Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

చెప్పినా వినరా?

ktr1

వద్దంటే ఎందుకు రోడ్లు తవ్వుతున్నారు
హైదరాబాద్ నగరంలో రహదారుల తవ్వకాలు, గుంతలపై మంత్రి కెటి రామారావు సీరియస్

మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో : మహానగర రోడ్ల పరిస్థితిపై మున్సిపల్‌శాఖమంత్రి కె.టి.రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రోడ్లు తవ్వొద్దని చెబుతున్నా ఎందుకు తవ్వుతున్నారో అర్థం కావడం లేదంటూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో కెటిఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడో ఇచ్చిన అనుమతులను చూపిం చి, ఇప్పటికీ వాటిని కొనసాగించడమేమింటూ ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. నగరం లో రోడ్ల తవ్వకాలకు సంబంధించి వస్తోన్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాలంటే చాలా ఇబ్బంది గా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదన్న మంత్రి, గుంతలు ఎందుకున్నాయంటూ అధికారులను నిలదీశారు. మంగళవా రం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నాలా ల పూడికతీత, రోడ్ల నిర్మాణం, జవహర్‌నగర్ డం పింగ్‌యార్డ్ క్యాపింగ్ పురోగతి, వర్షాకాల సన్నద్ధ్దత, శిథిలా భవనాల తొలగింపు, వాటర్‌బోర్డ్, హెచ్‌ఆర్‌డిసి రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ తదితర అం శాలపై కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మున్సిపల్ శాఖముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న రోడ్ల నిర్మా ణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఈ విషయంలో జోనల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నాలాల పూడికతీత పనులు మరింత ముమ్మరం చేయడంతోపాటు పురాతన శిథిలా భవనాలు, నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను అదేశించారు. రుతుపవనాలు ప్రభావంతో ఇప్పటికే నగరంలో వర్షాలు ప్రారంభం అయినందున నాలాల్లో పూడిక పనులు మరింత వేగవంతం చేయాలని అన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణౠలు, శిథిల భవనాల తొలగింపులో ఏవిధమైన అలసత్వం వహించవద్దని, ఈ విషయంలో ఎవరు అడ్డం వచ్చినా తగిన కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. శిథిల భవనాలు, నాలాలు, చెరువులపై అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియ నిరుత్సాహకరంగా ఉందని, అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్ విభాగాలు సమన్యయంతో పనిచేయాలని అన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకోవాలని, ఒకసారి నిర్మితమైతే వాటిని తొలగించేందుకు సమస్యగా మారుతుందని అన్నారు. ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా చేపట్టిన పనులను పూర్తిచేయాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్లాస్టిక్ వినియోగంపై మంత్రి అసంతృప్తి: జిహెచ్‌ఎంసి కార్యాలయంలో వాటర్ బాటిళ్లు వాడడం పట్ల మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 నాటికి హైదరాబాద్ నగరంలో ఒక సారి వా డి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నిర్ణయించినప్పటికీ త నకు వాడి పడేసిన ఖాళీ వాటర్ బాటిల్ జిహెచ్‌ఎంసిలో కనిపించాయని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం పై నిషేదాన్ని పాటించాలని జిహెచ్‌ఎంసితో పాటు ఇతర శాఖల అధికారులను అదేశించారు.
10 జోన్లు, 50 సర్కిళ్లు: నగరవాసులకు మరింత మెరుగైన పౌర సేవలను కల్పించడానికి అధికార వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని కెటిఆర్ అన్నా రు. ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను 10కి, 30 సర్కిళ్లను 50కి పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అదేశించారు. ఒక సర్కిల్‌ను 3 వార్డులతో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
ప్రత్యేక భూసేకరణ విభాగం: జిహెచ్‌ఎంసిలో చేపట్టిన భారీ ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు ఇతర పనులతో తీవ్రమైన పని ఒత్తిడితో ఉన్నందున జిహెచ్‌ఎంసికి అవసరమైన భూసేకరణ అందించడానికి తగు సమయం కేటాయించలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు భారతిహోలీకెరి, ముషారప్ అలీ, అద్వైత్‌కుమార్‌సింగ్, సిక్తాపట్నాయక్, పబ్లిక్ హెల్త్ ఇ.ఎన్.సి ధన్‌సింగ్, చీఫ్ ఇంజనీర్లు జియాఉద్దీన్, మోహన్‌నాయక్, శ్రీధర్, వాటర్‌బోర్డ్ ఇ.డి సత్యనారాయణ, ట్రాఫిక్ అదనపు సి.పి చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments