Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఇదిగో నవశకం

trump1

సింగపూర్‌లో ట్రంప్ – కిమ్ చరిత్రాత్మక ఒప్పందం, శాంతి దిశగా తొలి అడుగు 

ద. కొరియాతో సైనిక విన్యాసాలకు అమెరికా స్వస్తి

కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు కిమ్ అంగీకారం
ఉత్తర కొరియాకు భద్రత కల్పించడానికి ట్రంప్ హామీ
యుద్ధ ఖైదీలు, జాడలేని సైనికుల గుర్తింపు ప్రక్రియ వేగవంతానికి సమ్మతి

ఉత్తర కొరియాతో కొత్త చరిత్ర సృష్టికి అమెరికా సిద్ధంగా ఉంది. అది తమ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు కిమ్ నాతో చెప్పారు. కొరియా ద్వీపకల్పం అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. వచ్చే వారం జరిగే సమావేశంలో దక్షిణ కొరియా, చైనా, జపాన్‌లతో కూడా చర్చలు జరుపుతాం. ఈ విషయంలో తగిన పురోగతి కనిపించే వరకు ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి.
– డొనాల్డ్ ట్రంప్

సింగపూర్: ఉత్తర కొరియాకు అమెరికా భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతో కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం కృషి చేయడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ఉన్ అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మంగళవారం ఇక్కడి కెపాంగ్ హోటల్‌లో జరిగిన చరిత్రాత్మక చర్చలు ముగిసిన అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. కిమ్‌తో చర్చలు నిజాయితీగా, ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ అభివర్ణించా రు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపివేస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు మాత్రం ప్రస్తుతానికి అలాగే ఉంటాయ ని కూడా ఆయన చెప్పారు. ట్రంప్, కిమ్‌లు సమగ్రమైన, లోతయిన, నిజాయితీతో కూడిన చర్చలు జరిపారని, ఇరు దేశాలు మధ్య సరికొత్త సంబంధాలను నెలకొల్పు కోవడంపైన, కొరియా ద్వీపకల్పంపై శాశ్వత శాంతిని నెలకొల్పే విషయమై తమ అభిప్రాయాలను పంచుకున్నారని శిఖరాగ్ర చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, కిమ్‌లు సంతకాలు చేసిన సంయుక్త ప్రకటన తెలిపింది. ఉత్తర కొరియా (డిపిఆర్‌కె)కు భద్రతాపరమైన గ్యారంటీలు ఇవ్వడానికి ట్రంప్ అంగీకరించారని, దీనికి బదులుగా కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణ అణు నిరాయుధీకరణ చేయడానికి తన కృతనిశ్చయాన్ని కిమ్ పునరుద్ఘాటించారని ఆ ప్రకటన తెలిపింది. ఇరు పక్షాలు యుద్ధ ఖైదీలు, సైనిక చర్యల్లో జాడ తెలియకుండా పోయిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని, ఇప్పటికే గుర్తించిన వారిని వారి దేశాలను తక్షణం పంపించి వేయాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయని ఆ ప్రకటన తెలిపింది. సెంటోసా దీవిలోని కాపెల్లా సింగపూర్ హోటల్లో కేవలం అనువాదకులు మాత్రమే ఉండగా ఇరువురు నాయకులు ముఖాముఖి చర్చలు, ఆ తర్వాత తమ అధికార బృందాలతో కలిసి విస్తృత స్థాయి చర్చలు, విందు సమావేశం తర్వాత ఈ ఉమ్మడి ప్రకటనపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా అగ్ర నేతతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి. సంపూర్ణ అణు నిరాయుధీకరణకు తోడ్పడే ఒక సంయుక్త ప్రకటనపై తాము సంతకాలు చేసినట్లు శిఖరాగ్ర చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు.ఉత్తర్త కొరియాతో ఒక కొత్త చరిత్రను ప్రారంభించడానికి అమెరికా సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఉత్తర కొరియా ఇప్పటికే తన ప్రధాన క్షిపణి ఇంజన్ పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు కిమ్ తనతో చెప్పారని ట్రంప్ చెప్పారు. అయితే ఆయన అంతకు మించి వివరించలేదు. అణు నిరాయుధీకరణ గురించి అడిగిన ఒక ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, అతి త్వరలోనే తాము ఆ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియకు సంబంధించి వచ్చే వారం ఒక సమావేశం జరగబోతోందని, దక్షిణ కొరియా, చైనా, జపాన్‌లతో కూడా తాము చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో తమకు పురోగతి కనిపించే వరకు ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర కొరియా భవిష్యత్తు ఆర్థిక విధానం గురించి అడగ్గా దాన్ని నిర్ణయించుకోవలసింది ఆ దేశం, దేశ ప్రజలేనని ఆయన చెప్పారు. కాగా కిమ్‌తో తన చర్చలుఅందరూ ఊహించిన దానికన్నా ఎంతో బాగా జరిగాయని అంతకు ముందు ట్రంప్ చెప్పారు.‘ ఇది ఒక చారిత్రక సమావేశం. గతాన్ని వదిలిపెట్టాలని మేము నిర్ణయించాం. ప్రపంచం గొప్ప మార్పునుచూడబోతోంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతతలు’ అని కిమ్ అన్నారు. ఈ రోజు కిమ్‌తో సమావేశం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యను తాము పరిష్కరించబోతున్నామని ఆయన చెప్పారు. కిమ్ చాలా తెలివైన, విలువైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంసించారు. కిమ్‌ను వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తారా అని విలేఖరులు అడగ్గా తగిన సమయంతో ఆహ్వానిస్తానని, తాను కూడా ప్యోంగ్యాంగ్‌కు వెళ్తానని ట్రంప్ అన్నారు.
విడివిడిగా హోటల్‌కు చేరుకున్న నేతలు
అంతకు ముందు చర్చల కోసం ఇరువురు నేతలు విడివిడిగా హోటల్‌కు చేరుకున్నారు. మందు కిమ్ హోటల్‌కు చేరుకోగా ఆ తర్వాత ట్రంప్ నిర్దిష్ట సమయానికి కేవలం 60 సెకన్ల ముందు మాత్రమే హోటల్‌కు వచ్చారు. ఇరువురు నేతలు తమ జాతీయ జెండాల ముందు నిలబడి 12 సెకన్ల పాటు పరస్పర కరచాలనం చేపుకున్నారు. ఇరువురు నేతలు నవ్వుతూ పలకరించుకున్న తర్వాత సమావేశం జరిగే హాలు దాకా నడుచుకుంటూ వెళ్లారు. ఈ చరిత్రాత్మక సమావేశం అద్భుత విజయం సాధిస్తుందని తాను ఆశిస్తున్నట్లు సమావేశం ప్రారంభానికి ముందు విలేఖరులతో కొద్ది సేపు మాట్ల్లాడిన ట్రంప్ అన్నారు. ఈ సమావేశానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, వాటినన్నిటినీ అధిగమించి తాము ఈ రోజు ఇక్కడ సమావేశమవుతున్నామని కిమ్ అన్నారు. ఇరువురు నేతలు కేవలం అనువాదకులు మాత్రమే ఉండగా దాదాపు 45 నిమిషాల పాటు ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. విలేఖరులు కనీసం మూడుసార్లు మీరు అణ్వాయుధాలు వదిలిపెడతారా అని ప్రశ్నించగా, అందుకు ఆయన చిరునవ్వే సమాధానమైంది. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరువురు నేతలు విందు సమావేశంలో పాల్గొన్నారు.

Comments

comments