకు పదుల సంఖ్యలో ఆప్షన్‌లు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో ఎళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉండటంతో వారి బదిలీలకు తాత్కలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వ శాఖలలో అధికంగా బదిలీలు మాత్రం ఉపాద్యాయులలో జరుగనున్నాయి. బదిలీలలో మంచి స్థానం సంపాధించుకోవడానికి పంతుళ్లు సైతం పక్కదారి పట్టినట్లు విమర్శల పర్వం అప్పుడే ప్రారంబమయింది. బదిలీలలో అధిక పాయింట్‌లు సాధించడం ద్వారా మంచి స్థానం దక్కించుకోవడానికి హెచ్‌ఆర్‌ఎ కేటాగిరిలను తప్పుగా చూపించడం, స్పోస్ కేటాగిరిలో అక్రమాలు చేయడం, లేని రోగాలను ఉన్నట్లుగా చూపించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున విమర్శల పర్వం ప్రారంబమయింది.
అధికారులతో సమీక్ష….
బదిలీలను పారదర్శకంగా చేయడంతో పాటు బదిలీల అనంతరం పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి అధికారులు కసరత్తు ప్రారంబించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ కలెక్టర్ రఘనందన్‌రావు, ఓమర్ జలీల్, యం.వి.రెడ్డిలు స్వయంగా మంగళవారం నాడు టియస్‌పార్డులో సమీక్ష సమావేశం నిర్వహించి బదిలీల నిర్వహణపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు సలహాలు అందచేశారు. మూడు జిల్లాలోని విద్యాశాఖ, ట్రెజరీ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, మత్తశాఖ, ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, కార్మిక శాఖ, బిసి సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలను నిర్వహించడంపై మార్గదర్శకాలు జారీచేశారు. ప్రభుత్వ శాఖలలో 40% లోపు ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలన్న లక్షంతో ముందుకు సాగుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతుండగా బదిలీలలో చాలా మంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు అప్షన్ ఇవ్వడంతో చాలా ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లాను జోనల్ వ్యవస్థలలో భాగంగా జోగులాంభ జోన్‌లో కలిపివేయడంతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు క్యూ కడుతున్నారు. బదిలీల పర్వంలో శాఖల వారిగా సీనియారిటి జాబితాలను తయారు చేయడానికి అధికారులు పూర్తి స్థాయి కసరత్తు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను క్రొడికరించి బదిలీలను పూర్తి చేయడానికి విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది. సీనియారిటి, ఖాళీల జాబితా మరో రెండు మూడు రోజులలో వచ్చే అవకాశం ఉండగా అనంతరం 20-23 వెబ్ ఆప్షన్ 24, 25లలో పోస్టింగ్ ఖరారు చేస్తు సమాచారం చేరవేసి 26న ఉపాధ్యాయులు కొత్త స్థానాలో చేరవలసి ఉంటుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల విద్యాశాఖాధికారులు సరూర్‌నగర్ మండల పరిధిలోని పల్లవీ ఇంటర్నెషనల్ స్కూల్, లోటస్ ల్యాప్ స్కూల్‌ల కేంద్రంగా ఆన్‌లైన్ బదిలీలను పర్యవేక్షిస్తున్నారు. శాఖల వారిగా బదిలీల జాబితా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని తెలిసింది. ఉద్యోగుల బదిలీల ఫీవర్ జూన్ మాసంతం వరకు కొనసాగనుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మాత్రం బ్రేక్ పడుతుంది.

Comments

comments