Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అలా చేస్తే గౌరవం ఉండదు

సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబుతో ఇంటర్వూ విశేషాలు…

sudheer

అది ఆగిపోయింది…
నా మొదటి సినిమా ‘ఎస్‌ఎంఎస్’ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ నన్ను కలిశారు. ఆ సమయంలో ఆయన నాకు ఒక కథ చెప్పారు. నిర్మాణ సంస్థతో సైన్ కూడా చేసుకున్నాం. కానీ అది ఆగిపోయింది. అదే ‘ఊహలు గుసగుసలాడే’. ఆ కథ శ్రీనివాస్ అవసరాలది.
రొమాంటిక్ లవ్ స్టోరీ…
నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే కథతో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే చిత్రమిది.
ఒక గోల్ పెట్టుకొని…
సినిమాలో నా పాత్ర పేరు విజయ్. జీవితంలో ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తుంటాను. సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండని పాత్ర అది. అలాంటి హీరో జీవితం ఎలా మలుపు తిరిగింది అనేదే ఈ చిత్రం.
పాత్ర రాసేటప్పుడే…
హీరోయిన్ అదితిరావు పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇందులో ఆమె ఒక స్టార్ హీరోయిన్‌గా నటించింది. నిజ జీవితంలో నటులు మేకప్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటారు, మేకప్ తీసినప్పుడు ఎలా ఉంటారు అనేది ఆమె పాత్రలో చూడవచ్చు. అదితి చాలా బాగా నటించింది. హీరోయిన్ పాత్ర రాసేటప్పుడే ఇంద్రగంటి అదితిని అనుకున్నారు.
ఆద్యంతం వినోదాత్మకంగా…
సినిమా పట్ల, సెలబ్రిటీల పట్ల ప్రజల్లో ఎలాంటి భావం ఉంది అని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అంతేకానీ ఎవరిని కావాలని ఉద్దేశించి విమర్శలు మాత్రం చేయలేదు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా కొనసాగుతుంది.
వన్ మ్యాన్ ఆర్మీలా…
దర్శకుడు మోహన్‌కృష్ణ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం. సినిమా మొత్తం వాస్తవానికి దగ్గరగా ఉండేలా తీశారు. నేను చేసిన సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ అని చెప్పగలను. ఇంద్రగంటితో పనిచేస్తుంటే సినిమా చేస్తున్నట్టు ఉండదు. నిజ జీవితంలో ఉన్నట్టే ఉంటుంది. ఆయన వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తారు.
వినోదంతో పాటు భావోద్వేగాలు…
సినిమాలో నరేష్ పాత్ర చాలా బాగుంటుంది. ‘గోల్కొండ హైస్కూల్’ చేసేటప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఆయన పాత్రను రాసుకొని ఈ కథ మొత్తాన్ని తయారు చేశారు ఇంద్రగంటి. నరేష్ పాత్రలో వినోదంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి.
కష్టపడి పనిచేయాలి…
నేను ఇష్టపడి, ప్రేమించి సినిమాల్లోకి వచ్చాను. అలాంటప్పుడు కష్టపడి పనిచేయాలి. అంతేకానీ కృష్ణ, మహేశ్‌బాబు పేర్లు వాడుకొని అవకాశాలు రాబట్టుకోవడం నాకు నచ్చదు. అలా చేస్తే గౌరవం ఉండదు.
తదుపరి చిత్రాలు…
నేను ప్రధాన పాత్రలో నటించే గోపీచంద్ బయోపిక్ మూవీ సెప్టెంబర్ నుండి మొదలవుతుంది. అలాగే కొత్త దర్శకుడు ర్.ఎస్.నాయుడుతో ఒక సినిమా చేస్తున్నాను. ఇది 80 శాతం పూర్తయింది. మరో చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రం చివరి దశలో ఉంది.

Comments

comments