Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రపంచ శాంతి వైపు…?

EDIT

ఉత్తర కొరియాను ఇప్పుడు పాలిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ తాత, కిమ్ 11 సుంగ్ ఉత్తరకొరియాను పాలిస్తున్నప్పుడు 1950లో దక్షిణ కొరియాపై దాడి చేశాడు. ఈ యుద్ధంలో చివరకు చైనా, అమెరికాలు కూడా ప్రవేశించాయి. ఉత్తరకొరియా తరఫున చైనా, దక్షిణ కొరియా తరఫున అమెరికా. మూడేళ్ళ పాటు యుద్ధం కొనసాగింది. చివరకు 1953లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఐక్యరాజ్య సమితి శాంతిదళాలకు నాయకత్వం వహిస్తున్న భారత సైన్యాధికారి, జనరల్ తిమ్మయ్య చొరవతో ఈ కాల్పుల విరమణ కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరం కొనసాగుతున్నది. అప్పటి నుంచి కాల్పుల విరమణ చెదురు మదురు సంఘటనల వల్ల అమలులోనే ఉంది.
రెండు కొరియాల మధ్య శాంతి సాధించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈ కాలంలో ఉత్తరకొరియా అణ్వాయుధాలను కూడా సముపార్జించుకుంది. ఆరు అణు పరీక్షలు నిర్వహించింది. అణు పరీక్షలే కాదు సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడా తయారు చేసుకుంది. ఇప్పుడు ఉత్తరకొరియా క్షిపణి సామర్థ్యం అమెరికా ప్రధాన భూభాగాన్ని కూడా లక్ష్యం చేసుకోగలదు. కేవలం ఆయుధ సంపత్తి పెంచుకోవడం మాత్రమే కాదు, అవసరమైతే క్షిపణులు ప్రయోగిండానికి వెనుకాడమన్న స్పష్టమైన సందేశాలు కూడా ఇచ్చింది. దీనికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు కూడా సర్వనాశనం చేస్తామని బెదిరించాడు. అంతేకాదు, ఉత్తరకొరియాపై ఆంక్షలు కూడా కఠినం చేశాడు.
దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా పాల్గొనడంతో ఉద్రిక్తత కాస్త తగ్గింది. రెండు కొరియాల మధ్య కాస్త మంచి వాతావరణం ఏర్పడింది. ఇటీవల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగున్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఇద్దరు సమావేశమయ్యారు. ఈ సమావేశం నిస్సైనిక మండలంగా ప్రకటించబడిన సరిహద్దు గ్రామం పాముంజోమ్‌లో జరిగింది.
ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆ తర్వాత మరో సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశాలు గొప్ప ఆశను కలిగించాయి. ఇరుపక్షాల్లోనూ సామరస్యపూర్వక సౌహార్ద్ర భావాలు వెల్లివిరిశాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాట్లాడుతూ వివాదాలు, ఘర్షణలను నివారించడానికే తాను అక్కడికి వచ్చానన్నాడు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి అణుపరీక్షలు నిర్వహించే కేంద్రాలను మే నెల లోపు మూసేస్తానని చెప్పాడు. దేశాన్ని అణ్వస్త్ర రహిత దేశంగా మారుస్తానన్నాడు. ఉత్తర కొరియా ఇదంతా చేస్తే ప్రయోజనమేమిటి అనే ప్రశ్నకు జవాబు కూడా ఉంది. ఉత్తరకొరియా భద్రతకు అమెరికా గ్యారంటీ ఇస్తుంది. కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా తన సైనికదళాలను ఉపసంహరించుకుంటుంది. అయితే ఇదంతా ఎప్పటికి జరుగుతుందన్న సమయనిర్ధారణ ఏదీ జరగలేదు.
ఉత్తరకొరియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అది నిర్వహించిన చివరి అణుపరీక్ష సందర్భంగా సొరంగం కుప్పకూలిపోయింది. అంటే ఇక ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించాలంటే భూగర్భాన సాధ్యపడదు. ఉత్తరకొరియా ఈ అణుపరీక్షా కేంద్రాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగున్ ఇద్దరు నాయకుల మధ్య సమావేశం ప్రయత్నాలు వెనుక నేపథ్యం ఇది. ఈ భేటీ ముహూర్తం తొలుత రద్దయి తిరిగి ప్రాణం పోసుకుంది. నేడు (జూన్ 12న) సింగపూర్‌లో జరుగుతుంది. శిఖరాగ్ర సమావేశం కోసం ట్రంప్, కిమ్ ఈ సరికే అక్కడకి చేరుకున్నారు. అణ్వాస్త్రాలే కాదు, క్షిపణులు కూడా ఉత్తర కొరియా వదులుకునేలా చేయాలన్నది ట్రంప్ ఆలోచన. అణ్వాయుధాల సమస్య చాలా సంక్లిష్టమైనది. స్థూలంగా ఒక అంగీకారం కుదిరినా, ఉత్తరకొరియా నిజంగానే అణ్వాయుధాలు, క్షిపణులు ధ్వంసం చేసిందా లేదా అన్నదానిని పరీక్షించే వ్యవస్థ, ఆ వ్యవస్థ నిర్మాణానికి ఉత్తరకొరియా ఒప్పుకోవడం, ఉత్తర కొరియా ఒప్పందం ప్రకారం అన్ని చర్యలు చేస్తుందని అమెరికాకు నమ్మకం కుదరడం ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పనులు. అమెరికా అధికారులు ఈ విషయమై సతమతమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగున్‌ల మధ్య సమావేశానికి ముందు, సమావేశం ఎజెండా నిర్ణయించడానికి అమెరికా అధ్యక్షుని తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి పాంపియో, కిమ్‌ను కలుసుకున్నాడు. అత్యంత కీలకమైన విషయాలు చర్చించేలా కిమ్‌ను ప్రభావితం చేశానని చెప్పుకున్నాడు. ఉత్తరకొరియా జైళ్ళలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేయించగలిగాడు పాంపియో.
అమెరికా కోరుతున్నవి చిన్న చిన్న కోరికలు కావు. ఉత్తరకొరియా ఆయుధబలంలో అతి ముఖ్యమైన అణ్వాయుధాలు, క్షిపణులను ధ్వంసం చేయడమే కాదు, మరలా ఉత్పత్తి చేసే అవకాశం లేని విధంగా నిరాయుధీకరణ జరగాలన్నది షరతు. ఈ షరతును ఒప్పందంలో ఎలా చేరుస్తారన్నది తెలియాలి. మరో విషయమేమంటే, సుదూర లక్షాలను ఛేదించే క్షిపణులను ఉ. కొరియా ధ్వంసం చేస్తే కేవలం అమెరికాకు మాత్రమే భయంలేని పరిస్థితి ఉంటుంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, జపానులపై దాడి చేయడానికి కావలసిన దగ్గరి లక్షాల క్షిపణులు కిమ్ వద్ద ఉండనే ఉంటాయి.
ఏది ఏమైనా, అణ్వాస్త్రాలు, క్షిపణులు ఉత్తరకొరియా వదిలేసేలా నచ్చ చెప్పగలిగే ఒకే ఒక్క దేశం చైనా. ఇటీవల కిమ్ చైనా సందర్శించాడు. చైనా నాయకులతో ఆయన చర్చలేమిటో స్పష్టంగా తెలియదు. చైనా ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటుందో కూడా తెలియదు. వేచి చూడవలసిందే. ఈ మధ్య కాలంలో అమెరికా మరికొన్ని ఆర్ధిక ఆంక్షలు విధించింది. కాని ఆంక్షల విషయంలో ఇప్పుడు కాస్త మెతగ్గానే ఉన్నది. ఇటీవల ఉత్తరకొరియా రాయబారి కిమ్ యాంగ్ చోల్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నాడు. కిమ్ యాంగ్ చోల్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ యాంగున్‌కు అతి సన్నిహితుడైన సలహాదారుడు. అమెరికా అధ్యక్ష భవనంలో ఈ సమావేశం జరిగింది. అమెరికా ఆంక్షల జాబితాలో ఉత్తరకొరియా కూడా ఉంది కాబట్టి ఆయన వాషింగ్టన్ రావాలంటే అమెరికా ప్రత్యేక అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.
దక్షిణ కొరియా నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయిన వార్త చాలా మందికి గుర్తుండి ఉంటుంది. ఈ నౌకను సముద్రంలో ముంచేసింది కిమ్ యాంగ్ చోల్ అంటారు. నౌక మునిగిపోవడంతో పెద్ద సంఖ్యలో దక్షిణ కొరియా సైనికులు మరణించారు. ఉత్తర అమెరికా గూఢచార సంస్థకు సంబంధించి అనేక చర్యల్లో సైబర్ దాడుల వంటి వాటిని కిమ్ యాంగ్ చోల్ చేయించినట్లు భావిస్తారు. రెండు కొరియాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం సమసిపోయి కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొంటే ప్రపంచ శాంతికి అది ఎంతో తోడ్పడుతుంది. జూన్ 12న జరిగే సమావేశంలో పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలేవీ ఉండకపోవచ్చు. కాని చర్చలు జరిపించే సామరస్య వాతావరణం ఏర్పడిందన్నది కాదనలేని వాస్తవం.

* లెఫ్టినెంట్ జనరల్ హర్వంత్ సింగ్
(ది సిటిజన్)

Comments

comments