Search
Tuesday 19 June 2018
  • :
  • :

తప్పులు …. తలనొప్పులు

Mistakes In Revenue Records In Medak District

భూదస్త్రాల ప్రక్షాళన చేసి పారదర్శకమైన సేవలందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినప్పటికీ కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది నిరక్ష్యం వల్ల తప్పులు నమోదయ్యాయి. విస్తీర్ణంలో తగ్గుదల, ఒకరి పేరుకు బదలు మరొకరి పేరు, ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో ఇలా తప్పులు దొర్లాయి. వీటన్నింటినీ సవరించే పనులు ప్రస్తుతం తహసీల్ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. ఈనెల 15వ తేదిలోపు అన్ని సవరణలు పూర్తిచేసి మిగిలిన వారికి పాసుపుస్తకాలు అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
మన తెలంగాణ/పెద్దశంకరంపేట : రెవెన్యూ రికార్డుల దుమ్ము దులిపే కార్యక్రమంలో భాగంగా కొనసాగిన భూ ప్రక్షాళన ఇంకా పరిపూర్తి కాలేదు. కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేసినప్పటికినీ కొన్నిచోట్ల తప్పులు నమోదు కావడంతో అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. బోగస్ హక్కు పత్రాలకు చెక్‌పెట్టి, చెమటోడ్చే రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఇంకా వంద శాతానికి చేరుకోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పట్టాదారు పాసుపుస్తకాలు, వ్యవసాయానికి పెట్టుబడి చెక్కులను అందించే చర్యలు చేపట్టింది. వెంటనే కలెక్టర్లంతా జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి పాస్‌పుస్తకాల్లో జరిగిన తప్పులను వెంటనే సరిదిద్దాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పులను సవరించి మళ్లీ కొత్తగా ముద్రించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉంది.
14 అంశాల్లో… పట్టాదారు పాసుపుస్తకాల్లో ప్రధానంగా 14 అంశాల్లో తప్పులు దొర్లినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రైతుబంధు పథకం కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం భూ ప్రక్షాళన పథకం ప్రవేశ పెట్టింది. రెవెన్యూ అధికారులతో తహసీల్దారు కార్యాలయంలో ఉన్న వివరాలతో పాటు గ్రామాల్లో పర్యటించి రైతుల నుంచి పాత 1బి ఖాతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూమి కొనుగోలు దస్తావేజులు సేకరించారు. గ్రామాల వారీగా ఏయే సర్వేనెంబర్‌లో ఏయే రైతు సాగు చేస్తున్నరో? లెక్కలు తీశారు. చనిపోయిన వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించి విరాసత్ కింద కుటుంబ సభ్యుల పేర్లు రాసుకున్నారు. భూములు విక్రయించిన వారి పేర్లనూ సేకరించారు. ఒక్కో గ్రామంలో వారం రోజులపాటు సర్వే చేశారు.
ఈనెల 15 వరకు గడువు : రైతుబంధు పథకం కింద జారీ చేయాల్సిన పాసుపుస్తకాలను అందించేందుకు ఈనెల 15వ తేది తుది గడువు విధించారు. పార్ట్ ఎ లో చూపిన ఖాతాల సంఖ్యకు అనుగుణంగా మరికొన్ని పట్టాదారు పాస్తుపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. జూన్ 15వ తేది వరకు పార్ట్ ఎ లో చూపిన మొత్తం ఖాతా నెంబర్ల ముద్రణ పూర్తి చేయాల్సి ఉంది. ఈలోపు రెవెన్యూ అధికారులంతా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి తప్పులు జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల రైతులను కలిసి సరైన వివరాలను సేకరిస్తున్నారు. నిర్ణీత గడువులోగా మిగిలిన వారందరికీ పాసుపుస్తకాలను జారీ చేసందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. రైతుబంధు పథకం మే 10వ తేదిన నుంచి వారం రోజులపాటు గ్రామాలలో నిర్వహించారు. ఇందులో షెడ్యూల్‌ల వారీగా గ్రామాలను ఎంపిక చేసి అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. మండల వ్యవసాయాధికారులు, మండల విద్యాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీరాజ్ ఎఇ, ఈఓపిఆర్‌డి తదితర మండల స్థాయి అధికారుల బృందం గ్రామాల వారీగా పర్యటనలు జరిపి చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేసింది. మే 10వ తేదిన మండల పరిధిలోని జూకల్‌లో నిర్వహించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి అక్కడి రైతులిచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ పద్మారావుపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తప్పులను సవరించి కొత్త పాసుపుస్తకాలను అందజేయాలని అక్కడికక్కడే అదేశాలు జారీ చేశారు.

Comments

comments