Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ముస్లీంల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి

Governments efforts for the development of Muslims
మనతెలంగాణ/హుజూర్‌నగర్: భారతదేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని విద్యుత్, ఎస్సీకులాల అభివృద్దిశాఖల మంత్రి గుంతకంట్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్ హాల్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన తడిచెత్త,పొడిచెత్త బుట్టల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చామని, చెప్పని హామీలను కూడా నెరవేర్చామని మంత్రి అన్నారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నప్పటికీ, చివరిపంటకు కూడా సరిపడా నీళ్ళను అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఇన్ని ఏళ్లలో రైతుల గురించి ఏఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంతగా ఆలోచించలేదన్నారు. తెలంగాణ రైతాంగం కోసం రైతుబంధు పథకం ఎంతో చారిత్రాత్మకమన్నారు. ఒకకుంట భూమి ఉన్న రైతులకు కూడా రైతు బీమా వర్తిస్తుందన్నారు. అకాలమరణమైనా,ఏదేని కారణంగానైనా రైతు మృతిచెందితే రైతుబీమా ఇన్సూరెన్సు ద్వారా ప్రభుత్వం రూ, 5లక్షలను, కేవలం పదిరోజుల్లోనే మృతుని కుటుంబానికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఆసరా ఫించన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు.

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోనే ప్రతినెల సుమారు 50 లక్షల రూపాయలను ఆసరాఫించన్‌ల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు. 24 గంటల కరెంట్ , కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి శ్రమ అంతాఇంతా కాదన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రతిఒక్కరూ ఇంటింటికి 6 చెట్లను పెంచాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, పర్యావరణాన్ని రక్షించడం ద్వారా అనారోగ్యాల బారినుండి బయట పడవచ్చన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ మంజూరుకానన్ని నిధులు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా ముస్లీంలకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత దుస్తులను స్ధానిక షాధీఖానా ఉర్దుఘర్‌లో పంపిణీ చేశారు. ముస్లీం మైనార్టీల అభ్యున్నతికీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కమీషనర్ చింతా. వేణు, ఆర్‌డీఓ భిక్షానాయక్, వైస్‌చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ కాసోజు శంకరమ్మ, మాజీ యంపిపి నర్సింగ్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కస్తాల కోటమ్మ రామయ్య, మున్సిపాలిటీ పాలకవర్గం, కార్యాలయ సిబ్బంది, సమభావన సంఘాల సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments