Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నేటి నుంచి ‘ జయశంకర్ బడిబాట’

Jayasankar school path launches program in Warangal

మన తెలంగాణ/ వరం గల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : నేటి నుంచి జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రారంభం కానుంది. పాఠశాల విద్యపై ప్రత్యేకదృష్టి సారించిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్షంగా ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే విద్యాసంవత్సరం ప్రా రంభం కాగానే జయశంకర్ పేరుతో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడిబాటలో భాగంగా నేటి నుంచి 8వ తేదీ వరకూ రోజుకో వినూత్నమైన కార్యక్రమాన్ని పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమాన్ని విధిగా నిర్వహంచాలని ఇప్పటికే సంబంధిత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభం రోజున అనగా నేడు (సోమవారం) మన ఊరి బడి కార్యక్రమం పేరుతో పాఠశాలలను ఆకర్శణీయంగా తీర్చిదిద్దనున్నారు. గ్రామాలలో బ్యానర్లు కట్టడం, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, గ్రామంలో ర్యాలీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధన పద్ధతులను వివరిస్తూ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచే విధంగా గ్రామ ప్రజలకు వివరించనున్నారు. రెండవ రోజు (5వ తేదీన) ప్రతి పాఠశాలలో బాలిక విద్యపై దృష్టి సారించేందుకు ప్రణాళికలు రూపొందించడం, బాలికలకు మార్షియల్ ఆర్ట్, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. మహిళాధికారులతో ఉపన్యాసాలు ఇప్పించనున్నారు. 6వ తేదీన ప్రతి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కా ర్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడంతో పాటు కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. 7వ తేదీ స్వచ్ఛ పాఠశాల, హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చివరి రోజున (8వ తేదీన) బడి బయట ఉన్న పిల్లలను బడి లో చేర్పించే కార్యక్రమాన్ని, పనుల కోసం వలసలు వచ్చిన వారి పిల్లలను గుర్తించడం, సమీపంలో ఉన్న పాఠ శాలలో చేరే విధంగా అవగాహన కల్పించడం, మం డల టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి బాల కార్మి కులకు విముక్తి కలిగించే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఫలితాన్నిచ్చేనా…?
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఫలితాన్నిచ్చేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో చేపట్టినప్పటిన కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అమలు చేస్తారా…? లేక తూతూ మంత్రంగా నిర్వహించి చేతలు దులుపుకుంటారా…? అనే సందేహాలు వ్యక్తమవడం గమనార్హం. ఇప్పటికై ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ అనుకున్న స్థాయితో పర్యవేక్షణలు లేకపోవడం, ఉపాద్యాయుల అంకిత భావం కొరవడటం, ఫలితంగా ప్రయివేటు వైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపడం జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కలిగించడతో పాటు బడిబయట ఉన్న పిల్లలను గుర్తించడం, బడిలో చేర్పించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, స్థానికంగా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లాంటి కార్యక్రమాలతో బడిబాట నిర్వహించడం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పలువురు భావిస్తున్నారు. అయితే లక్షశుద్దితో నిర్వహించే బడిబాటను అంకితభావంతో నిర్వహిస్తేనే ఫలితం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం.

Comments

comments