Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

చర్చిస్తూ పోవడమే శరణ్యం

indian-soldiers

సరిహద్దు ఆవలి నుంచి ఎగదోస్తున్న తీవ్రవాదం, అంతర్గతంగా వామపక్ష తీవ్రవాదం -ఈ రెండు దేశ భద్రతకు ప్రధానమైన సవాళ్లు అని మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ పదే పదే అనే వారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ హయాంలోనూ ఈ రెండు సమస్యలు అదుపులోకి వచ్చిన సూచనలు లేవు. 2016 సెప్టెంబర్ 18వ తేదీన లష్కర్-ఎ -తయ్యబా తీవ్రవాదులు ఉరీలో ఓ గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్న భారత సేనల మీద తెల్లవారు ఝామున దాడి చేసి 19 మంది భారత సైనికులను హత మార్చారు. ఈ సంఘటనతో దేశమంతా అట్టుడికిపోయింది. పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలన్న వారూ ఉన్నారు. సరిగ్గా పది రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 28 29 అర్ధ రాత్రి భారత సేనలు నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద మెరుపు దాడి చేశాయి. ఈ దాడిలో ఎంతమంది పాకిస్తాన్ సైనికులు మరణించారో కచ్చితమైన లెక్కలు లేవు. కాని 80 మంది పాక్ సైనికులను ఈమెరుపు దాడిలో మట్టుపెట్టగలిగామన్న అంచనాలు ఉన్నాయి.
ఈ మెరుపు దాడి గురించి విపరీతమైన ప్రచారం జరిగింది. గొప్ప విజయం సాధించామన్న అభిప్రాయం కలిగించారు. కాని దీని వల్ల పాకిస్తాన్ దుండగుల వైఖరిలో మార్పు వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. మెరుపు దాడి తర్వాత రెండేళ్లుగా అధీన రేఖ దగ్గర కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తేవడానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. కాని వాస్తవ పరిస్థితిలో పెద్ద మార్పులేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్ ఆగడాలకు చెప్పవలసిన రీతిలో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూనే మరో వేపున దౌత్యమార్గాలు, సంప్రదింపులకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే 2017 అక్టోబర్‌లో గూఢచార శాఖ మాజీ అధిపతి దినేశ్వర్ శర్మకు కశ్మీర్‌లోని వివిధ వర్గాల వారిని సంప్రదించి కశ్మీర్ సమస్యను పరిష్కరించే దిశగా చర్చలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించింది. దినేశ్వర్ శర్మ ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో అనేక సార్లు కశ్మీర్ సందర్శించారు. వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాని పరిష్కారం కనుచూపుమేరలో కనిపించాలంటే ఎవరితో అయితే చర్చలు జరపాలో వారు శర్మను పలకరించడానికి కూడా సిద్ధంగా లేరు. వేర్పాటువాదులు ఇప్పటికీ చర్చలకు ససేమిరా అంటున్నారు. వేర్పాటు వాదులకు ప్రాతినిధ్యం వహించే హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు దినేశ్ శర్మను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు. గూఢచార శాఖ మాజీ అధికారిని సంధానకర్తగా నియమించడం అంటేనే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ సమస్యను కేవలం పరిపాలనా సంబంధమైన అంశాంగానే భావిస్తోందని హురియత్ నాయకులు అంటున్నారు. కశ్మీర్ సమస్య కేవలం కేంద్ర ప్రభుత్వానికీ కశ్మీరీలకు పరిమితమైన వ్యవహారం కాదనీ ఈ సమస్య త్రైపాక్షికమైందనీ అందువల్ల పాకిస్తాన్‌కు కూడా ఈ సంప్రదింపుల్లో పాత్ర ఉండాలని వాదిస్తోంది. దినేశ్వర్ శర్మను కశ్మీర్‌కు పంపించడం అంటే ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రభుత్వం భావించడం లేదనే. దినేశ్ శర్మకు బాధ్యత అప్పగించడానికి ముందే మునుపటి ప్రభుత్వా లు అనేక ప్రయత్నాలు చేశాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత కశ్మీర్ గవర్నర్ నరేంద్ర నాథ్ వోహ్రాకు కశ్మీరీలతో మాట్లాడే బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత విద్యావేత్త రాధా కుమార్, ఐ.ఎ.ఎస్. అధికారిగా పని చేసిన ఎం.ఎం.అన్సారీ, పత్రికా రచయిత దిలీప్ పడ్గాంకర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అఖిలపక్ష కమిటీ కూడా కశ్మీర్ వెళ్లింది. అప్పుడూ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అఖిలపక్ష నాయకులతో సంప్రదించడానికి అంగీకరించలేదు. పైగా అఖిలపక్ష బృందం సయ్యద్ అలీ షా జిలానీ ఇంటికి వెళ్తే కనీసం తలుపు కూడా తీయలేదు.
పాకిస్తాన్‌కు, బహుశా ఇతర దేశాలకుచెందిన మిలిటెంట్లు కశ్మీర్‌లో ఆగడాలు సృష్టిస్తూనే ఉన్నారు. వీరు స్థానిక మిలిటెంట్లతో కలిసి విధ్వంసానికి పాల్పడుతున్నారు. స్థానిక మిలిటెంట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలలు, పసిపిల్లలు సైతం మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారంటే స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై ఏ మాత్రం విశ్వాసం లేదు అని అర్థమవుతోంది. దీనికి తోడు ప్రస్తుత కశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి, బిజెపికి మధ్య పొరపొచ్చాలు తీవ్రవాదం పెచ్చరిల్లడానికే ఉపకరిస్తోంది. కొద్ది నెలల కిందట షోపియాన్‌లో సైన్యం జరిపిన కాల్పుల విషయంలో ప్రభుత్వంలో భాగస్వాములైన రెండు పక్షాల నాయకులు చెరో రీతిలో వ్యవహరించారు. జమ్మూ ప్రాంతంలోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలిక అసీఫాపై అత్యాచారం జరిగినప్పుడూ పి.డి.పి., బిజెపి చెరో దారి అనుసరించాయి. ఈ విభేదాలు బహిరంగానే వ్యక్తమైనాయి. ఇవి సమాజాన్ని చీల్చడానికి తోడ్పడ్డాయి. ప్రజలు ప్రాంతాల వారీగా, మతాల వారీగా చీలిపోయారు. ఇది మిలిటెంట్లకు ఊతమిస్తోంది. ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్‌లో పర్యటించారు. 2016 జులై ఎనిమిదిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని హతమార్చిన దగ్గరి నుంచి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ లో పర్యటించడం ఇది మూడోసారి. కొనసాగుతున్న రాళ్లు విసిరే సంఘటనలను, అధీన రేఖ పొడవునా నిరంతర కాల్పులవల్ల ఎదురవుతున్న పరిస్థితిని రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించినప్పటికీ ఆయన ఎజెండాలో సంప్రదింపుల అంశం లేనే లేదు. హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ రాజకీయ చర్చలు జరగాలని అంటున్నారు. ఈ చర్చల్లో పాకిస్తాన్‌కు కూడా పాత్ర ఉండాలని హురియత్ పట్టుబట్టడం ప్రభుత్వ సంప్రదింపుల ప్రయత్నానికి అడ్డుతగులుతూ ఉండవచ్చు. కాని మార్గాంతరం ఏమిటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఏ సమాధానమూ లేకపోవడం ప్రతిష్టంభన కొనసాగడానికే దారి తీస్తోంది. హురియత్ నాయకులతో చర్చలకు సిద్ధమేనని 2018 మేలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ సారి ఆయన పర్యటన కేవలం క్రీడాకారులకు బహుమతులు అందజేయడం, ఉత్తరాన ఉన్న కుప్వారాలాంటి ప్రాంతాల పర్యటనకే పరిమితంఅయింది. కశ్మీర్‌ను ‘వివాదాస్పద’ ప్రాంతంగా ప్రకటించాలన్న హురియత్ వాదనకు ప్రభుత్వ స్పందన ఏమిటో తెలియదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌లో భద్రత మరింత దిగజారింది. జైష్- ఎ- మహమ్మద్ మరింత క్రియాశీలంగా తయారై లక్షర్- ఎ- తయ్యబాతో పోటీపడి విధ్వంసం సృష్టిస్తోంది. మొదట అధీన రేఖ పొడవునా ఆ తర్వాత పంజాబ్ లోని పఠాన్‌కోట్‌లోనూ జైష్- ఎ- మహమ్మద్ ఆగడాలకు పాల్పడింది. ఈ దాడులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
రంజాన్ సందర్భంగా సైనిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేశారు. దీనివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. కాని కాల్పుల విరమణ రంజాన్ ముగియడంతోనే ఆగిపోతే పరిస్థితి మళ్లీ మొదటికి రాక తప్పదు. సరిహద్దులో నిరంతరం కాల్పులు జరగడం వల్ల సరిహద్దుకు రెండు వైపుల ఉన్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనేకమంది నిర్వాసితులవుతున్నారు. క్షతగాత్రులవుతున్నారు. కశ్మీర్ సమస్య కేవలం శాంతిభద్రతల సమస్యే కాదు. అది రాజకీయ, మానసిక, భావోద్వేగాల సమస్య కూడా. అందువల్ల విద్రోహకర కార్యకలాపాలతో నిమిత్తం లేకుండా సంప్రదింపుల ప్రయత్నాలు కొనసాగాలి. లోటంతా ఇక్కడే ఉంది. చర్చలకు సానుకూల పరిస్థితి ఏర్పరచే బాధ్యత ఉన్న దినేశ్ శర్మ ప్రయత్నంలో లోపం లేదు కాని ఆయన పరిస్థితి చక్కబడే దాకా వేచిచూడాలి అంటున్నారు. ఆయన గుడ్డు ముందా, కోడి ముందా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో సంప్రదింపులకు మార్గం సుగమం చేయడం అంతకన్నా ప్రధానం. సంప్రదింపులు కొత్త పరిణామాలకు తావిస్తాయి. శాంతి కోరుతున్న ప్రజలకు ఎంతో కొంత మేర ఊరట లభిస్తుంది. వేర్పాటువాదులు తమ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచనలోపడ్డారు. వారితో సంప్రదించడం జాప్యం అయిన కొద్దీ వారు పాకిస్తాన్ వైపే మొగ్గుతారు. కశ్మీర్ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల భిన్న ధోరణులకు తోడు కేంద్ర ప్రభుత్వ వైఖరికి బిజెపి ఉద్దేశానికీ స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్‌లో పరిస్థితి కుదుటపడాలి అని చెప్తుంటే బిజెపిలో కశ్మీర్ వ్యవహారాల బాధ్యుడు రాంమాధవ్, భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ భిన్న స్వరం వినిపిస్తున్నారు. అంటే అధికారపక్షంలోనే ఏకశ్రుతి లేదు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న నమ్మకాన్ని మునుపటి యు.పి.ఎ. ప్రభుత్వం, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం కూడా కల్పించలేదు. కశ్మీర్‌లో సైన్యం తిష్ఠ వేసి ఏళ్లు గడుస్తోంది. ఇది ప్రమాద సూచన అని మాజీ సైనికాధికారి వి.పి.మలిక్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రజలకు మెడ మీద కత్తిలా ఉంది. ఒమర్ అబ్దుల్లా క్రమంగా ఈ భయానక చట్టాన్ని ఉపసంహరించాలి అన్నారు. మొదట శ్రీనగర్, ఆ పరిసర ప్రాంతాలలోఈ చట్టం అమలు నిలిపి వేయాలని ఒమర్ అబ్దుల్లా కోరారు. ఈ ప్రతిపాదనను అప్పటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కూడా సమర్థించారు. కాని దురదృష్టవశాత్తు ఆ చట్టాన్ని ఉపసంహరించలేదు.
ప్రస్తుతం కశ్మీర్ పరిస్థితిని చూస్తే పరిష్కార మార్గమే లేదా అన్న నిర్వేదం కలుగుతోంది. ఇటీవలి కాలంలో అక్కడ భారీ సంఘటనలు ఏమీ జరగలేదుగా అని సరిపెట్టుకునేవాళ్లు ఉన్నారు. భద్రతా దళాల, తీవ్రవాదుల తుపాకుల శబ్దం అనునిత్యం వినిపించేచోట మారణహోమం ఏమీ జరగలేదుగా అని మిన్నకుండే వైఖరి మామూలు విషయంగా కనిపించవచ్చు. కాని ప్రశాంతతా లేదు, పరిష్కార మార్గమూ లేదు అన్నభావన భయంకరమైందే. యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్, ముషర్రాఫ్ ఇద్దరూ చేతికందిన అవకాశాన్ని జార విడుచుకున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. పాకిస్తాన్ అధినేత దిల్లీ వచ్చారు. తర్వాత మోదీ స్వయంగా వెళ్లి నవాజ్ షరీఫ్‌ను పలకరించడంవల్ల కూడా ప్రయోజనం ఏమీకనిపించ లేదు. అయినా కశ్మీర్ సమస్య ఒక కొలిక్కి రావాలంటే నిరంతర ప్రయత్నం కొనసాగాల్సిందే. ఎన్ని సార్లు అవసరమైతే అన్ని సార్లూ ప్రయత్నించాల్సిందే. దినేశ్వర్ శర్మ తన ప్రయత్నాలను క్రోడీకరిస్తూ ఓ నివేదిక తయారు చేస్తానంటున్నారు. నివేదికలకు ఎన్నడూ కొదవలేదు. అవన్నీ దుమ్ముకొట్టుకు పోతున్నాయి. నిజాయితీగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్న నమ్మకం కశ్మీరీలకు కలిగించకపోతే నివేదికలు, దూతలు సాధించేది ఏమీ ఉండదు. కశ్మీరీలు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలేదు కనక వారూ అసత్యాన్నే ఆశ్రయిస్తారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కఠిన వైఖరే అనుసరిస్తున్నారు. 1989 నుంచి 92 దాకా కశ్మీర్ అల్లకల్లోలంగానే ఉంది. అయినా అప్పుడు సంప్రదింపుల క్రమం ఆగలేదు. కాని ఇప్పుడు చర్చల ప్రస్తావనే లేదు. సగటు కశ్మీరీలు శాంతి కోరుతున్నారు. కొంత మంది ‘ఆజాదీ’ కావాలనే వారూ ఉండొచ్చు. అలాంటి వారిని మనం చేరదీసి, గౌరవించి, న్యాయంగా వ్యవహరించగలిగితే ఫలితం ఉండకపోదు. నిజానికి కశ్మీరీల దృష్టిలో అదే పెద్ద ‘ఆజాదీ’. పాకిస్తానీలకు భారత్ వీసాలివ్వకపోవడం, పాకిస్తాన్ భారతీయులకు అదే పని చేయడం వల్ల ఏ దేశానికీ ప్రయోజనం ఉండదు. రెండు దేశాల ప్రజల సంపర్కానికి మధ్య అడ్డంకులు ఉండకూడదు. అప్పుడే కశ్మీరీలకు పాకిస్తాన్‌లో పరిస్థితి ఏమిటో అవగతమవుతుంది. 2006-07లో అప్పటి పాక్ అధినేత జనరల్ ముషర్రఫ్ నాలుగు సూత్రాల పథకం ప్రతిపాదించారు. మనం సమయానికి దాన్ని ఆమోదించకపోవడంవల్ల ఆ అవకాశం పోయింది. ఆ నాలుగు సూత్రాల పథకంలో ముషర్రఫ్ అధీన రేఖను సరిహద్దుగా అంగీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏవో కొన్ని మార్పులు కోరారు. ఈ లోగా ముషర్రఫ్ గద్దె దిగిపోయారు. 2004-05లో పరిస్థితి మరింత అనుకూలంగా ఉండేది. ముషర్రఫ్ డిల్లీకి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా కరాచీ వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూశారు. ఈ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తారుమారైంది. కశ్మీర్ సమస్యకు సత్వర పరిష్కారం కుదురుతుందనుకోవడం భ్రమ. ఎంత సమయం పట్టినా సంప్రదింపుల ద్వారా మాత్రమే కశ్మీర్‌లో శాంతి సాధన సాధ్యం. దానికి నిరంతర ప్రయత్నం అవసరం. మోదీ సర్కారు ఆ ప్రయత్నాలు చేస్తున్న జాడ మాత్రం లేదు.

ఆర్వీ రామారావ్

Comments

comments