Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఇద్దరూ ఒక్కదారికొస్తారా?

int1

రేపు సింగపూర్‌లో కిమ్, ట్రంప్ కీలక సమావేశం

సింగపూర్ : అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్..ఉత్తర కొరియా దేశాధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్..ఇద్దరూ గట్టివారే. పొట్టివారే. సరిగ్గా ఆరు నెలల క్రితం వరకూ ఇద్ద రూ పరస్పరం ఒకరిని ఒకరు అవమానించుకున్నారు. ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. దేశ అణ్వాయుధ సంపత్తితో వైరిపక్షాలుగా బెదిరింపులకు దిగారు. ఇదంతా గతం . ఇప్పుడు మంగళవారం ఈ అరివీర భయంకరుల మధ్య శాంతి చర్చలు జరుగనున్నాయి.అటు అమెరికా కాదు ఇటు ఉత్తర కొరియా కాదు. మధ్య వేదికగా సింగపూర్‌లో ఇరువురు నేతల శిఖరాగ్ర సదస్సుకు రంగం సిద్ధం అయింది. నాటకీయ పరిణామాల నడుమ చర్చల వేదిక పలు రకాల ఉత్కంఠలతో కొలువుదీరింది. సింగపూర్‌లోని ఐలాండ్ రిసార్డ్ సెంటోసాలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హోటల్ కాన్ఫరెన్స్ గది ఇరుపక్షాల చర్చలకు వేదిక అయింది. అమెరికా అధ్యక్షులు ఒకరిని ఉత్తర కొరియా నేత కలుసుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే ప్రథమం కానుంది. తలపడేంత స్థాయికి చేరుకున్న ఇరు దేశాల పంతాలు పట్టింపులు, మధ్యలో దక్షిణ కొరియా కలవ రం, చైనా కీలక పాత్ర, అంతర్జాతీయంగా పలు స్థాయిలో దృష్టి కేంద్రీకృతం అయిన వేదికగా ఈ సెంటోసా మారిం ది. గత 18 నెలల్లో ఇరువురు నేతల సంబంధాలలో పలు దశలు ఉన్నాయి. 71 ఏండ్ల ట్రంప్ తన సహజ ధోరణిలోనే కిమ్‌ను పలుసార్లు ఆటపట్టిస్తున్నట్లుగా విమర్శిస్తూ వచ్చారు. ఇందులో వ్యక్తిగత దూషణలు కూడా ఉన్నా యి. కిమ్ ..ఆయనో చిట్టిపొట్టి రాకెట్‌మెన్ అని ట్రంప్ ఎగతాళికి దిగారు. అంతర్జాతీయ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా వరుస పెట్టి అణు పరీక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ నిరసన వ్యక్తం చేశారు. కిమ్ చర్యలకు ఉత్తర కొరియా తగు విధంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని మండిపడ్డారు. ప్రపంచం ఇంతవరకూ కనివిని ఎరుగని రీతిలో ఉత్తర కొరియాపై నిప్పుల వర్షం వంటి దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఈ ట్రంప్ ఉరుములకు కిమ్ కిమ్మనకుండా ఉండలేదు. అంతకు మించిన స్థాయిలో పిడుగులు కురిపించారు. 30 మధ్య వయస్సులో ఉన్న కిమ్ దూకుడుగానే సమాధానం ఇచ్చారు. ట్రంప్ పిచ్చొడు, అని ఆయనకు మతిస్థిమితం లేదని , శక్తులుడిగిన ముసలోడు అని తిట్టిపోశారు. ఈ విధంగా ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఏర్పడింది. ఇప్పుడు పూలగుచ్ఛాలుఅందించుకునే దశకు చేరింది. ఇప్పటివరకూ అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న స్థాయి చల్లారి పోయి, ఒకరిని ఒకరు కావులించుకునే ప్రేమకు చేరింది. ఇరువురి నడుమ ఇంతకు ముందటి ఘర్షణ చాలా దూరం వరకూ వెళ్లింది. ఓ దశలో కిమ్ తమ హెచ్చరికలో పసిఫిక్ సముద్రంలోని అమెరికా భూభాగం అయిన గువామ్‌ను దెబ్బతీస్తామని బెదిరించారు. ట్రంప్ కిమ్ సింగపూర్ భేటీకి ముందు కూడా అమెరికా విదేశాంగ శాఖ నుంచి కిమ్‌పై విమర్శలు వెలువడ్డాయి. ఉత్తర కొరియా నేతలు కొందరు అమెరికా ఉపాధ్యక్షులు మైక్ పెన్స్‌ను రాజకీయ డమ్మీ అని విమర్శించారు.
అనూహ్యంగా ఆహ్వానానికి అంగీకారం
ముఖాముఖి కలుసుకుని అన్ని సమస్యలపైనా చర్చించుకుందాం రండి …అని మార్చిలో కిమ్ పలికిన ఆహ్వానానికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామం ప్రపంచమంతా నివ్వెరపొయ్యేలా చేసింది. అయితే గత నెలలో మరింత విచిత్రంగా ట్రంప్ తాము చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తర కొరియా నేతల బుద్ధి మారడం లేదని, విద్వేషంతో వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ చర్చలు ఉండవని ప్రకటించారు. దీనితో కథ మొదటికి వచ్చిందని అంతా అనుకున్నారు. అయితే కొద్ది రోజులకే వైట్‌హౌస్ వారు వెలువరించిన ప్రకటనలో కిమ్ ట్రంప్ సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ మధ్యలోనే ఉత్తర కొరియా వారు తమ దేశంలోని అత్యంత కీలక అణు పరీక్షల కేంద్రాలను ధ్వంసం చేస్తున్నట్లు నిర్ణీత పరిశీలకులకు, మీడియా వారికి తెలియచేశారు.
సింగపూర్ చేరుకున్న ట్రంప్, కిమ్
స్థానిక ఐలాండ్ రిసార్ట్‌లో జరిగే చారిత్రక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు ట్రంప్, ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. తమ ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ సింగపూర్‌లోని పాయా లెబర్ ఎయిర్ బేస్‌కు చేరారు. కెనడాలో జి 7 సంపన్న దేశాల కీలక సదస్సులో పాల్గొని అక్కడి నుంచి 20 గంటలు ప్రయాణించి ట్రంప్ నేరుగా ఇక్కడికి వచ్చారు. వైమానిక స్థావరంలో సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అమెరికా అధినేతకు స్వాగతం పలికారు. మంగళవారం కీలక సమ్మిట్ జరుగుతుంది. చర్చలపై ఏం అనుకుంటున్నారని ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. చాలా బాగుంటుందనే అనుకుంటున్నా అని జవాబిస్తూ ఆయన వెళ్లారు. ట్రంప్ రాకకు కొద్ది గంటల ముందు కిమ్ సింగపూర్ చేరారు. ఆయన ఎయిర్ చైనా 747 విమానంలో వచ్చారు. ఉత్తర కొరియా నేత కిమ్ ఇక్కడికి రాగానే సింగపూర్ ప్రధాని లీ హీస్ లూంగ్‌ను కలిశారు. ఇరువురు చిరునవ్వులతో ఫోటోలు దిగారు. ప్రపంచమంతా చారిత్రక సదస్సు కోసం ఆసక్తితో ఎదురుచూస్తోందని, చర్చల దిశలో చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసినందుకు థ్యాంక్స్ అని సింగపూర్ నేతను కిమ్ అభినందించారు. చర్చల వరకూ వచ్చామని, సత్ఫలితం కోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు.

Comments

comments