Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

చిరంజీవిని చూసి ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాలి

tej

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరణ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “కె.ఎస్.రామారావు నా ప్రియమైన మిత్రుడు, నాకు నచ్చిన నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది. 1982లో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం వంటి వరుస హిట్స్ నాకు ఈ బ్యానర్‌లోనే వచ్చాయి. 80వ దశకంలో నాకు అన్ని హిట్స్ వచ్చి ఎక్కువ మంది ప్రేక్షకుల ఆదరణ పొందానంటే అందుకు కారణం కె.ఎస్.రామారావే. ఆయన డబ్బుల కోసం ఎప్పుడూ సినిమాలు తీయలేదు. అత్యద్భుతమైన సినిమాలు తీయాలి, వాటి ద్వారా నేను నిరంతరం బ్రతికి ఉండాలి అని ఆయన ఆలోచిస్తుంటారు. కరుణాకరణ్ చేసిన ‘తొలిప్రేమ’ నాకు ఎంతో ఇష్టమైనది. లవ్‌స్టోరీస్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ సినిమా కరుణాకరణ్ ‘తొలిప్రేమ’ అంతటి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ హీరోలు అందరూ చక్కగా నడుచుకుంటున్నారు. ఆ రకంగా తేజు నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ముందుంటాడు. ఈ సినిమా రషెస్ చూశాను. కన్నులపండుగగా సినిమా ఉంది. ఖచ్చితంగా అందరినీ అలరించే ఫ్యామిలీ లవ్‌స్టోరీ ఇది. గోపీసుందర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్‌గా కనపడింది”అని అన్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ “చిరంజీవిని చూసి ఈ ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆయన అందరితో ప్రేమగా ఉంటారు. ఇక కరుణాకరుణ్ ఈ సినిమాను అందంగా తీశాడు. ఆయన తీసిన ‘తొలిప్రేమ’ గురించి అందరూ చెబుతున్నారు. కానీ ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రాన్ని ఇంకా గొప్ప లవ్‌స్టోరీగా తీశారు. ఇందులో తేజు, అనుపమ అద్భుతంగా నటించారు”అని తెలిపారు. ఎ.కరుణాకరణ్ మాట్లాడుతూ “నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రోజూ అన్నయ్య చిరంజీవి ముఖం చూడటానికి కోడంబాకం బ్రిడ్జ్‌పై నిలబడేవాడిని. సినిమా కలను పెద్దన్నయ్య చిరంజీవి ఇస్తే సినిమా ఇచ్చింది చిన్నన్నయ్య పవన్‌కల్యాణ్. ఇప్పుడు నా తమ్ముడు తేజుతో ఈ సినిమా చేశాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, హరీశ్ శంకర్, గోపీ సుందర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది

Comments

comments