Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అంబేద్కర్ బాటలో కెసిఆర్

kcr

ఆధునిక భారతదేశ చరిత్రలో దేశానికి స్వాతంత్య్రం రావడం అతి గొప్ప విజయమైతే అంతటి మరో విజయం స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటం. రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాల్లో అంబేద్కర్ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటి పరిపాలనా సౌలభ్యం కాగా, రెండవది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జాతుల అభ్యున్నతికి అవకాశం కల్పించడం. చిన్న రాష్ట్రాల సిద్ధాంత కర్త, కుల నిర్మూలన, దళితుల హక్కుల కోసం పోరాడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నది. కుల వ్యవస్థ ద్వారా పీడింపబడుతున్న జాతులతో పాటు స్త్రీలు కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరమున్నది. రాష్ట్రాల ఏర్పాటుతో ఎలాంటి అద్భుత ఫలితాలుంటాయో రాజ్యాంగ నిర్మాత దూరదృష్టి వర్తమాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన చూస్తే అర్థమవుతుంది. ఉమ్మడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో మన 10 జిల్లాల తెలంగాణ ప్రాంతానికి జరిగినా అన్యాయం ఎంతటిదో అందరికి తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికన చూస్తే నేటి తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక అభివృద్ధిలో వ్యవసాయ రంగంతోపాటు ఇతర రంగాల్లో వెనుకబడిన కులాలకు, దళితులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. అన్ని కులాల వృత్తులను కాపాడే నిర్ణయంతో కుల వృత్తులను కాపాడుతూ పల్లె కన్నీరును తుడుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ నిరుద్యోగాన్ని పారదోలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దళితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది.
దళిత పారిశ్రామిక వేత్తలను తయారు చేయడం సులభతరమైంది. వేల కోట్ల రూపాయలతో గిరిజన, వెనుకబడిన తరగతులకు, మైనారిటీలకు సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ మైలురాయి. వాటి దినదిన అభివృద్ధి రాష్ట్ర ఖ్యాతిని విశ్వరూపం చేసింది. విద్య కోసం ప్రభుత్వం చేసే కృషి ఎవరెస్టు శిఖరం అయితే, జీవచ్చవాలుగా ఉన్న వెనుకబడిన కులాల వారి జీవన వృత్తుల ప్రోత్సాహం అంతకంటే ఎక్కువ. వృత్తుల ప్రోత్సాహం ఆర్థిక సమానత్వం వైపు అడుగులు పడే అవకాశం ఇచ్చింది. ఇవన్నీ ‘రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్’ కోరుకున్న సామాజిక అభివృద్ధి ఆశయాలు, రాజకీయ పదవుల్లో ముఖ్యంగా మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్‌లు కల్పించిన మహనీయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్. అదే కాకుండా తెరాస పార్టీలో కూడా రిజర్వేషన్ల అమలు చేసి చరిత్రలో నిలిచినాడు కెసిఆర్. ఇవన్నీ అమలు చేయడం చూస్తే కెసిఆర్‌కు దళితులపై ఎంత ప్రేముందో తెలుస్తుంది. దళితులకు మూడెకరాల భూమి, ఆడబిడ్డల పెళ్లిలకు కల్యాణ లక్ష్మి, విదేశాల్లో విద్యను అభ్యసించే దళిత బిడ్డలకు 20 లక్షల ఆర్థిక సాయం. ఇలా ఒక్కటేంటి ఎన్నో కార్యక్రమాలు దళితుల అభ్యన్నతికి కృషి చేస్తున్నారు. ఈ కృషి దళితుల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప చేసింది. సమాజంలో వారి, ఆత్మ గౌరవాన్ని సామాజిక స్థాయిని పెంచి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. అంబేద్కర్ ఆశయాలను మక్కికిమక్కి ఈ దేశంలో ఎవరైనా అమలు చేస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే. దళితులను సంపద సృష్టికర్తలుగా చేస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం. ఇంకా మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు పెద్ద దిక్కు కావాలని కోరుకుంటున్నాం.

Comments

comments