Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రైవేట్ ఇష్టా రాజ్యం

Private favorite kingdom

నిబంధనలకు తిలోదకాలు                                                                                                                                  అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్రారంభాలు                                                                                                      కొత్త పద్ధతులలో విద్యా వ్యాపారం                                                                                                                          కొరవడిన పర్యవేక్షణ

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్: వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కొదవ లేదన్నట్లుగా ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవహారం ఉంది.  అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఒక వేళ పర్యవేక్షించినా మనోడే కదా… అని చూసీ చూడనట్లుగా ఉండటంతో ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో అనుమతులు లేవని, విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని, ఫీజుల భారం మోపుతున్నారని, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే వాదనలు ముందుకురావడం పరిపాటిగా మారింది. విద్యార్థి సంఘాలు సైతం విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆందోళనలు, నిరసనలు, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయడం కూడా సర్వసాధరణంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. గతం లాగే ఈ విద్యాసంవత్సరం కూడా ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రైవేట్ విద్యాసంస్థలు వారివారి రొటీన్ పనిని మొదలుపెట్టింది. అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు సైతం ప్రారంభమవడం, యూనిఫామ్ తదితర మెటీరియల్ కొనుగోళ్లు వ్యాపారం ఊపందుకోవడం, ఫీజుల బెడద తల్లిదండ్రులకు తాకడం గమనార్హం. వరంగల్ నగరంలో నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలకు కొదువ లేదని, విచ్చల విడిగా కొనసాగే విద్యాసంస్థలపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యం సాగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక పాఠశాలల్లో ఆట స్థలాలు, ఫైర్ సేఫ్టీ, అర్హులైన ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కనిపిస్తోన్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు 5 కిలోమీటర్ల మేర దూరంగా ప్రైవేటు పాఠశాలలు ఉండాలని, వైన్స్, బార్ షాపులకు  దూరంగా ఉండాలనే నిబంధనలు అమలు కాకపోవడం, నగరంలో పలు చోట్ల బార్లు, రెస్టారెంట్లకు అతి సమీపంలో ప్రైవేట్ విద్యాసంస్థలు కొనసాగడం గమనార్హం.  ఎలాంటి అనుమతి లేకుండా వరంగల్ నగరంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రైమరీ ఫ్రీప్రైమరీగా నడుస్తోందని దీనికి సంబంధించి స్పష్టమైన విభజన అనుమతులు లేవని, అతి సమీపంలోనే బార్ షాపు ఉందని అయినప్పటికీ సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. హంటర్‌రోడ్డులోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్‌కు సైతం అనుమతులు లేకుండా నిర్వహించబడుతోందన్నారు. నగరం శివారులోని జాన్‌పాక లో మాస్టర్ జీ హైస్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారు. అయితే స్వయంగా విద్యాశాఖ మంత్రి హాజరై ఈ పాఠశాలను ప్రారంభించడం గమనార్హం. మరోవైపు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యూనిఫామ్‌ల రూపంలో విద్యాసంస్థలు కొత్త పద్దతులలో వ్యాపారం ప్రారంభించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని పేరున్న బుక్‌స్టాల్స్‌తో రహస్యపు ఒప్పందాలు కుదిరించుకొని యూనిఫామ్స్ అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అనుమతులు లేని పాఠశాలలతో పాటు, నిబంధనలు అతిక్రమించే ప్రయివేటు పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, చట్టబద్ధమైన చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా నిర్ల క్షం గా వ్యవహరిస్తున్నారనేది గమ నార్హం. ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి డిమాండ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలిని ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి జిల్లా నాయకులు పెండ్యాల సతీష్, గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు అనుమతి లేకుండా ప్రారంభమైన మాస్టార్‌జీ హైస్కూల్ అవరణలో సోమవారం ప్లైకార్డులతో నిరసన తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రయివేటు విద్యాసంస్థలలో అమలు కావడం లేదని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా కొరసాగుతున్న పాఠశాలలపై అధికారులు చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా ప్రయివేటు విద్యాసంస్థల యజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతుందని విమర్శించారు. ఇప్పటికైన అనుమతులు లేని పాఠశాలపై, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్షం చేస్తే దశలవారి ఆందోళనలు చేపడుతతామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ప్రారంభించిన మాస్టార్‌జీ హై స్కూల్ ప్రారంభానికి స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హజరవడం విడ్డూరంగా ఉందని వాపోయారు.

Comments

comments