Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

సమ్మె నిర్ణయం వెనక్కి

ఆర్‌టిసి సిబ్బందికి 16 శాతం ఐఆర్, జులై నుంచి అమలు 

కెసిఆర్ కార్మికుల పక్షపాతి : కెటిఆర్ 

ప్రభుత్వరంగ పరిశ్రమల రక్షణే ధ్యేయం : హరీశ్

రాష్ట్ర సాధనలో కార్మికుల పాత్ర గొప్పది: ఈటల

సిఎంపై నమ్మకంతో సమ్మె విరమిస్తున్నాం : అశ్వత్థామ

KTRహైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులకు 16 శాతం మేరకు (మూల వేతనంలో) తాత్కాలిక భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మె కాలంలో కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను వచ్చే నెల నుంచి చెల్లించేందు కు కూడా ప్రభుత్వం సమ్మతించింది. ఉద్యోగుల, కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయించి మూడు నెలల్లో నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయం తీసుకుంది. డి మాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆర్‌టిసి కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం 16 శాతం ఐఆర్ ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 200 కోట్ల మేర భారం పడనుంది. సమ్మెకు మరికొన్ని గం టల సమయమే ఉండడంతో ఆదివారం ఉదయం మొదలు సాయంత్రం వరకు ఏడుగురు మంత్రుల కమి టీ, ఆర్‌టిసి కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య వరుస సమావేశాలు జరిగాయి. సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత చర్చల సారాన్ని సిఎంకు వివరించారు. అనంతరం 16 శాతం   మేర తాత్కాలిక భృతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్‌టిసి కార్మికుల పాత్ర మరువలేనిది : మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆర్‌టిసి సమ్మె గురించి చర్చించిన తర్వాత 16% తాత్కాలిక భృతి ఇవ్వడానికి జరిగిన నిర్ణయాన్ని మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వివరిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్‌టిసి కార్మికుల పాత్ర మరువలేనిదని, పేదలను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్‌టిసి వ్యవస్థ చాలా కీలకమైనదని అన్నారు. ఒక రవాణా మంత్రిగా కెసిఆర్‌కు ఆర్‌టిసిపై స్పష్టమైన అవగాహన ఉందని, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత 43% ఫిట్‌మెంట్ అడిగితే ఒక శాతం ఎక్కువే ఇచ్చారని, ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌తో పాటు మళ్ళీ ఫిట్‌మెంట్ కూడా సంతృప్తిగానే ఇస్తారని తెలిపారు. భవిష్యత్తులో సంస్థ బలోపేతానికి తీసుకునే కార్యాచరణను కార్మిక సంఘాలకు వెల్లడించడంతో సమ్మెను వెనక్కి తీసుకునేందుకు టిఎంయూ అంగీకరించిందని తెలిపారు. 16 శాతం మధ్యంతర భృతి పెంపుతో ప్రభుత్వంపై నెలకు 16 కోట్ల ఆర్థిక భారం పడుతుందని, ఇది ఏడాదికి సుమారు 200 కోట్ల భారం అవుతుందన్నారు.
ప్రజా రవాణాలో ఆర్‌టిసిది కీలక భూమిక అన్నారు. ప్రతీ రోజు 93 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటోందన్నారు. సకల జనుల సమ్మె సుందర్భంగా ఆర్‌టిసి ఉద్యోగుల ఉద్యమం తెలంగాణ చరిత్రలో మరుపురానిదన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పిండినా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఆర్‌టిసి కార్మికుల సొంతమని ఈటల గుర్తుచేశారు.
ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి
అనేక కష్టనష్టాల్లో ఆర్‌టిసి ఉన్నా గానీ ముఖ్యమంత్రి కెసిఆర్ సంస్థ ఉద్యోగుల పట్ల అపారమైన ప్రేమానురాగాలను కనబరుస్తారని, ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా తమ ప్రభుత్వం ఉందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు 25 శాతం ఫిట్‌మెంట్‌పై గత నాలుగు రోజులుగా భీష్మించుకున్నప్పటికీ వారిని ఒప్పించి సంస్థ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను లోతుల్లోకి వెళ్లి తెలుసుకునేలా చేసి ఎట్టకేలకు 16 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, సమ్మె విరమణకు సహకరించిన ఉద్యోగకుల ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. 201718 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కోట్ల బడ్జెట్‌ను ఆర్‌టిసికి కేటాయించి 53 వేల మంది ఆర్‌టిసి ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించారన్నారు. ఆర్‌టిసిలో నష్టాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రస్తుతం సంస్థకు వస్తున్న నష్టాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్న పల్లె వెలుగు బస్సుల వల్లనే అధికంగా ఉందన్నారు. తిరుపతి, షీర్డీ, గోవా, ముంబాయి లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. సంస్థలో ఎప్పటికప్పుడు నూతన బస్సులను ప్రవేశ పెట్టి ఆర్‌టిసిని ఆధునీకరించామన్నారు. వజ్ర మినీ ఆర్‌టిసి బస్సులు పాతబస్తీలో ప్రవేశ పెట్టామన్నారు. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులను హైదరాబాద్ నుండి జిల్లా కేంద్రాలకు తిప్పుతున్నామన్నారు.
సిఎం కెసిఆర్ కార్మిక పక్షపాతి: పరిశ్రమలశాఖ మంత్రి కె.టి. రామారావు
ఐఆర్ కేవలం ఉపశమనం మాత్రమేనని, భవిష్యత్తులో ఈ సంస్థను కాపాడి ఆర్‌టిసి బాగుపడితే కార్మికులకు మాత్రమే కాదు, ప్రజలకు సేవలను అందిస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. సమ్మె విరమణకు సహకరించిన గుర్తింపు సంఘం టిఎంయూకు , అలాగే సంఘం గౌరవాధ్యక్షులు, మంత్రి హరీష్ రావుగా తన వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్‌టిసి కార్మికుల్లో ఉద్యమ సూర్తి, తెగువను సిఎం కెసిఆర్ స్వయంగా చూశారని, సింగరేణి కాలరీస్‌లోనూ బొగ్గు గనుల్లో కష్టపడుతున్న కార్మికుల పక్షంగా అనేక చర్యలను సిఎం తీసుకున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భవించడంలో కార్మికుల ఉద్యమం, చొరవ, తెగింపును పలు సందర్భాల్లో కెసిఆర్ గుర్తు చేస్తారని కెటిఆర్ అన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు బీమాతో ఆదుకుంటామని హామీ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఆర్‌టిసి సమ్మె నోటీసు నేపథ్యంలో గత నాల్గు రోజులుగా తమకు కూడా చాలా నిర్దిష్టంగా తన ఆలోచనలను చెబుతున్నారని, కార్మికులపై ఉన్న ప్రేమ, అదే సందర్భంలో సంస్థ పరిరక్షణను పలు సందర్భాల్లో కొనియాడారన్నారు.
ప్రభుత్వ రంగం సంస్థల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : హరీష్ రావు
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ మూలంగా పలు సంస్థలు మూత పడుతున్నా, తాము మాత్రం ఆర్‌టిసి తరహాలో వాటిని కాపాడుకునేందుకు యత్నిస్తున్నామన్నారు. బిహెచ్‌ఈఎల్ సంస్థకు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను అప్పగించామన్నారు. 16 శాతం ఫిట్‌మెంట్ అందజేసేందుకు సమ్మతించిన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సిఎంపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నాం: అశ్వత్థామ రెడ్డి
ఆర్‌టిసి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, 16 శాతం ఐఆర్ పెంచారని, త్వరలోనే ఫిట్‌మెంట్ పెంపుదలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. సకల జనుల సమ్మె వేతనాలను విడుదల చేస్తున్నందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.

Comments

comments