Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

బడిబాటసారులు

బడిబాట సక్సెస్
చేరిన వేలాదిమంది పిల్లలు
పాలు పంచుకున్న ప్రజా ప్రతినిధులు
ఆసక్తి కనబర్చిన తల్లిదండ్రులు

జిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు
Schools

రాష్ట్రంలో విద్యా శాఖ నిర్వహించిన “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” సక్సెస్ అయిం ది. బడిబాటతో వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఉపాధ్యాయులు, అధికారులు, విద్యా కమిటీల సభ్యులు ఇంటింటికి తిరిగి బడికి బయట ఉన్న బడి ఈడు పిల్లల వివరాలను సేకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ‘పిల్లలు ఉండాల్సింది బడిలో..పనిలో కాదు” అని విద్యాశాఖ రూపొందించిన నినాదం ప్రజలను ఆకట్టుకుంది. ఫలితంగా తమ పిల్లలను పాఠశాల ల్లో చేర్పించేందుకు తల్లితండ్రులు కూడా ఆసక్తిని కనబరిచారు. ఉపాధ్యాయులు, అధికారులు, విద్యాకమిటీల సభ్యులు, ప్రజాప్రతినిధులు సం యుక్త భాగస్వామ్యంతో విద్యాశాఖ నిర్వహించి న బడి బాటకు విశేష స్పందన లభించింది. ఐదు రోజుల పాటు జరిగిన బడిబాటలో ఎంపిలు, ఎం ఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములై బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గమనార్హం. ఇదిలా ఉండగా బడి బాట జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేపట్టడంతో ఒకటి, రెండు జిల్లాల్లో బడిబాటపై ప్రభావం పడింది.
బడిబాట కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. జిల్లా యంత్రాంగం బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది. మొత్తం 13 వేల మంది విద్యార్థులను బడుల్లో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. గ్రామాల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సామూహిక విద్యాభ్యా సం చేయించారు. జిల్లాలో మొత్తం 2183 పాఠశాలలు ఉండగా, బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు వివిధ పాఠశాలల టీచర్లు, విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జయశంకర్ బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు అంగన్‌వాడీకి వెళ్లే పిల్లలను కూడా వివిధ కేంద్రాల్లో చేర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 7,899 మంది పిల్లలను బడిబాట పట్టించారు. అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 840 మంది పిల్లలను బడుల్లో చేర్పించారు. అతి తక్కువగా కరకగూడెం మండలంలో 89 మంది పిల్లలు బడులలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా వలస వెళ్లిన పిల్లలే బడికి దూరంగా ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 2 వేల మంది బాలలు బడిబయట ఉన్నట్లు గుర్తించగా, వీరిలో 1100 మందిని తల్లిదండ్రులను ఒప్పించి బడిలో చేర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1400 మంది విద్యార్థులను బడిబయట ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా మద్యలోనే బడి మానేసిన వారు 12 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బడిబాట కార్యక్రమంతో వినూత్న రీతిలో ర్యాలీలు, పాటలతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 1300 మంది బడి బయటి పిల్లలను గుర్తించినప్పటికీ 608 మందిని బడిలో చేర్పించగలిగారు.జిల్లాలో మొత్తం 3564 మంది విద్యార్థులు నూతనంగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు.
బడిలోకి ఇటుక బట్టీలలోని పిల్లలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామస్థుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యా శాఖ అధికారులు బడిబాటను విజయవంతంగా నిర్వహించింది. ఇటుక బట్టీల వద్ద, ఫ్యాక్టరీల వద్ద కూడా విద్యా శాఖ అధికారులు ప్రచారం చేసి చిన్నారులను బడిలో చేర్పించారు. ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ మొత్తంగా బడి బాటను విజయవంతం చేశారు. బడి బాటతో మెదక్ జిల్లాలో 5600 మంది, సిద్దిపేట జిల్లాలో 10,141 మంది, సంగారెడ్డి జిల్లాలో 8730 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు మధ్య అంతరాన్ని ప్రజలకు వివరించామని, తద్వారా ప్రజల్లో మంచి స్పందన కూడగట్టామని డిఈవో శ్యామ్‌ప్రసాద్‌రావు ‘మన తెలంగాణ’కు వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలిపి 12, 622 మంది విద్యార్థులను బడిబాట కార్యక్రమంలో కొత్తగా నమోదు చేశారు. నిర్మల్‌లో 6036 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 8584 మందిని, మంచిర్యాల జిల్లాలో 872 మంది పిల్లలను బడిబాట కార్యక్రమంలో కొత్తగా నమోదు చేశారు. మొత్తానికి ప్రైవేట్ హవా నడుస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం హర్షనీయమని పలువురు అంటున్నారు.
బడిబాటకు స్పందన భళా
తల్లితండ్రులు పెద్దఎత్తున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆరాటపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో సర్కార్ బడులలో విద్యార్ధుల సంఖ్య నిత్యం పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా లో బడిబాటలో 13612 మంది విద్యార్దులను గుర్తించి వారి ని పాఠశాలల్లో చేర్చుకున్నారు. మేడ్చల్ జిల్లాలో బడిబాటకు మంచి స్పందన వచ్చింది. జిల్లాలో 7293 మంది విద్యార్దులు బడిబాటలో చేరారు. వికారాబాద్ జిల్లాలో 7936 మంది పిలల్లు బడిబాటలో నమోదు చేసుకుని పాఠశాలల్లో చేర్పించారు.
హైదరాబాద్‌లోనూ బాడి బాటకు విశేష స్పందన
రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ జిల్లాలో బడిబాటకు విశేష స్పందన లభించింది. 2018————–19 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన బాట కార్యక్రమంలో కేవలం 5 రోజుల్లోనే మొత్తం 6089 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. ఇందులో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 208 మంది, స్కూల్స్ నుంచి మరో స్కూల్‌కు 5749 మంది, కొత్త విద్యార్థులు 122 మంది విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక డ్రాప్‌అవుట్ కూడా నమోదు కాలేదని విద్యాశాఖాధికారులు తెలిపారు.
ప్రభుత్వ బడుల కీర్తిని పెంచిన బడిబాట
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బడి బాట కార్యక్రమం ప్రభుత్వ బడుల కీర్తిని పెంచింది. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి వేల సంఖ్యలో బడిబయట ఉన్న పిల్లలను బడి ఈడు పిలలు, తల్లిదండ్రులలో చైతన్యాన్ని నింపారు. జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లలను బడిలోకి రప్పించేందుకు జిల్లాలో మరో 10 శాతం అక్షరాస్యతను పెంచేందుకు బడిబాట కార్యక్రమం దోహదపడిందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments