Search
Tuesday 19 June 2018
  • :
  • :

తగ్గిన ప్రసూతి మరణాలు

 రాష్ట్రంలో 2014-16లో గణనీయ ప్రగతి   

2011-13లో ప్రతి లక్ష జననాలకు మాతల మృతి 167 కాగా, 2014-16 మధ్య 130కి చేరిక 

టాప్ 5 రాష్ట్రాల్లో మనం   

Maternity

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 201416 మధ్యకాలంలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గగా తెలంగాణ రాష్ట్రం టాప్ ఫైవ్ జాబితాలో స్థానం సంపాదించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సెన్సస్ ఇండియా’ శాంపిల్ సర్వేలో 2011-13 కాలంలో జాతీయ స్థాయిలో బాలింతల మరణాలు ప్రతి లక్ష శిశువుల జననాలకు 167 ఉండగా, అది 130కు తగ్గినట్లు తేలింది. 2011-13 మధ్యకాలంలో తెలంగాణలో 92 మరణాలు చోటుచేసుకోగా ఇప్పుడు అది 81కి తగ్గింది. అయితే గతేడాది గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే కాగా మరొకటి మహారాష్ట్ర. అతి తక్కువ బాలింత మరణాలతో దేశంలోనే కేరళ మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూడేళ్ళ కాలంలో కేవలం ఏడుగురు బాలింతలు మాత్రమే మరణించినట్లు ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్న 3.32 లక్షల మంది మహిళల అభిప్రాయాలను బట్టి తేల్చింది. కేరళ రాష్ట్రంలో ప్రతి లక్ష జననాలకు 46 మంది బాలింతలు చనిపోతూ ఉండగా, తెలంగాణలో అది 81గా ఉన్నట్లు తేలింది. అతి తక్కువ మరణాలతో కేరళ తొలి స్థానంలోనూ, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. దేశం మొత్తంమీద 4,62,861 మంది శిశువులు జన్మిస్తే 556 మంది బాలింతలు చనిపోయారని (5.4%) తేలింది. అస్సాం, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇది 16%గా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా కేవలం 4.7%గా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో 93 నుంచి 77కు తగ్గింది. గరిష్టంగా 30% మేర ఉత్తమ ఫలితాలను సాధించి ఉత్తరప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1990నాటి గణాంకాలతో పోలిస్తే 2000 నాటికి 50% మేర తగ్గించాలని, 2015 నాటికి మరో సగం తగ్గాలని 1994లో జనాభా అభివృద్ధి అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సిఫారసు చేసింది.

కనీసంగా ప్రతి లక్ష జననాలకు 70 మంది కంటే ఎక్కువ మంది బాలింతలు చనిపోరాదని స్థిరీకృత అభివృద్ధి లక్షంలో నిర్దేశించుకోగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఆ లక్ష్యాన్ని సాధించాయి. అయితే కర్నాటకలో మాత్రం ఇప్పటికీ 108 బాలింత మరణాలు జరుగుతున్నట్లు తేలింది. ఈ సర్వేలో వెల్లడైన ఫలితాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు కూడా తోడయ్యాయని, కెసిఆర్ కిట్ పథకం చాలా మార్పులు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. గతేడాది గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇంకా ఉత్తమ ఫలితాలు వెలుగులోకి వచ్చేవని, తదుపరి సర్వేలో ఇది ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో బాలింత మరణాల రేటు దాదాపు 17% తగ్గినట్లు సర్వేలో తేలింది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో సగటున ప్రతి లక్షల జననాలకు సగటున 77 బాలింత మరణాలు జరుగుతున్నట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. 2013నాటి పరిస్థితులతో పోలిస్తే దేశంలో ప్రతీరోజు సుమారు 30 మంది బాలింతల మరణాలను నివారించినట్లు సర్వే గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

Comments

comments