Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

‘మేము అశక్తులం’-ఆర్‌బిఐ

The old man died in the pit

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (తిరిగిరాని మొండి బాకీలు) వసూలు చేయటానికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించినప్పటికీ అవి హనుమంతుని వాలంలా పెరుగుతున్నాయి. ఎన్‌పిఎలు తగ్గించటానికి మొండి బాకీల్లో కొంత శాతాన్ని మాఫీ చేయటం, దివాలా చట్టాన్ని ప్రయో గించి ట్రిబ్యునళ్ల ద్వారా వడ్డీ మినహాయించి మూలరుణంలో కొంత తగ్గించి (హెయిర్ కట్) కొంత వసూలు చేయటం, ఆస్తుల వేలం తదితర పద్ధతులను ప్రయోగిస్తున్నారు. రద్దు చేసిన బాకీలకు సర్దుబాటుగా బ్యాంకులు తమ లాభాల నుంచి కేటాయింపులు చేయటంతో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా అనేక బ్యాంకుల లాభాలు కనిష్ట స్థాయికి పడిపోవటమో లేక నష్టాల్లోకి దిగజారటమో చూస్తున్నాం. ఈ సర్దుబాటు పద్ధతి ద్వారా బా్ంయకులు కొద్ది సంవత్సరాల్లో ఎన్‌పిఎల నుంచి బయటపడి లాభాలబాట పడతాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని కొన్ని అంతర్జాతీయ పరపతి సంస్థలు వ్యాఖ్యానించాయి. ఎన్‌పిఎల సుడిగుండం నుంచి బ్యాంకులు గట్టెక్కుతాయా?
ఆర్థిక మంత్రిత్వ శాఖపై పార్లమెంటరీ కమిటీ ముందు మంగళవారం హాజరైన రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ వాంగ్మూలం, సమర్పించిన పత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోడీ రూ. 13 వేల కోట్లకు దగా చేసిన ఘటనపై కమిటీ సభ్యులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా, బ్యాంకింగ్ వ్యవస్థకు నిర్దేశించిన మూడంచెల రక్షణను పాటించని బ్యాంక్ మేనేజిమెంట్‌దే బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా మరో ముఖ్యమైన సమస్యను వారి దృష్టికి తెచ్చారు. అదేమంటే ‘ప్రభుత్వ రంగ బ్యాంకులపై నియంత్రణకు ఆర్‌బిఐకు తగినన్ని అధికారాలు లేవు. అవి బ్యాంకింగ్ కంపెనీలు కావు కార్పొరేషన్‌లు. అందువల్ల అవి నేరుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 కిందకు రావు.’ అంటే వాటిపై పెత్తనం ఆర్థిక మంత్రిత్వ శాఖదేగాని ఆర్‌బిఐది కాదు. అయితే ఈ విషయాన్ని కొంత కాలం క్రితం ఆర్థిక శాఖ త్రోసిపుచ్చుతూ ఆర్‌బిఐకి తగిన పర్యవేక్షణాధికారాలున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ కమిటీ నిగ్గు తేల్చి వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగిన సిఫారసులు చేస్తుందని ఆశించుదాం.
ప్రభుత్వరంగ బ్యాంకులపై పర్యవేక్షణకై ఆర్‌బిఐ కోరుతున్న అధికారాలు సిఎండి తొలగింపు, నియామకం; లైసెన్సుల మంజూరు, ఆ సమయంలో షరతుల విధింపు; ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, పూర్తికాలం డైరెక్టర్, మేనేజర్ లేక సిఎండి నియామకం ఆమోదం, పునర్నియామకం లేక నియామకం రద్దు; డైరెక్టర్స్ బోర్డు రద్దు, బ్యాంకుల మూసివేతకు దరఖాస్తు చేయటం, స్వచ్ఛంద విలీన పథకం మంజూరు చేయటం వగైరా.
మొండి బకాయిల పరిష్కారానికి తమకున్న వనరులు, అధికార పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పటేల్ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌పిఎలపై ఆయన సమర్పించిన పత్రం ఇలా తెలియజేసింది. 2017 18 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి 2017 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పిఎలు రూ. 1,50,960 కోట్లు తగ్గాయి. వాటిలో వాస్తవ రికవరీ రూ. 41,391 కోట్లు. రద్దు చేసిన ఎన్‌పిఎలు రూ. 84,272 కోట్లు. ఖాతాలను అప్‌గ్రేడ్ చేసినవి రూ. 25,297 కోట్లు. అయితే అదే కాలంలో కొత్తగా ఎన్‌పిఎల్లో చేరిన మొత్తం రూ. 2,37,475 కోట్లు. వెరసి డిసెంబర్ 31 నాటికి మొత్తం ఎన్‌పిఎలు రూ. 7,77,280 కోట్లకు చేరాయి. ప్రైవేటు బ్యాంకుల సంగతీ అంతే ఎన్‌పిఎలు రూ. 46,091 కోట్లు తగ్గగా రూ. 60,800 కోట్లు కొత్తగా చేరాయి. వెరసి మొత్తం ఎన్‌పిఎల విలువ రూ. 1,07,796 కోట్లు.
రూ. 1 లక్షకు పైగా బ్యాంకుల్ని మోసగించిన కేసులు 201718 లో 26 శాతం పెరిగి 5904కు చేరాయి. వాటి విలువ రూ. 18,698 కోట్ల 8 లక్షల నుంచి రూ. 32,361 కోట్ల 27 లక్షలకు చేరింది.
మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత అస్తుబిస్తుగా, కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా ఎలా సాగుతుందో పై సంఖ్యలు విదితం చేస్తున్నాయి. ఆ నష్ట పోయేదంతా ప్రజల సొమ్ము. కాబట్టి రీకాపిటలైజేషన్‌తో బ్యాంకులను ఆదుకోవటంతోపాటు ఈ వ్యవస్థను ఆమూలాగ్రం సంస్కరించాలి. ఆర్‌బిఐని విశ్వాసంలోకి తీసుకుని ప్రభుత్వం నడుం కట్టాలి.

Comments

comments