Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

భూమిని కబ్జా చేసిన భూ బకాసురులు

Hunger strike for justice doing Father And Daughter

మన తెలంగాణ /ఏటూరునాగారం : తన భూమిని కాపాడుకోవడం కోసం ఏటూరునాగారం మండలం రాంనగర్ గ్రామానికి చెందిన యాట్ల వెంకటేశ్వర్లు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట న్యాయం కోసం తన కూతురు అనూషతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 1986లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భూపంపిణీలో భాగంగా తనకు 118/5 సర్వే నంబరులో 2.6 ఎకరాల భూమిని అసైన్డ్‌భూమిని పట్టా ఇచ్చారని, ఈ క్రమంలో అప్పటి నుండి  2014 వరకు తన భూమిలో మోటారు వేసుకుని సాగు చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రబెల్లి మనోహర్‌రావు అనే దొరలు తన భూమిని కబ్జా చేసి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై లాక్కున్నారని బోరున విలపిస్తూ తెలిపాడు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా ఫలితం  లేదన్నారు. అంతే కాకుండా ఈ విషయంపై స్థానికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి సిఐ తన భార్యపై కోపగించి చేయిచేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నా భార్య యాట్ల కౌసల్య మనస్థాపానికి గురై మంచం పట్టి మృతి చెందిందన్నారు.

నాభార్య మృతి చెందడంతో నాకుమారుడు సతీష్ కూడ మా భూమి మాకు దక్కదనే బాధతో  ఆత్మ హత్యకు పాల్పడి మృతి చెందాడని భోరున విలపిస్తూ తెలిపాడు. దొరల కారణంగా నా భార్యను, కొడుకును కోల్పోయానని, పెళ్లికి ఎదిగిన కూతురు, రెండవ కుమారుడు శివ లు బతుకు దెరువు లేక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.  తన కుటుంబం జీవనాధారం కోసం భూమిని దక్కించుకోడానికి  అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి తాను కూడ గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డానని, వెంటనే  తన కూతురు అనూష ఆస్పత్రికి తీసుకెళ్లి బ్రతికించుకుందన్నారు. చిట్ట చివరికి చేసేది లేక న్యాయం కోసం గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేను నా కూతురు న్యాయ పోరాటం చేస్తున్నామని ఇదే చివరి ప్రయత్నమని చావో లేక భూమో అని తేలే వరకు న్యాయ పోరాటం చేస్తానని ఖరా ఖండిగా వెంకటేశ్వర్లు తెలిపాడు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ భూసర్వేలో 1/బి కింద 118/5 కింద రెండు ఎకరాల ఆరుగుంటల భూమిని రికార్డులలో ఉన్నట్లు అట్టి 1/బి ని కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టా పాసుబుక్కు,   రైతు బంధు పథకం కింద వచ్చే చెక్కును ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. యాట్ల వెంకటేశ్వర్లు చేస్తున్న న్యాయ పోరాటానికి టిడిపి మండల పార్టీ అద్యక్షుడు తిప్పనపల్లి సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టు రమేష్, రైతులు గురువారం మద్దతు తెలిపారు.

Comments

comments