Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 Farmers welfare is the government goal

రైతురాజు కావాలనేదే సిఎం కెసిఆర్ లక్షం
రూ.200 కోట్లతో ఘనపురం ఆనకట్ట పున:నిర్మాణం
రూ.4.44 కోట్లతో పాపన్నపేట మార్కెట్ కమిటీ అభివృద్ధి
వర్షాకాలం, యాసంగిలో 52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/పాపన్నపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, రైతుల కృషి చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతనంగా నిర్మించిన గోదాములను ఆయన ప్రారంభించారు. మార్కెట్ కమిటీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఈ సంవత్సరం యాసంగిలో 34లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేశామన్నారు. వర్షాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి రైతుల వద్ద నుండి 52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. అదే విధంగా శనిగలు, మక్కలు, జొన్నలకు కూడా ప్రత్యేకంగా మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. పాపన్నపేటలో 4.44 కోట్ల రూపాయలతో మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడంతో పాటు గోదాముల నిర్మాణం కూడా చేశామన్నారు. రైతు రాజు కావాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని, రైతులకు మద్దతు ధరతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్, పెట్టుబడి సాయానికి ఎకరానికి 4వేల రూపాయలు, రూ.5లక్షల రైతు బీమాను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా మండలంలో సాగునీటి కొరత లేకుండా ఘనపురం ఆనకట్టను ఆధునీకరించి నీరందించడంతో యాసంగిలో వరి ధాన్యం బాగా పండాయన్నారు. ఘనపురం ఆనకట్ట ఆధునీకరణకు 200 కోట్లతో పునర్‌నిర్మిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మండుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. రైతుబంధు పథకం ద్వారా రూ.1200 కోట్లతో 58లక్షల మంది రైతులు లబ్ధిపొందారన్నారు. రాష్ట్రంలోని 46వేల చెరువులను మిషన్‌కాకతీయ  ద్వారా పునర్‌నిర్మాణం చేపట్టామన్నారు. సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను అందజేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, జెసి నగేష్, ఆర్డీవో నగేష్, మార్కెట్ కమిటీ ఎస్సీ ఉమాశేఖర్, ఎఎంసి చైర్మన్ రవీందర్‌నాయక్, ఎంపిపి పవిత్రదుర్గయ్య, ఎఎంసి వైస్ చైర్మన్ గురుమూర్తిగౌడ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ శాఖ ఇంజనీర్లు మల్లేశం, రవికుమార్, మార్కెట్ కమిటీ డిఇ రవీందర్‌రెడ్డితో పాటు మండల టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments