Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

Jagadeesh Reddy Speech About Muslims Minorities

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : ముస్లీం, మైనార్టీల అభివృద్ధి టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే జరిగిందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మైనార్టీలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. షాదీ ముబారక్, పేదింటి మైనార్టీ యువతుల వివాహాలకు లక్షా పదహారు రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. విద్యారంగంలో మైనార్టీ గురుకులు పాఠశాలలను స్థాపించి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. గత పాలకుల నిర్లక్షంతో మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ ఫలాలు ముస్లీం కుటుంబాలకు అందేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ముస్లీం సోదరుల పవిత్ర పర్వదినమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు, దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన వివరించారు.  కాంగ్రెస్ నాయకులు ముస్లీం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గమనించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లినా రాష్ట్రముఖ్యమంత్రి కేసిఆర్‌కు మైనార్టీలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. దేశం తెలంగాణ వైపు చూసే విధంగా 29 రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో కూడా ప్ర వేశపెట్టని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణను ఆదర్శంగా తీసుకునేలా ప్రధాని సైతం సూచించడం గమనార్హమన్నారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విమ ర్శలు మాని మైనార్టీల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్దికై, బంగారు తెలంగాణ సాధించేందుకు సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎవి.రంగనాద్, ముస్లీం మత పెద్దలు, జేసి నారాయణరెడ్డి, ఆర్‌డిఒ వెంకటాచారి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బకరం వెంకన్న, నాయకులు బషీర్, జమాల్ ఖాద్రి, అఫాన్ అలీ, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments