Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

మా గోడు వినేదెవరూ..?

 Money Paying 200 people to the school owner

సంగారెడ్డి టౌన్: పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు అమ్ముకొని కంది కేశవరెడ్డి పాఠశాలలో చదువుకునేందుకు డబ్బులు డిపాజిట్ చేసి అడ్మిషన్లు తీసుకున్నామని, పాఠశాల యాజమాన్యం చేతులెత్తేయడంతో మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, కేశవరెడ్డి పాఠశాల బాధితులు ఆవేధన వ్యక్తం చేశారు. ఆదివారం పోతిరెడ్డిపల్లిలోని శివాలయంలో బాధితులంతా సమావేశమై మాట్లాడుతూ మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. కంది కేశవరెడ్డి పాఠశాలలో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, తమ స్తోమతకు మించి ఒక్కొక్కరం రూ.3లక్షల నుండి 4లక్షల వరకు సుమారు 200 మంది పాఠశాల యాజమాన్యానికి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. ఒకటవ తరగతి నుండి పదోతరగతి వరకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా చదివించి, చదువు ముగిసిన వెంటనే డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం ప్రామిసరీ నోట్ వ్రాయించిందని, పాఠశాల యాజమాన్యం నష్టాల్లో ఉందనే నెపంతో చేతులెత్తేశారని, ఇప్పుడు తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేధన వ్యక్తం చేశారు. 2010 నుండి 2014 వరకు చదువుల కోసం డబ్బులను డిపాజిట్ చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి తమ పిల్లలను చదివించకుండా మా డబ్బులు మాకివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇటీవలే డబ్బులిప్పించాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశామని, ఈ విషయంలో మంత్రి స్పందించిన తీరు తమను కలిచివేసిందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తమ ఆవేధనను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవరమైతే న్యాయపోరాటానికికైనా సిద్దమన్నారు. ప్రస్తుతం పాఠశాలలో అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరానికి జరుగుతున్నందున ఆ లోపే తమకు న్యాయం చేయాలని కోరారు. తమ డబ్బులతో కంది కేశవరెడ్డి పాఠశాల పదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాల నిర్మించిందని, ఇప్పుడు ఆ స్థలం కోట్లలో విలువచేస్తుందని, పాఠశాల ఆస్తులమ్మి మా డబ్బులు మాకిప్పించాలని కోరారు. ఈ సమావేశంలో బాధితులు మాణిక్యం, ఎస్.మాణిక్యం, రాజు, యాదవరెడ్డి, అడివయ్య, పెంటయ్య సుమారు 150 మంది బాధితులు పాల్గొన్నారు.

Comments

comments