Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వరదల నుంచి రక్షణకు ప్రణాళిక

తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

Rain

హైదరాబాద్ : రుతుపవనాల ప్రభావం రాష్ట్రమంతటా విస్తరించిన నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రణాళికను తయారుచేసింది. జిల్లా స్థాయి మొదలు గ్రామ స్థాయి వరకు వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను, పునరావాస చర్యలను వివరిస్తూ ‘రుతుపవనాల ప్రణాళిక’ను రూపొందించింది. అన్ని జిల్లాల కలెక్టర్లను, వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలను అప్రమత్తం చేసింది. వేసవికాలంలో వడగాడ్పుల నివారణకు ఇదే తరహా ప్రణాళికను రూపొందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం గణనీయంగా తగ్గింది. ఇదే తరహాలో ఇప్పుడు రుతుపవనాల ప్రణాళికను కూడా రూపొందించింది. గతేడాది వర్షాలు, వరదల కారణంగా 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా లెక్కించడంతో ఈసారి దాన్ని పూర్తిగా నివారించే తీరులో ఈ ప్రణాళికను రూపొందించింది. గతేడాది సుమారు పన్నెండు వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినందువల్ల ఈ ఏడాది సైతం వరదలు సంభవించినట్లయితే వెంటనే స్పందించేలాగ తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, హోంగార్డులు, ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ లాంటి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలతో పాటు జిల్లా కలెక్టర్ల వరకు ఈ ప్రణాళికను అందించిన విపత్తు నిర్వహణ విభాగం వరద ముంపు ఉన్న ప్రాంతాలపై ప్రధాన దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో గత వారం చివర్లో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా కూడా ఈ ప్రణాళికపై అన్ని శాఖల కార్యదర్శులతో చర్చ జరిగింది. కృష్ణా, గోదావరి నదులపై డ్యామ్‌లు, బ్యారేజ్‌లు ఉన్న చోట వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వెంటవెంటనే జిల్లా, రాష్ట్ర కేంద్రాలకు సమాచారం అందించాలని, అవసరాన్ని బట్టి వెంటనే సహాయక బృందాలను పంపడానికి వీలవుతుందని విపత్తు నిర్వహణ కమిషనర్ చంద్రవదన్ పేర్కొన్నారు. ఏదేని పరిస్థితుల్లో సైన్యం రంగంలోకి దిగాల్సి వస్తే అన్ని జిల్లాల కలెక్టర్లు అందుబాటులో ఉన్న హెలిపాడ్‌ల వివరాలను ప్రభుత్వానికి పంపాలని, వరదల విషయంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో అందుబాటులో ఉండాలని, జిల్లా కేంద్రంలో 24 గంటలూ పనిచేసే అత్యవసర కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే తగిన పునరావాస కేంద్రాలను కూడా ఇప్పుడే గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలాలను సిద్దం చేసి వరదనీరు దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయేలా తగిన మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతేడాది (సెప్టెంబరు 21 నుంచి 29 వరకు) కురిసిన వర్షాల కారణంగా పాత ఇండ్ల గోడలు కూలడం లాంటి కారణాలతో మెదక్ జిల్లాలో ఎనిమిది మంది, వరంగల్ జిల్లాలో ముగ్గురు, హైదరాబాద్ నగరంలోని భోలక్‌పూర్‌లో నలుగురు, రామాంతపూర్‌లో ముగ్గురు చొప్పున చనిపోయారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో సుమారు పన్నెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
ప్రణాళికలో పేర్కొన్న ముందుజాగ్రత్త సూచనలు :
* కల్వర్టులు, చెరువు గట్లు లాంటి సాగునీటి నిర్మాణాల దగ్గర కరకట్టలు తెగకుండా, గండి పడకుండా ఆ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. అయినా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రాణనష్టం జరగకుండా చూడాలి. తగిన సంఖ్యలో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలి. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ప్రాం తాల్లో పర్యటించి ముందుగానే ఒక అంచనాకు రావాలి.
* పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు ఉన్నచోట్ల వరద సంభవించే అవకాశం ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. రైళ్ళ, వాహనాల రాకపోకలకు కలిగే అంతరాయాన్ని వెంటవెంటనే పరిష్కరించాలి. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తక్షణం రక్షిత త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి.
* విద్యుత్ విభాగం సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* వైద్యారోగ్య శాఖ అధికారులు వర్షాల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు తగిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలు జిల్లా కేంద్ర ఆసుపత్రుల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
* వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు తగిన పశుగ్రాసాన్ని, వర్షాల అనంతరం వచ్చే వ్యాధులకు తగిన మందులను, వ్యాక్సీన్లను సిద్ధంగా ఉండాలి.
* పంటకు నష్టం జరిగినట్లయితే వెంటనే రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం వలన సకాలంలో నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలవుతుంది.
* గ్రామ, మండల స్థాయి అధికారులు అక్కడి వివిధ విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకోవడంతో పాటు జిల్లా కలెక్టర్లకు వెంటవెంటనే క్షేత్రస్థాయి పరిస్థితిని తెలియజేయాలి.

Comments

comments