Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం

* ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టిన ఇంటర్ బోర్డ్
* దోస్త్ ద్వారా ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలు
* స్టార్టప్‌ల రూపకల్పనకు వర్సిటీలలో ఇంకుబేటర్లు

Kadiyam-Sri-Hari

ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఇంగ్లీష్ మీడియం విద్య అవసరం..మారిన తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 2016 17 విద్యాసంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించింది. మొదటి ఏడాది 4,073 ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించింది. 2017 18 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేలకుపైగా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించారు. 2018 19 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాలను సిద్దం చేసి, పాఠశాలలకు పంపిణీ చేసింది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ వెలుగులు

మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టింది. 2016 17 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 3,352 పాఠశాలల్లో ప్రారంభించి, 2017 18 విద్యాసంవత్సరానికి 5,400 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

తప్పనిసరి తెలుగు : తెలుగు భాష గొప్పతనాన్నిచాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ప్రభుత్వం రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసింది. ఇంటర్మీడియేట్ స్థాయిలో 201819 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్ట్‌గా ఉండనుంది. రానున్న విద్యా సంవత్సరం నుంచే ‘తప్పనిసరి తెలుగు’ విధానం అమల్లోకి రానుంది.

ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టిన ఇంటర్ బోర్డ్

ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. అన్ని స్థాయిలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన విధానాలు ప్రవేశ పెట్టింది. జూనియర్ కళాశాలల అఫిలియేషన్లకు సైతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, అనుమతులు మంజూరు చేస్తోంది. అలాగే ఇఆఫీస్ ద్వారా డిజిటల్ సంతకంతో ఫైళ్ల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరిస్తోంది. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షల కేంద్రం లోకేషన్‌ను తెలుసుకునేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్ ద్వారా చేపడుతోంది.

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానం

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో సీట్లను గత మూడేళ్లుగా ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 201617 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలు చేపడుతున్నారు. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో డిగ్రీ ప్రవేశాలు పారదర్శకంగా జరగడంతోపాటు ప్రభుత్వం వద్ద విద్యార్థులకు సంబంధించిన డాటా అందుబాటులో ఉంటుంది.

వర్సిటీలలో ఇన్‌క్యుబేటర్లు

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రభుత్వం ఇన్‌క్యుబేటర్లను ఏర్పాటు చేసింది. వర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పారు. విద్యార్థులు తమ ప్రతిభను సానబట్టి స్టార్టప్‌లు రూపొందించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా వర్సిటీలలో వేదికలు ఏర్పాటు చేశారు.

 ఎమ్.భుజగేందర్

Comments

comments