Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పారిశుద్ధ కార్మికుల లెక్కలు!

edt

గత 26 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజర్స్ అంటే చేతులతో మలమూత్రాలను శుభ్రపరిచే పారిశుద్ధ్యకార్మికులు ఎంత మంది ఉన్నారో తెలుసుకోడానికి ఏడు సర్వేలు నిర్వహించాయి. జాతీయ జనాభా లెక్కల సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల గుర్తింపు ప్రక్రియను కూడా మార్చింది. 1992లో చేపట్టిన సర్వే ప్రకారం 5.88 లక్షల మంది మాన్యువల్ స్కావెంజర్స్ దేశంలో ఉన్నారు. తర్వాత 2002లో మరో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సంఖ్య మరింత పెరిగింది. సామాజికన్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 6.76 లక్షల మంది మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించింది. ఆ తర్వాత ఈ సంఖ్యను మరింత పెంచవలసి వచ్చింది. దాదాపు 8 లక్షల మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారని తుదకు చెప్పారు.
విచిత్రమేమంటే, 2013 నాటికి మంత్రం వేసినట్లు మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య తగ్గిపోయింది. 2013లో వీరి సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 13,639 మాత్రమేనని తేల్చారు. ఈ సర్వే ఎప్పుడు చేశారంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ చట్టం చేసిన తర్వాత ఈ సర్వే నిర్వహించారు. మాన్యువల్ స్కావెంజింగ్ దేశంలో పూర్తిగా నిర్మూలించడానికి చేసిన చట్టం ఇది. మనిషి సమాజం గౌరవమర్యాదలను కాలరాసే అత్యంత హీనమైన మాన్యువల్ స్కావెంజింగ్ వంటి వ్యవస్థ ఉండడం దేశానికి సిగ్గుచేటు కాబట్టి ఈ చట్టం చేశారు. ఆ తర్వాత చేసిన సర్వేలో లక్షల నుంచి వేలకు మాన్యువల్ స్కావెంజర్ల సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు. ఈ లెక్కన చూస్తే 2018 నాటికి అస్సలు మాన్యువల్ స్కావెంజింగ్ అనేది దేశంలో లేనే లేకుండా పోయి ఉండాలి.
కాని ఈ సర్వేల్లో చూపించిన సంఖ్య ఒక పెద్ద ప్రహసనం. కొద్దిగా ఆలోచిస్తే చాలు ఈ లెక్కలు అత్యంత హాస్యాస్పదమైనవని అర్థమవుతుంది. దేశంలో డ్రై లెట్రీన్లు ఎన్ని ఉన్నాయి, మాన్యువల్ స్కావెంజర్లు ఎంత మంది ఉన్నారన్న విశ్లేషణ పెద్ద కష్టమేమీ కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 21 లక్షల టాయిలెట్లు ఉన్నాయి. ఇవి మాన్యువల్ స్కావెంజింగ్ చేయవలసినవే. ఈ టాయిలెట్లను ఎవరు శుభ్రం చేస్తున్నారు? వాటికవే ఆటోమేటిగ్గా పరిశుభ్రం అయ్యే అవకాశమే లేదు. లేదా కేవలం 13639 మంది స్కావెంజర్లు సూపర్ మ్యాన్లుగా మారిపోయి దేశమంతా తిరిగేసి ఈ ఇరవై ఒక్క లక్షల టాయిలెట్లు శుభ్రం చేస్తున్నారా? ఇది చాలా హాస్యాస్పదమైన సంఖ్య. మాన్యువల్ స్కావెంజింగ్ లేదని చెప్పడానికి ఇలాంటి సంఖ్యలతో మభ్యపుచ్చడం సాధ్యం కాదు. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ప్రభుత్వాలు ఊహిస్తున్న దాని కన్నా చాలా పెద్ద సమస్య. సమాజంలో చాలా లోతుగా వేళ్ళూనుకున్న సమస్య. ఈ సమస్య పరిష్కారానికి చట్టాలు చేయడం అవసరమే. అయితే చట్టం చేయడంతో పాటు ఇతర ప్రయత్నాలు కూడా కొనసాగాలి.
మాన్యువల్ స్కావెంజర్స్ విషయంలో చేపట్టిన ప్రతి సర్వే లోపాలతో కూడుకుని ఉంది. సర్వేను డిజైన్ చేసిన ప్రక్రియ, సర్వేయర్లకు శిక్షణ లేకపోవడం, సమాజంలో సర్వేపై సదాభిప్రాయం లేకపోవడం, అనుమానాలు ఇవన్నీ సర్వే ప్రక్రియను దెబ్బతీశాయి. సర్వేలో లోపాలను, సర్వే ప్రక్రియలో లోపాలను పౌరసమాజ ప్రతినిధులు చెప్పినా సీరియస్ గా ప్రభుత్వాలు తీసుకోలేదు. రాష్ట్ర, జిల్లా అధికారుల్లో దేన్నయినా “అబ్బే అలా కాదు” అని ఖండించే ఒక సంస్కృతి ఉంది. మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థను తుడిచిపెట్టే బాధ్యత ఏ అధికారుల నెత్తిన ఉందో ఆ అధికారుల్లోనే కులతత్వం పేరుకుపోయి ఉండడం వల్లనో మాన్యువల్ స్కావెంజింగ్ విషయమై ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు.
2013లో చేసిన చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజర్‌ను గుర్తించిన తర్వాత వారికి పునరావాసం కల్పించవలసిన అవసరాన్ని వివరంగా తెలియజేసింది. పునరావాస చట్టాలన్నింటి మాదిరిగానే ఇదంతా కేవలం కాగితాలపైనే ఉంది. ఈ కొత్త చట్టం రాకముందు కూడా మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాసానికి ఏర్పాట్లు ఉన్నాయి. 2007లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మాన్యువల్ స్కావెంజర్స్ కోసం, వారి పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం కూడా ప్రవేశపెట్టింది. 2009 లోగా మాన్యువల్ స్కావెంజింగ్ అనేది లేకుండా చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ పనిని ప్రారంభించారు.
ఈ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2009 నాటికి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3.42 లక్షల మాన్యువల్ స్కావెంజర్లలో 1.18 లక్షల మందిని గుర్తించడం జరిగింది. ఈ కుటుంబాలకు వడ్డీ సబ్సిడీతో రుణసదుపాయం కల్పించామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1.18 లక్షల మందిలో 78,941 మందికి తక్కువ వడ్డీతో రుణాలిచ్చామని చెప్పారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది లేదు. మిగిలిన 2.6 లక్షల మంది మాన్యువల్ స్కావెంజర్లను పట్టించుకున్నది లేదు. పైగా ప్రభుత్వ డేటా ప్రకారం కొత్త చట్టం 2013లో వచ్చిన తర్వాత కేవలం 12,771 మంది మాన్యువల్ స్కావెంజర్లకు మాత్రమే ఒకేవిడత ఆర్థిక సహాయం లభించింది. కేవలం 4587 మందికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ లభించింది.
2018లో కేంద్రప్రభుత్వం మరో సర్వే చేయాలని తలపెట్టింది. ఈ సారి ప్రభుత్వం సర్వే పద్ధతి కొద్దిగా మార్చింది. స్వచ్ఛందసంస్థలు, ఎన్జీవోలు, సామాజిక సంస్థలకు కూడా సర్వే ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది. ఇది స్వాగతించదగిన విషయం. మాన్యువల్ స్కావంజర్లకు సంబంధించి సమగ్ర పునరావాస పథకం విషయంలో చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి. పునరావాసం అంటే ఒక 40 వేల రూపాయల చెక్కును ఇవ్వడం కాదు. ఈ కుటుంబాలు గౌరవమర్యాదలతో సమాజంలో జీవించే వాతవరణాన్ని కల్పించడం. చక్కని నివాసగృహ సదుపాయం, అవసరమైన వృత్తి శిక్షణ, స్వయం ఉపాధికి అవసరమైన ఆర్థిక సహాయం, పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్పులు ఇవన్నీ అందవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుతం చేపట్టిన సర్వే పూర్తి కాగానే ప్రభుత్వం తక్షణం వేగంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ సర్వేతో కలిసి ఇప్పటికి ఎనిమిది సార్లు ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్ల విషయంలో సర్వేలు చేయించడం, మరిచిపోవడం జరిగినట్లవుతుంది.
* ఆషిఫ్ షేక్ (ది వైర్)

Comments

comments