Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

80% భవనాలకు ఫైర్ సేఫ్టీ లేదు

fire

 అగ్నిమాపక శాఖ నుంచి అక్రమ అనుమతులు 

 తనిఖీలు నిల్.. మాక్ డ్రిల్‌కే పరిమితమైన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో 80 శాతం భవనాలకు ఫైర్ సేఫ్టీలు లేవు. శుక్రవారం సికింద్రాబాద్ రాణిగంజ్ ప్రాంతంలో గల ఎషియన్ పేయింట్స్ గోదాములో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంభవించిన భవనంలో కూడా ఎలాంటి ఫైర్ సేప్టీలు లేవు. ఇలాంటి భవనాలు, గౌడాన్‌లు హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉండవచ్చని అంచనా. అగ్నిమాపక శాఖ అధికారుల అవినీతి వల్ల ఫైర్ సేప్టీ లేని భవనాలకు కూడా అనుమతులు మంజూరు చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఫలితంగా 2016లో రాష్ట్రంలో మొత్తం అగ్నిప్రమాదాలు 9286 చోటుచేసుకోగా అందులో  108 భారీ అగ్నిప్రమాదాలు ఉన్నాయి. ఇక  2017లో  9811కు పెరిగాయి ఇక భారీ అగ్నిప్రమాదాలు కూడా 124కు చేరుకున్నాయి.ఒక్క ఏడాదిలోనే భారీ  ప్రమాదాల ఘటనలు 12 శాతం పెరిగాయి. ఇక అగ్నిప్రమాదాలలో 2016లో 174 మంది మరణిస్తే 2017లో 197 మంది మరణించారు. ఏటేటా ప్రహాదాలు, మృతుల సంఖ్య పెరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నివారణ చర్యలపై దృష్టి పెట్టడంలేదనే అరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార సముదాయం కలిగిన భవనాలలో ఒకవేళ్ల అగ్నిప్రమాదం చోటుచేసుకున్నా అక్కడికి ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నా మంటలు ఆర్పేందుకు సరైన స్థలం, సదుపాయాలు ఉండవు. ఫలితంగా మంటలను సకాలంలో అదుపు చేయడం సాధ్యమయ్యేపనికాదు. ఇంతలోపు మంటలు మరింత వ్యాపించి ప్రాణ, ఆస్థి నష్టం పెరుగుతాయి. భవన యజమానులు నియమ నిబంధనలు పాటించకపోవడమే..అడ్డదారుల్లో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందడం ఇందుకు కారణం. హైదరాబాద్, సైబరాబాద్ పరిధితో పాటు ఆయా జిల్లా కేంద్రాలలో ఉన్న హోటళ్లలో కూడా సరైన ఫైర్ సేఫ్టిలు లేవు. ఇక్కడ వంట గదిలో 24 గంటలు గ్యాస్ సిలిండర్లు డజన్ల కొద్ది ఉంటాయి. ఏదైనా సిలిండర్ ప్రమాదవశాత్తు పేలితే భారీ నష్టమే జరుగుతుంది. ఒకవేళ్ల ప్రమాదం చోటుచేసుకున్నా వినియోగదారులు తప్పించుకునేందుకు సరైన మార్గాలు సైతం లేవు. ఇలాంటి భవనాలు, హోటళ్లకు కూడా అగ్నిమాపక శాఖ అనుమతులు ఇచ్చింది. ఫైర్ అనుమతి కోసం వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం, నియమ నిబంధనలు సరిగా ఉన్నాయా లేవా అనేది ప్రత్యక్షంగా పర్యవేక్షించి అనుమతులు మంజూరు చేయాలి. అయితే అధికారులు మామూళ్ల ముసుగులో తూతూ మంత్రంగా తనిఖీలు చేసి తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఉన్నతాధికారులు అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఇక భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అగ్నిమాపక శాఖ అధికారులు ఆ తరువాత ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టరు. ఫైర్ సేప్టీ లేని భవనాలు, వాణ్యిజ్య సంస్థలు, హోటళ్లు తదితర వ్యాపార గౌడాన్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లనే  యజమానులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.పేలుడు స్వభావం, మంటలు వ్యాపించే గుణం కలిగిన వస్తువులు భద్రపరిచే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ నియమ నిబంధనల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు సరిగా తనిఖీ చేయకపోవడం వల్ల విచ్చలవిడిగా వ్యాపారులు సరుకులను గౌడాన్‌లలో నింపేస్తున్నారు. ఎషియన్ పేయింట్స్ గౌడాన్‌లో కూడా అచ్చం ఇదే జరిగింది. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే టన్నుల కొద్ది రంగు డబ్బాలు నిల్వ చేయడం వల్ల ప్రమాద స్థాయి భారీగా పెరిగింది.త ఇక పారిశ్రామిక ప్రాంతంలో సైతం ఫైర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన పలు అగ్నిప్రమాదాలే నిదర్శనం. కొన్ని సందర్భాలలో కార్మాగారాలలో జరిగిన అగ్నిప్రమాదాల్లో కార్మికులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. పారిశ్రామిక వాడల్లో ఏ కంపెనీ ఫైర్ సేప్టీ సమకూర్చుకుంది, ఏ కంపెనీ సమకూర్చుకోలేదు అనే అంశాలను అగ్నిమాపక శాఖ అధికారులు విస్మరించారు. ఫలితంగానే ఆయా కంపెనీలలో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏవైనా మంటలను సకాలంలో ఆర్పడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. వారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే కంపెనీ యాజమాన్యాలు, అధికారులు కుమ్మక్కు కావడం వల్లనే అక్రమ మార్గంలో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందుతున్నారు. ఎషియన్ పేయింట్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకోనైనా సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఫైర్ సేప్టీ లేని భవనాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లపై కేసులు నమోదు చేయడం ద్వారా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

Comments

comments