Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఆపదలో పిల్లల మర్రి

pillalamarri

బీజాపూర్, హైదరాబాద్ సుబేదార్ అయినటువంటి నిజాం రాజు బిక్షఖాన్ 18వ శతాబ్దం ఆరంభంలో (1706) హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా నిజాం పాలనలోకి వెళ్ళింది. ఈ ప్రాంతాన్నీ పరిశీలించిన మహబూబ్‌ఖాన్ పేరు మీద మహబూబ్‌నగర్‌గా పేరు వాడుకలోకి వచ్చింది. 1847 చ .కి .మీ వైశ్యాలం కలిగిన మహబూబ్ నగర్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ? జనాభా కలదు. మహబూబ్‌నగర్‌కు 4 కి .మీ. దూరంలో ఆసక్తి గొలిపే దృశ్యం ఒక్కటి కనిపిస్తుంది. అదే విశాలమైన వటవృక్షం. దీనినే పిల్లలమర్రి గా పిలుస్తారు. ఒకే ఒక మర్రిచెట్టు నుండి దాని ఊడల ద్వారా 4 ఎకరాల పరిధిలో మర్రిచెట్లు ఏర్పడ్డాయి. అసలు మొదటి మర్రిచెట్టు మ్రానేదో ఎవరికీ తెలియదు. చివరికి ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం… ఈ మర్రిచెట్టు క్రింద ఒక ముస్లీమ్ యోగ పురుషుడి సమాధి ఉన్నది. దూరం నుంచి చూస్తే పచ్చని చెట్లకు నెలవైన చిన్న పర్వతం లాగా దర్శనమిచ్చే పిల్లల మర్రి సమీపిస్తున్న కొలది ఆకుపచ్చని అందాల గొడుగు లాగా కనిపిస్తుంది.. దీని నీడలో కనీసం 1000 మంది హాయిగా సేద తీరవచ్చు. 700 సం॥ రాల వయస్సు కల్గిన ఈ మహావృక్షం తాలూకు కొమ్మలు ఏకంగా 4 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించాయి. ఈ కొమ్మలే ఊడల్లాగా పిల్లలై ఈ చెట్టుకు పిల్లల మర్రిగా పేరు వచ్చింది . ఇక్కడ రకరకాల చేపలతో కూడిన అక్వేరియం ఒక్కటి ఉన్నది. అలాగే చిన్న జంతు ప్రదర్శన శాల పురావస్తు శాఖవారి మ్యూజియం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు చిన్న పిల్లల ఆడుకోవడానికి వివిధ రకాలైనా ఆట వస్తువులున్నాయి. వర్షాకాలంలో పిల్లల మర్రి ఆవరణంలో ఉన్నటువంటి కొలనులో పడవలపై షికారు చేసుకునే సౌకర్యమున్నది. ఇక్కడ అన్నీ కాలాల్లో జన సమూహంతో కిటకిటలాడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది.. దాదాపు 700 సం లకు పూర్వం జమాన్ ఉస్సేన్ చిస్తీ అనే ఇరువురు సోదరులు చీకటిలో తపస్సు చేస్తూ సజీవ సమాధి అయ్యారు. వారిలో ఒకరికి మర్రిచెట్టు గొడుగుగా మారిపోయింది. దీనినే పిల్లల మర్రిగా పిలిచేవారు. ఈ మర్రిచెట్టు సంవత్సరాలు గడిచే కొద్దీ ఊడల ద్వారా అనేక చేట్లుగా మారి 4 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయి అసలు మ్రాను ఏదో కనిపెట్ట లేకుండా మారిపోయింది. ముందు ఈ పిల్లలమర్రిని పీర్లమర్రి అని పిలిచేవారు. పీర్ అంటే దేవుడి రూపం అని అర్ధం. పీర్లమర్రి క్రమేపి పిల్లలమర్రిగా మారింది. పిల్లలమర్రి చెట్లక్రింద ఉన్న సమాధిని ప్రజలు దైవభక్తితో కొలవడం ప్రారంభించారు. సంతానం లేని దంపతులు భక్తితో పిల్లలమర్రికి వస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని రోగాలు వచ్చిన వారికి రోగాలు మాయం అవుతాయని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. దర్శనానికి వచ్చే పిల్లలు పెద్దలు (భక్తులు) స్నానం చేసి మర్రిచెట్టు మ్రానును పట్టుకొని మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఒక నానుడి కలదు. 1974లో ప్రభుత్వ చట్టం ద్వారా పీర్ సామెల్స్ పిల్లలమర్రిని అభివృద్ధి పరచడానికి కృషిచేశారు. 1975లో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ పీర్లమర్రిని పిల్లలమర్రిగా మార్చింది. క్రమంగా అటవీ శాఖ టూరిజం డిపార్టుమెంటులు ప్రవేశించాయి. మర్రిచెట్టుపై యాదీ అనే తీగ పారడం వలన స్ట్రాంబర్ అనే వ్యాధి సోకి చెట్టుకు చెదలు పట్టి మ్రాను క్రింద పడటం జరుగుతున్నది . పర్యాటక శాఖవారు తగిన శ్రద్ధ తీసుకొని దీనిని రక్షించడానికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 4 ఎకరాల విస్తీర్ణంలో కల్గిన మర్రిచెట్టు అసలైన మ్రాను కనుగొనడానికి 15 సార్లు పరిశోధనలు జరిగిన ఫలితం శూన్యమే అయ్యింది. చివరిసారిగా 1990లో ఒక పరిశోధకుడు అసలైన మ్రానును కనిపెట్టానని దానిని శాస్త్రీయంగా అందరికి రుజువు చేస్తానని చెప్పిన కొన్ని రోజులకే మెదడుకు సంబంధించిన వ్యాధితో మరణించాడు. చెట్టు గురించి చెప్పకూడదని ఇది దైవలీలలోభాగం అని అక్కడి ప్రజల విశ్వాసం. పిల్లలమర్రిలోని దర్గా వద్ద అక్కడి వాతావరణ పరిశుభ్రత గూర్చి పట్టించుకునేది చిస్తీ వంశస్తులైన 7వ తరానికి చెందిన ఖాజాఖాన్ చిస్తీ గత 17 సంవత్సరాలుగా దర్గాను చూసుకుంటున్నాడు. ఈయనకన్నా ముందు అహమ్మద్ ఖాన్ మహమ్మద్ ఖాన్ రసూల్ ఖాన్ హిమామ్ ఖాన్ మహమ్మద్ ఖాన్ హిమామ్ ఖాన్ చిస్తీ దర్గా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు .
ప్రకృతి సిద్ధమైన అత్యంత ఆకర్షణీయమైన పిల్లలమర్రిగా పిలవబడే ఈ మ్రానును రక్షించడంతో పాటు స్థానికులు పర్యాటకశాఖ వారు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ మరింత మంది యాత్రికులను ఆకర్షించే విధంగా తయారు చేయాలి .

డా. పోలంసైదులు

Comments

comments