Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

బ్రెజిల్‌దే హవా..

FIFA

ఎదురులేని జర్మనీ, ఇటలీ
సత్తా చాటిన అర్జెంటీనా
ప్రపంచకప్ ప్రస్థానం

మన తెలంగాణ/ క్రీడావిభాగం: ప్రపంచ ఫుట్‌బాల్ పండగకు రష్యా సర్వంగా సుందరంగా సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ విశ్వకప్‌లో మొత్తం 32 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి మొత్తం 65 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గురువారం ఆతిథ్య రష్యా ఆసియా జట్టు సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా పండగకు తెరలేస్తుంది. ఐదు సార్ల చాంపియన్ బ్రెజిల్, నాలుగు సార్ల విజేత జర్మనీ, రెండేసి సార్లు గెలిచిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఈసారి కూడా ట్రోఫీపై కన్నేశాయి. మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, స్పెయిన్, ఫ్రాన్స్‌లు కూడా కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు బెల్జియం, మెక్సికో, పనామా, పోర్చుగల్, పోలండ్, కొలంబియా తదితర జట్లు కూడా ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కాగా, నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఇటలీ ఈసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇటలీని ఓడించి ఈసారి స్వీడన్ వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. గతంలోలాగే ఈసారి కూడా యూరప్, అమెరికా జట్ల మధ్యే ట్రోఫీ కోసం హోరాహోరీ జరుగనుంది. ఐదు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన బ్రెజిల్ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కిందటిసారి స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో బ్రెజిల్ ప్రారంభంలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి భారీ ఆశలతో పోటీలకు సిద్ధమైంది. రోనాల్డో దిన్హో ఈసారి కూడా జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. అతనిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు 20 సార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లు జరిగాయి. ఇందులో బ్రెజిల్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. యూరప్‌కు చెందిన జర్మనీ, ఇటలీలు నాలుగేసి సార్లు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించాయి. దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా, ఉరుగ్వేలు రెండేసి సార్లు విశ్వవిజేతగా నిలిచాయి. యూరప్‌కు చెందిన ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్‌లు ఒక్కోసారి ప్రపంచకప్ ట్రోఫీని సాధించాయి. తొలి ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికాకే చెందిన ఉరుగ్వే విజేతగా నిలిచింది. స్వదేశంలో 1930లో జరిగిన ప్రపంచకప్‌లో ఉరుగ్వే విశ్వకప్ సాధించింది. 1950లో బ్రెజిల్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కూడా ఉరుగ్వే చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఉరుగ్వే ప్రపంచకప్ సాధించలేక పోయింది. అంతేగాక ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేక పోయింది. దక్షిణ అమెరికాకే చెందిన మరో జట్టు అర్జెంటీనా కూడా రెండు సార్లు విశ్వకప్ సాధించింది. 1978, 1986లలో అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకుంది. మరో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈ జట్లు తప్ప మిగతా ఏ జట్లు కూడా ఇంత వరకు ప్రపంచకప్ ట్రోఫీలు గెలవలేక పోయాయి.

బ్రెజిల్ ముద్ర…
ప్రపంచకప్ సాకర్‌లో దక్షిణ అమెరికా జట్టు బ్రెజిల్ తనదైన ముద్ర వేసింది. ఏ జట్టుకు లేని రికార్డు బ్రెజిల్ సాధించింది. ఇప్పటి వరకు బ్రెజిల్ రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని సాధించింది. మరే జట్టు కూడా ఇన్ని సార్లు సాకర్ ప్రపంచకప్ గెలవలేదు. 1930లో తొలిసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచే బ్రెజిల్ విశ్వకప్‌లో బలమైన జట్టుగా ప్రస్థానం కొనసాగిస్తోంది. బ్రెజిల్ 1958, 1962, 1970, 1994, 2002లలో ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకుంది. అంతేగాక 1950, 1998లలో రన్నరప్‌గా నిలిచింది. ఎదురులేని జర్మనీ… బ్రెజిల్ తర్వాత ప్రపంచకప్‌లో యూరప్‌కు చెందిన జర్మనీ మెరుగైన రికార్డు కలిగి ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న జర్మనీ ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసింది. జర్మనీకి ప్రపంచకప్‌లో ఘనమైన చరిత్ర ఉంది. జర్మనీ ఇప్పటి వరకు 8సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో 4సార్లు విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్‌లో మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరలేదు. జర్మనీ 1954, 1974, 1990, 2014లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. కిందటిసారి బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా జర్మనీ ట్రోఫీని సాధించింది. మరోవైపు 1966, 1982, 1986, 2002 లలో జరిగిన ప్రపంచకప్‌లలో జర్మనీ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి కూడా జర్మనీ ఫేవరెట్‌గా మారింది. యూరప్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో జర్మనీకే మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటలీ కూడా…
మరోవైపు యూరప్‌కే చెందిన మరో జట్టు ఇటలీకి కూడా ప్రపంచకప్‌లో అద్భుత రికార్డు ఉంది. జర్మనీతో సమంగా నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. అర్హత పోటీల్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ప్రపంచకప్‌లో ఇటలీ తనదైన ముద్ర వేసింది. బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనాలతో సమఉజ్జీగా పరిగణించే ఇటలీ ఈసారి లేక పోవడం ప్రపంచకప్‌కు పెద్ద లోటుగానే పరిగణిస్తున్నారు. 1930 నుంచి ఇటలీ క్రమం తప్పకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయింది. 1934, 1938, 1982, 2006లలో ఇటలీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అంతేగాక 1970, 1994లలో రన్నరప్‌ను సాధించింది. ఇటలీ మొత్తం ఆరు సార్లు ఫైనల్‌కు చేరింది. ఇందులో నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో రెండు సార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. మరోవైపు యూరప్‌కు చెందిన ఇంగ్లండ్ 1966లో, ఫ్రా న్స్ 1998లో, స్పెయిన్ 2010లో ప్రపంచకప్ విజేతగా నిలిచాయి. మరోవైపు యూరప్‌కే చెందిన నెదర్లాండ్స్ మూడు సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. చెక్ రిపబ్లిక్, హంగేరిలు కూడా రెండేసి సార్లు ఫైనల్లో ప్రవేశించినా ట్రోఫీని ముద్దాడ లేక పోయాయి. స్వీడన్ ఒకసారి రన్నరప్‌గా నిలిచింది.

Comments

comments