Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఫార్మారంగంలో టైకీ అద్భుతాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధితో తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటుచేసుకుంటోంది నేటి యువత. తమతోపాటు పదిమందికి ఉపాధి సౌకర్యం కల్పిస్తోంది.అందరికీ ఉపయోగపడేవిధంగా నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయపథంలో దూసుకుపోతోంది. అలాంటికోవకు చెందిన ఓ అంకుర సంస్థే టైకీ ఇన్నోవేషన్స్.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు చేసి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి చక్కని మార్గం చూపుతోంది ఈ సంస్థ.

life

ఫార్మసీ కళాశాలలు, విద్యార్థులకు అవసరమైన సాఫ్ట్‌వేర్ కోసం విదేశాల వైపు చూడకుండా మన దేశంలోనే తయారు చేస్తోంది టైకీ ఇన్నోవేషన్స్ సంస్థ. అపారమైన ఉద్యోగ అవకాశాలకు వారధిగా నిలుస్తోంది. ఫార్మ్ డి చదివి అందరిలా అవకాశాలు లేవని నిరుత్సాహపడకుండా… ఐటీ మిత్రుని సహకారంతో ఫార్మా రంగంలో అద్భుతాలు చేస్తున్నాడు టైకీఇన్నోవేషన్స్ సిఇఒ డాక్టర్ జి. భాను ప్రతాప్. విదేశీ సంస్థలకు దీటుగా, ఫార్మాసీ కళాశాలలకు ఉపయోగపడేలా సంస్థను తీర్చిదిద్దాడు.
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన భానుప్రతాప్ ఫార్మ్ డి చదివాడు. అందరిలా అవకాశాల ఎదురుచూస్తూ కూర్చోలేదు. ఫార్మ్-డి కోర్సులో ఉన్న సమస్యలు, అవకాశాలపై అవగాహన ఉండటంతో, ఈ కోర్సులో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేయాలని భావించాడు. తన మిత్రుడు మధిరకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నరేన్‌తో కలిసి టైకీ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించాడు. ఫార్మా ప్రొఫెసర్ రమేష్ సూచనలు వీరికి ఎంతగానో ఉపకరించాయి. ముగ్గురితో మొదలైన ఈ స్టార్టప్‌లో ఊహించినంత అద్భుతాలేమీ జరగలేదు. పెట్టిన డబ్బులు పోతున్నాయి. కానీ తిరిగి వచ్చే పరిస్థితి కనపడలేదు. అయినా నిరాశచెందలేదు. తమ క్లినిరెక్స్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతను ఫార్మసీ కళాశాలలకు వివరించారు. ఎంతో ఖర్చు చేసి బయటి దేశాల నుంచి తెచ్చుకునే సాఫ్ట్‌వేర్ కంటే అత్యుత్తమంగా ఉన్న స్వదేశీ సాఫ్ట్‌వేర్ విలువను ఫార్మసీ కళాశాలలు గుర్తించాయి. ఒక్క కళాశాలతో ప్రారంభమై ఇప్పుడు 75 కళాశాలల స్థాయికి చేరుకున్నారు. పాకెట్ మనీతో ప్రారంభమైన ఈ సంస్థ 8 నెలల్లోనే కోటి రూపాయల కంపెనీ స్థాయికి చేరింది. ప్రస్తుతం 20 మంది ఉద్యోగులకు ఉపాధి చూపిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని చెబుతున్నారు భాను ప్రతాప్, నరేన్. హైదరాబాద్, విజయవాడలో టైకీ ఇన్నోవేషన్స్ పనిచేస్తోంది. ముందు ఇండియాలో స్థిరపడ్డాక తరువాత ప్రపంచం మొత్తం విస్తరించనున్నట్లు తెలిపారు. మరోవైపు వీరి ఆలోచనకు ప్రతిరూపమైన ఫార్మోరియా అంతర్జాతీయ సదస్సు వల్ల ఫార్మా విద్యార్థులకు అవకాశాలను అందివస్తున్నాయి.
మన దేశంలో 2008లో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సును ప్రవేశపెట్టారు. సుమారు 200 కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే వందకు పైగా ఉన్నాయి. గొప్ప ప్రచారంతో ప్రారంభమైన డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు చదివినవారి భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదనే భావన మొదలైంది. ఫార్మా రంగంలో ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్లినికల్, పరిశోధన రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఎంబీబీఎస్ తర్వాత అంతటి డిమాండ్ ఉన్న కోర్సుగా భావించారు. ఆరేళ్ల ఈ కోర్సులో తరగతి గదితో పాటు ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించడం, ఇంటర్న్‌షిప్ ఉంటాయి. క్లినికల్ ఫార్మసిస్టు నైపుణ్యం లభిస్తుంది. రోగిని కలవడం, కేస్ షీట్‌ను పరిశీలించడం, మెడికల్ రిపోర్ట్‌లు తయారు చేయడం వీరి విధి. అయితే రిపోర్టులను భద్రపర్చి వాటిని అవసరమైనప్పుడు తిరిగి వినియోగించడం చాలా కష్టమైన వ్యవహారం. ఈ సమస్య నుంచి ఫార్మసీ విద్యార్థులను బయట పడేస్తోంది టైకీ ఇన్నోవేషన్స్.
ప్రతి రోగికి సంబంధించిన పూర్తి సమాచారం వీరి క్లినిరెక్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా భద్రపర్చేందుకు వీలవుతుంది. రోగుల వివరాలు, వారికి అవసరమైన మందులు అన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. రోగుల వివరాలు డేటాబేస్‌లో పొందుపరచడం, వారి వ్యాధి నిరోధక శక్తి స్థాయిని గుర్తించి మందులు సూచించడం, ఆహారనియమాలు చెప్పడం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా చాలా సులభమవుతోంది. అటు ఆసుపత్రులకు ఇటు ఫార్మసీ విద్యార్థులకు, కళాశాలలకు టైకీ ఇన్నోవేషన్స్ సాఫ్ట్‌వేర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. గతంలో మన దేశంలో ఈ సాఫ్ట్‌వేర్ కోసం అమెరికా, మలేషియా దేశాల వైపు చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి స్వదేశంలోనే సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నారు టైకీ యువకులు..
భానుప్రతాప్ తమ సంస్థలోని శిక్షణ గురించి మాట్లాడుతూ… టైకీ ఇన్నోవేషన్స్‌లో శిక్షణ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఫార్మ్ డి చదివిన వారికి అవకాశాలు లేవనే స్థాయి నుంచి చక్కని శిక్షణ పొందితే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయని మా శిక్షణ నిరూపిస్తోంది. సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లోనూ సంస్థపై భరోసా ఏర్పడింది. ఫార్మ్ డి చదివిన వారికి విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. మన దేశంలోనూ అలాంటి రోజులు వస్తాయని విద్యార్థులు ఆశిస్తున్నారు.అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి టైకీ ఓ వేదికగా మారిందని అంటున్నాడు.

Comments

comments