Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

వామ్మో ప్రై‘వేటు’

Private school extra fees charged from students

మనతెలంగాణ/ నిజామాబాద్ క్రైం: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల్లో దడపుట్టిస్తున్నాయి. నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే అభిప్రాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడాన్ని అవకాశంగా తీసుకుంటూ… అడ్మిషన్.. మెయింటనెన్స్.. స్పెషల్ ఫీజుల పేరిట దోపిడికి తెరలేపాయి. పెన్సిల్ నుండి నోట్‌బుక్స్ వరకు ప్రతిదీ సదరు పాఠశాలల్లోనే కొనాలని హకూం జారీ చేస్తున్నాయి. ఈ ఖర్చులు సామాన్యుడికి తడిసి మోపెడవుతున్నాయి. తమ పాఠశాల పేర్లతో ఉన్న బ్యాగులను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పాఠశాలలు పునః ప్రారంభమై నాలుగు రోజులు కావస్తోంది. కొన్ని పాఠశాలలు జూన్ 12న ప్రారంభం అవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖ వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు లేకున్నా.. కార్పోరేట్ లేబుల్ పెట్టుకుని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. టెస్ట్‌బుక్స్, నోట్‌బుక్స్ మొదలు పెన్సిల్ వరకు అన్ని తమ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టాయి. దీంతో ఆ స్కూల్‌లోనే అన్ని వస్తువులు కొనుగోలు చేయడం అనివార్యమైంది. బ్యాగులు, టై, బూట్లకు విపరీతంగా ధరలు వసూలు చేస్తున్నారు.
పుస్తకాల ధరలు పైపైకి… బయట షాపుల్లో రూ. 15 ఉన్న పుస్తకాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో రూ. 18 రూ.20కి విక్రయిస్తున్నారు. కార్పోరేట్‌గా చెప్పుకునే ఇంకొన్ని పాఠశాలల్లో అయితే ఆ ధర రూ. 30కి పైగా ఉంటుంది. మరికొన్ని పాఠశాలల్లోనైతే మరి కొనుగోలు చేసి దానిపైన ఉన్న పుట్టను తొలగించి ఆయా పాఠశాలలకు సంబంధించిన పాఠశాలల పేర్లతో పుట్టలు తయారు చేసి అధిక రేట్లకు అమ్ముతున్నాయి. పాఠ్యపుస్తకాల పేరిట తల్లిదండ్రులు అప్పుసొప్పు చేసి పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మొత్తం ప్రభుత్వం సరఫరా చేసే టెస్ట్‌బుక్‌లే కాకుండా వీటికి తోడు పెన్నులు, పెన్సిల్స్, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆకాశంలో బ్యాగుల ధరలు ః నర్సరీ నుంచి పదో తరగతి వరకే కాకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం చదువు కొనాలంటే బ్యాగ్ తప్పనిసరి. ప్రస్తుతం చాలా కంపెనీలు విద్యార్థులకు ఆకర్షించేలా వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడల్స్‌లో బ్యాగులను విడుదల చేస్తున్నాయి. కళ్లు చెదిరే డిజైన్లు, రంగులతో చాల రకాల బ్యాగులు అందుబాటులో ఉన్నా యి. ఇందులో రూ. 200 నుండి వెయ్యి వరకు బ్యాగుల ధరలు ఉన్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం బ్యాగుల ధరలు 100 నుండి 150వరకు పెరిగే అవకాశాలున్నాయి.
మండుతున్న బూట్ల ధరలు ః
పాఠశాల విద్య అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నది. ప్రతి పాఠశాలలో యూనిఫాం, దానికి తగ్గట్టుగా బూట్లు (బ్లాక్, వైట్, కలర్) తప్పనిసరి. వీటి రేట్లు ఏటా పరుగులు తీస్తూనే ఉన్నాయి. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్‌వే కొనాలని చెబుతున్నాయి. రూ. 300 నుంచి 500 వరకు ఉండగా. ఇప్పుడు 20శాతం పెరిగి రూ. 600కు చేరాయి.
* యూనిఫాంలు అంతే ః
జిల్లా కేంద్రంలో దాదాపు వందల సంఖ్యలో పాఠశాలలు వీధికొక్కటి ఏర్పడ్డాయి. విద్యార్థులు తప్పనిసరిగా యాజమాన్యం యూనిఫాంలనే ధరించాల్సి ఉంటుంది. యేటా తప్పనిసరిగా కొత్త యూనిఫాం ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ధరలు గతేడాదితో పోల్చితే చాలా పెరిగాయి. అబ్బాయిల ప్యాంట్, షర్ట్, అమ్మాయిల యూనిఫాంలు లేకుంటే ఇబ్బందే. జిల్లా కేంద్రంలో చాలా దుకాణాల్లో రెడిమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నా కొంత మంది రెడీమేడ్ దుస్తులను వాడితే మరికొంత మంది కొనుక్కుని కుట్టించుకుంటున్నారు.

Comments

comments