Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వేటుకు వేళాయే!

 Police Department Taking Action On Corruption Police

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వసూల్ రాజాలపై వేటుకు వేళయింది. పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రేండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్న కొంత మంది వసూళ్లరాయుల మూలంగా ప్రభుత్వ ఆశయం నేరవెరడం లేదని గ్రహించిన పోలీస్ బాస్ దీనిపై కఠీన చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ వ్యాప్తంగా నిఘా వర్గాల ద్వారా వసూల్ రాజాలపై వివరాలు సేకరించి వారిపై వేటు వేయడానికి చర్యలకు ఉపక్రమించడం పోలీస్ వర్గాలలో కలకలం రేపుతుంది. 395 మందితో కూడిన జాబితాలో ప్రస్తుతం పూర్తిగా కానిస్టేబుల్, హోంగార్డులు ఉన్నప్పటికి ఎస్‌ఐలు అపై స్థాయి అధికారుల జాబితాను సైతం పోలీస్‌బాస్ సిద్దం చేసి త్వరలో వారిపై సైతం తగు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నట్లు పోలీసు వర్గాలలో ప్రచారం జరుగుతుంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న రోడ్లపై మామూళ్ల పేరుతో లారీలు, హోటల్‌లు, మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులు, ఫాంహౌస్‌లు, రిసార్టులతో పాటు ఇతర వ్యాపారస్తుల నుంచి వసూళ్ల దందా చేస్తున్న వారిని ఉపక్రమించ కుండా తగు చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆయా జిల్లాల బాస్‌లకు ఆదేశాలు సైతం అందినట్లు తెలిసింది. సైబారాబాద్ పరిధిలో13, రాచకొండ కమిషనరేట్‌లో 24, వికారాబాద్ జిల్లా పరిధిలో 27 మంది వసూల్ రాజాలపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తుంది. సైబారాబాద్ పరిధిలోని షాద్‌నగర్‌లో ఇద్దరు, చౌదరిగూడ, నందిగామ, కేశంపేట్, మంచాల, మహేశ్వరంలలో ఒక్కోక్కరు చొప్పున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు తెల్చాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో 9, యాలాలలో 2 పెద్దెముల్‌లో 3, కరన్‌కోటలో 1 ,బషిరాబాద్‌లో 1, పరిగిలో 3, కుల్కచర్లలో 1 ,దోమలో 1 , వికారాబాద్ జిల్లా కేంద్రంలో 6 పై ఒకటి రెండు రోజులలో వేటు పడనుంది. సైబారాబాద్ పరిధిలోని షాద్‌నగర్ డివిజన్‌లో వసూళ్ల పంచాయతీ అడ్డగోలుగా సాగుతుంది. ఇప్పటికే సదరు డివిజన్‌లో ముగ్గురు సిఐలతో పాటు ఎస్‌ఐలు సైతం అవినీతి ఆరోపణలపై వేటు పడింది.
మామూళ్లు అడిగితే సమాచారమివ్వండి : సైబారాబాద్ కమిషనర్ సజ్జన్నార్
సైబారాబాద్ పరిధిలో పోలీసులు ఎక్కడ ఎవరిని మామూళ్లు అడిగిన తక్షణం తమకు సమాచారం అందచేయాలని సైబారాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్‌లలోని హోటల్‌లు, రెస్టారెంట్‌లు, మద్యం దుకాణాలు, బార్‌లు, లాడ్జీలు, ఇతర వ్యాపారస్తులు ఎవరి వద్దకైన మామూళ్ల కోసం వస్తే 9490617144కి సమాచారం ఇస్తే తగు చర్యలు చేపడుతామన్నారు.
27 మంది పోలీసులకు త్వరలో స్థానభ్రంశం ?
మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి ః విధి నిర్వహణలో అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వర్గాల ద్వారా రహాస్య నివేదిక తెప్పించుకున్న అధికారులు వారికి జిల్లా కేంద్రాల వద్ద కౌన్సెలింగ్ ఇస్తున్నారు. త్వరలో వారిపై బదిలీ వేటు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ౩95 సిబ్బందిపై నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కూడా 26 మంది పోలీసు సిబ్బందిపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. వారిలో కానిస్టేబుళ్లు సహా కొంతమంది హోంగార్డులు ఉన్నారు. హైవేలపై భారీ వాహనాలు, సిమెంటు లారీలు, ఓవర్‌లోడ్ ట్యాంకర్లను ఆపి బలవంతంగా వసూలు చేసే రోడ్‌మాస్టర్ల విధానంపైనా గుర్రుగా ఉన్నారు. అయితే, పదేళ్ల క్రితం రోడ్‌మాస్టర్ల వ్యవస్థ చాల పగడ్బంధీగా ఉండేది. ఇటీవల కాలంలో కాస్త తగ్గినా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సీరియస్‌గా ఉన్నారు. ప్రతి జిల్లా లో అలాంటి వారిని గుర్తించిన అధికారులు ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మామూళ్లు ఇచ్చిన మద్యం వ్యాపారులను, ఇతరత్రా వారిని కూడా పిలిపించి అవగాహన కల్పించనున్నారు. అక్రమ వ్యాపారాలు మానుకుని ఎవరికీ నయాపైసా మామూళ్ల ఇవ్వరాదని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మామూళ్ల విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా ఇకపై ఐడి పార్టీ,క్రైమ్‌పార్టీలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి.

సాధారణ పోలీసులుగా ఉంటూనే కేసుల పరిశోధన చేపట్టాలని, ఎప్పటికప్పుడు శాంతిభద్రతలు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్రైమ్, ఐడి పార్టీలు కేసుల పరిశోధనలో పెద్దగా సాధించిందేమీ లేదని, పైగా అందినంత దండుకునే పనిలో నిమగ్నమైనారని వారి దృష్టికి వచ్చింది. జిల్లాలో ఏళ్ల తరబడి ఒకే సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా కూడా రూపొందించడం గమనార్హం. ఇలా ఉండగా కొంతమంది సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కూడా తప్పుడు నివేదికలు అందజేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి వసూళ్లకు పాల్పడకున్నా వ్యక్తిగత కక్షలతో కొంతమంది అమాయకులపై బురదజల్లారని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది స్థానిక ఎస్‌ఐ, సిఐ స్థాయి అధికారుల ప్రోద్బలంతో వసూళ్ల దందా సాగినట్లు ఆరోపణలు వున్నాయి. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా, లేదా వేచి చూడాల్సిందే. మామూళ్ల విధానాన్ని రద్దు పరిచి పోలీసులంటే సంఘంలో గౌరవం పెంపొందించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు చేసిన నిర్వాహకాలు చాలని, మున్ముందు క్రమశిక్షణతో కూడిన విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర పోలీసుబాస్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల సమాజంలో వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. అవినీతి పోలీసుల్లో పరివర్తన రావాలన్న సంకల్పంలో ఇలాంటి సాహసోసేత నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments