Search
Tuesday 19 June 2018
  • :
  • :

మా మాటే వినాలి

ఉత్తర కొరియా ఉత్త కొరియా కావాలి 

ఉ. కొరియా అణ్వాయుధాలు పూర్తిగా వదులుకోవాలి : అమెరికా
కిమ్‌తో నేటి శిఖరాగ్ర భేటీ అత్యంత ఆసక్తికరం
చక్కని ఫలితాన్ని ఆశిస్తున్నా : ట్రంప్

Trump-vs-Kimసింగపూర్ : పూర్తి అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా ఆమోదిస్తే తమ వైపు నుంచి నిర్దిష్ట విశిష్ట భద్రతా హామీ ఉం టుందని అమెరికా ప్రతిపాదించింది. మంగళవారం ఇక్కడి రిసార్ట్‌లో కిమ్ ట్రంప్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అమెరికా ప్రతిపాదన వెలువడింది. ముందుగా ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను వదులుకోవాలి. ఇది తిరుగులేని విధంగా ఉండి, అంతర్జాతీయ నిపుణుల నిర్దారణ జరగాలి. దీంతో ఉత్తర కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా పేర్కొంది. మంగళవారం నాటి అగ్రనేతల భేటీకి ముందు జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చలలో పురోగతి కన్పించిందని విశ్లేషకులు తెలిపారు. చారిత్రక సదస్సులో పాల్గొనేందుకు కిమ్, ట్రంప్‌లు ఇప్పటికే సింగపూర్ చేరుకున్నా రు. ఇరుదేశాల మధ్య విద్వేషాలు తొలిగి ప్రపంచ శాంతికి మార్గం ఏర్పడుతుందా? లేక చర్చలు నామమాత్రం అవుతా యా? అనేది ఉత్కంఠకు దారితీసింది. సెంటోసా రిసార్ట్ ఐలాండ్‌లోని కపెల్లా హోటల్ ప్రపంచ స్థాయి సమ్మిట్ వేదిక అయింది. మంగళవారం కిమ్‌తో చాలా ఆసక్తికర సమావేశం ఉందని, చక్కని ఫలితం ఆశిస్తున్నామని ట్రంప్ తెలిపారు. సమ్మిట్ సన్నాహాక చర్చలు శీఘ్రగతిని పురోగమిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంతి మైక్ పొంపియో ప్రకటించారు. తమ దేశం అనుకున్న దాని కన్నా ముందుగానే ఒక సహేతుక పరిష్కారానికి మార్గం ఏర్పడటం మంచి పరిణామం అని తెలిపారు. ఏది ఏమైనా పూర్తి  స్థాయిలో నిర్థారిత అణునిరాయుధీకరణకు దిగడం వల్లనే సత్ఫలితం ఉంటుందని, సమ్మిట్‌లో దీనిని మాత్రమే తాము అంగీకరిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి విలేకరులకు తెలిపారు. ప్రపంచవవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా హాజరవుతోన్న మీడియా ప్రతినిధులతో ఇక్కడి రిసార్ట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఉత్తర కొరియాకు తమ దేశం నుంచి నిర్థిష్ట భద్రతా గ్యారంటీ అందిస్తామని వెల్లడించారు. అణు బాట నుంచి వైదొలగడంతో వారు ఏదో పోగొట్టుకున్నట్లుగా భావించుకోరాదని, వారికేం నష్టం జరగదని , ఇది అమెరికాతరఫున భరోసా అని స్పష్టం చేశారు. సంపూర్ణ స్థాయిలో అణ్వాస్త్రాలు వదులుకుంటే కానీ ఉత్తర కొరియాపై ఆంక్షలను ఎత్తివేసేది లేదని తెలిపారు. కిమ్‌తో భేటీకి ట్రంప్ పూర్తిగా సంసిద్ధులు అయినట్లు వెల్లడించారు. సమ్మిట్ దశలో కీలకమైన శాంతి ఒప్పందానికి వీలేర్పడుతుందని భావిస్తున్నారు. దీని వల్ల 195053నాటి కొరియా యుద్ధం వాస్తవికంగా ముగిసినట్లు అవుతుంది. అప్పటి కొరియా యుద్ధం సాంకేతికంగా ముగిసినా శాంతి ఒప్పందం ఏదీ లేకపోవడంతో ఇరు దేశాల మధ్య ఆయుధ పోటీ, బెదిరింపులతో పరిస్థితి రగులుతూ వస్తోంది.
సింగపూర్ ప్రధాని ట్రంప్ భేటీ
సింగపూర్ చేరిన ట్రంప్ సోమవారం ప్రధాని లీ సియన్ లూంగ్‌ను అధ్యక్ష భవనం ఇస్తానాలో కలిశారు. ఇరువురు నేతలు సమ్మిట్ గురించి, అమెరికా సుంకాలతో తలెత్తుతున్న సమస్యల గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగానే విందు జరిగింది. సమ్మిట్‌కు సింగపూర్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. కిమ్‌తో చర్చలలో సత్ఫలితం వెలువడుతుందనే తాను ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. లీతో భేటీ సందర్భంగా ట్రంప్ వెంట విదేశాంగ మంత్రి మైక్, జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్, వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ సరా సాండెర్స్, వైట్ హౌజ్ సిబ్బంది అధినేత జాన్ కెల్లీ ఉన్నారు.
ట్రంప్ ముందస్తు బర్త్‌డే ఖుషీ
సింగపూర్ ప్రధానితో ట్రంప్ భేటీ సమయంలోనే అధికారులు ట్రంప్ జన్మదిన వేడుక నిర్వహించారు. జూన్ 14 ట్రంప్ బర్త్‌డే. ఈసారి ఆయన కొద్దిగా ముందుగానే ఈ సందర్భంగా వేడుక జరుపుకున్నారని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఒక ఫోటో వ్యాఖ్య వెలువరించారు. ఇందులో ట్రంప్ ఒక కేక్‌తో ఉన్న దృశ్యం ఉంది. ట్రంప్ లీ భేటీ జరుగుతున్న సమయంలోనే అమెరికా ఉత్తర కొరియా దౌత్యవేత్తలు కొందరు ఉన్నతాధికారులతో కలిసి రహస్య చర్చలు జరిపారు. అగ్రనేతల కీలక భేటీ సజావుగా సాగేందుకు, ఇప్పుడున్న కీలక విభేదాలు సమసేలా చేసేందుకు ఈ భేటీ జరిగింది.

Comments

comments