Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

చౌకగా మందులు

రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆసుపత్రులలో జెనరిక్ మెడికల్ షాపులు

హిందూస్థాన్ లేటెక్స్‌తో ఒప్పందం

350 దుకాణాల ఏర్పాటుకు అవకాశం

Medical-Shops

హైదరాబాద్ : పేదలకు ధరలను అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా జెనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయడానికి కేం ద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్వమే సంప్రదింపులతో ఒక అవగాహన కుదిరినప్పటికీ పరిపాలనాపరమైన ఇబ్బందులో ఆ ఒప్పందం అమలులోకి రాలేకపోయింది. ఇటీవలి కాలంలో ఆంక్షలన్నీ తొలగిపోవడంతో త్వరలోనే ప్రతీ ప్రభుత్వాసుపత్రిలో ఒక జెనరిక్ ఔషధాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా హెచ్‌ఎల్‌ఎల్ ప్రక్రియను వేగవంతం చేయనుంది. నిర్దిష్టంగా గడువును విధించుకోకపోయినప్పటికీ త్వరలోనే ఈ ఒప్పందం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా ప్రతీ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మందుల దుకాణం ఏర్పాటుచేయడానికి అనువైన స్థలం, భవనం, విద్యుత్, నీటి సౌకర్యా న్ని ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలోని ఐదు వైద్య కళాశాలలు (టీచింగ్ హాస్పిటళ్ళు), ఎనిమిది జనరల్ ఆసుపత్రులు, పన్నెండు జిల్లా ఆసు పత్రులు, 130 ఏరియా ఆసుపత్రులు, 200కు పైగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో జెనరిక్ ఔషధా లయాలు ఏర్పాటు కానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘జన్ ఔషధి’ పథకంలో భాగంగా రాష్ట్రం లో జెనరిక్ ఔషధాలయాలను ప్రోత్సహించాలని, ఫలితంగా సామాన్యులకు వైద్యఖర్చుల్లో ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు హెచ్‌ఎల్‌ఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి ఔషధాలయాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని హెచ్‌ఎల్‌ఎల్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే మందుల కంపెనీల నుంచి గుత్త ధరకు కొన్న తర్వాత దానిపై నిర్దిష్టంగా కొంత మొత్తాన్ని కమిషన్‌గా నిర్ణయించి వినియోగదారులకు విక్రయిస్తుందని, ఒకవేళ ప్యాకింగ్ చేసి విక్రయించాల్సి వస్తే ఆ ప్యాకింగ్ ఖర్చును కూడా ఆ సంస్థే భరించి మరికొంత అదనపు కమిషన్‌ను తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు. ప్త్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న ధరలతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు చాలా తక్కువగా (60% తక్కువ) ఉంటాయని, అందువల్లనే ప్రభుత్వాసుపత్రుల్లో వీటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసిందని వివరించారు. జెనరిక్ మందులకు బ్రాండ్ పేర్లకు బదులుగా అందులో వినియోగించే మిశ్రమం (కాంబినేషన్) పేరు మాత్రమే ఉంటున్నందున చీటీలపై (మెడికల్ ప్రిస్క్రిప్షన్) ఆ కాంబినేషన్‌నే రాయాల్సిందిగా అన్ని ప్రభుత్వాసుపత్రుల డాక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే కర్నాటక, తమిళనాడుల్లో హెచ్‌ఎల్‌ఎల్ ఇలాంటి దుకాణాలను నిర్వహిస్తోందని, తెలంగాణలో కూడా త్వరలోనే తెలంగాణలో సైతం ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఒక జెనరిక్ మందుల దుకాణం ఉన్నా బ్రాండ్ల మందులకే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ఆ ఆలోచనలో మార్పు వస్తే జెనరిక్ మందుల వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 జెనరిక్ ఔషధ దుకాణాలు ఉన్నాయి. ఇందులో సుమారు 700 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. దేశం మొత్తంమీద సుమారు 3,300 జెనరిక్ మందుల దుకాణాలు ఉంటే, ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 550కు పైగా, కేరళలో 340, తమిళనాడులో 330, గుజరాత్‌లో 325, కర్నాటకలో 320, మహారాష్ట్రలో 230 చొప్పున ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రతీ మెడికల్ షాపులో ప్రత్యేక ఏర్పాటు
జెనరిక్ మందులను విక్రయిస్తున్న ప్రతీ మందులషాపు వాటిని ప్రత్యేక అర (షెల్ఫ్)లో పెట్టాలని, ఇందుకోసం విడిగా ఒక ర్యాక్ (అల్మారా)ను ఏర్పాటుచేయాలని కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ ఎస్ ఈశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్‌లకు మంగళవారం ఒక లేఖ రాశారు. బ్రాండ్లతో విక్రయిస్తున్న మందులతో జెనరిక్ మందులను కలపరాదని, వీటిని విక్రయిస్తున్న సమాచారం ప్రజలకు తెలిసేలా తప్పకుండా ఆ దుకాణంలో అర ఉండాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేశారు. గత కొంతకాలంగా జెనరిక్ మందులను అందుబాటులో ఉంచాలంటూ విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయని, ‘డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ’ సమావేశంలోనూ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించినట్లు గుర్తుచేశారు. బ్రాండ్ల మందులతో కలిసిపోకుండా వినియోగదారులకు వెంటనే స్పష్టంగా అర్థమయ్యేలా జెనరిక్ మందుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్న నిర్ణయం జరిగిందని, దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్‌లు జెనరిక్ మందులను విక్రయిస్తున్న అన్ని మందుల షాపుల్లో ఈ ఏర్పాట్లు ఉండే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Comments

comments