Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

లండన్‌లోనే నీరవ్

nirav

ధ్రువీకరించిన బ్రిటన్ మంత్రి

న్యూఢిల్లీ : భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్‌లోనే ఉన్నారని నిర్థారణ అయింది. ఆయన లండన్‌లో ఉన్నట్లు బ్రిటన్ మంత్రి బోనెస్ విలియమ్స్ సోమవారం తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ 13,000 కోట్ల మేర రుణాల మోసం కేసులో నీరవ్‌పై మనీలాండరింగ్ కేసు విచారణ సాగుతోంది. ఈ దశలోనే ఆయన దేశం విడిచి పారిపోవడం వివాదాస్పదం అయింది. ఆయన తమ దేశంలోనే ఉన్నట్లు తొలిసారిగా బ్రిటన్ అధికారికంగా నిర్థారించడంతో విచారణలో వేగం పెరిగేందుకు మార్గం ఏర్పడింది. సోమవారం భారత హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజుతో బ్రిటన్ మంత్రి సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఫరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు బ్రిటన్‌లో తలదాచుకుంటున్న అంశం ప్రస్తావనకు వచ్చింది. నీరవ్, విజయ్ మాల్యా వంటివారిపై విచారణ సాగుతున్నందున ఈ కోవలోని వారినే మరికొందరిని భారత్‌కు పంపించేందుకు బ్రిటన్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి విలియమ్స్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నీరవ్, లిక్కర్ కింగ్ మాల్యా తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతుందని, నీరవ్ బ్రిటన్‌లోనే ఉన్నట్లు ఇప్పుడు స్పష్టం అయిందని ఒక అధికారి వెల్లడించారు. గంట సేపు బ్రిటన్ మంత్రితో భేటీ తరువాత రిజిజూ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని , ఉగ్రవాదం ఆటకట్టుకు రెండు దేశాల సంయుక్త ప్రయత్నాల గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. నేరస్తుల అప్పగింతలు, వారికి సంబంధించిన సమాచార వినిమయం కీలకమైనదని చెప్పారు. ఇప్పటికే నీరవ్ కేసు విషయంలో ఇడి దాఖలు చేసిన లెటర్ ఆఫ్ రొగెటరీస్ (ఎల్‌ఆర్)లను , సిబిఐ, ఐటి నుంచి వెలువడిన సమన్లను బ్రిటన్‌కు చెందిన కేంద్రీకృత దర్యాప్తు సంస్థ (యుకెసిఎ) పరిశీలనకు పంపించారు. తరువాత దశలవారిగా వీటి పరిశీలన జరిగిందని, ఇప్పుడు నీరవ్ తరలింపునకు మార్గం సుగమం అయిందని మంత్రి వివరించారు.
రెడ్ కార్నర్ నోటీసుని కోరిన ఇండియా
లండన్‌లో తల దాచుకుంటున్న నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ ఇంటర్ పోల్‌ని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, భారత్ తనపై తీసుకుంటున్న చర్యలు రాజకీయపూరితమైనవని చెప్పారని లండన్ మీడియాలో వార్తలు వచ్చాయి. తనని ఇండియాకి రప్పించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు దురుద్దేశంతో కూడుకున్నవని నీరవ్ చెప్పాడని అక్కడి మీడియా రాసింది. ఇన్నాళ్లు నీరవ్ మోడీ ఎక్కడున్నాడనేది నిర్ధారణ కాకపోయినా లండన్‌లోనే ఉన్నాడని సిబిఐ అనుమానించింది. ఇంటర్ పోల్ సహకారం తీసుకుని ఇండియా తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ పరిస్థితిలోనే నీరవ్ మోడీ లండన్ మీడియాతో మాట్లాడుతూ భారత్ తనకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను తప్పు పట్టారు. తన ప్రతిష్టని మండకలపడానికే భారత్ తనపై కేసులు నమోదు చేసిందని తెలిపాడు. నిజానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలు 13 వేల కోట్లకు పైగా రుణాన్ని సంపాదించారు. ఈ కుంభకోణం ఆలస్యంగా తెలియడంతో పంజాబ్ ఉన్నతాధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. తమ సిబ్బందిలో కొందరి సహకారం వల్లే ఈ కుంభకోణం జరిగిందని తమ ఫిర్యాదులో తెలిపారు. సిబిఐ నీరవ్, చోక్సీలపై క్రిమినల్ కేసులు నమోదు కాకముందే లండన్ పారిపోయారు. నీరవ్ మోడీ లండన్‌లోనే ఉన్నాడని భారత్ , లండన్ అధికారులు స్పష్టం చేశారు. నీరవ్‌కు లండన్‌లో ఓ కంపెనీ స్టోర్ ఉంది. భారత్ రాజకీయ కారణాలతో తనపై తప్పుడు కేసులు పెట్టిందని నీరవ్ ఆరోపించాడని, లండన్‌లో ఆశ్రమం పొందడానికి నీరవ్ ప్రయత్నిస్తున్నాడని ఇరు దేశాల అధికారులు భావిస్తున్నారని లండన్‌లోని ది ఫైనాన్స్ టైమ్స్ పత్రిక రాసింది.
బ్యాంకు కుంభకోణం బయటపడక ముందే నీరవ్ లండన్‌కి పారిపోయిన నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీ ఆర్థిక నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఈ ఇద్దరితో పాటు మరి కొంతమందిపై కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాం కుకు చెందిన కొంత మంది అధికారుల సహకారం వల్ల నీరవ్ మోడీ, అతని మామ చోక్సీ 13 వేల కోట్లకు పైగా బ్యాంకు సొమ్ముని అక్రమంగా కాజేశారని పిఎన్‌బి అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. అంతకన్నా ముందే నీరవ్, చోక్సీలు లండన్‌కు పారిపోయారు. వీరిపై విచారణ జరుపుతున్న కోర్టులో 12000 పేజీల చార్జ్‌షీట్‌ని సిబిఐ దాఖలు చేసింది. నిందితులను లండన్ నుంచి భారతదేశానికి తీసుకురావడానికి ఇంటర్ పోల్ సహకారాన్ని కోరింది. నీరవ్ మోడీ, చోక్సీలపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ కోరింది.

Comments

comments