Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

నవ శకానికి నాంది

Article about Modi china tour

సంవత్సర కాలం లోపు ఎంత మార్పు! 2017 జులైలో అమెరికాను చేరుకోగల రెండు ఖండాంతర మిస్సిలీలను, ఆత్మరక్షణ కోసం అనంతరం అణు బాంబులను పరీక్షించిన డిపిఆర్ (ఉత్తర) కొరియా ఛైర్మన్ కిం జోంగ్ అన్, ఉత్తర కొరియాను భూ మండలం మీద లేకుండా చేస్తానని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంతలోనే కలుసుకుంటారని, అణు యుద్ధ ముప్పు నుంచి ప్రపంచాన్ని తప్పిస్తారని ఎవరైనా ఊహించారా? కాని వారిరువురూ మంగళవారం తటస్థ వేదిక సింగపూర్‌లోని సెంటోస దీవిలో విలాసవంతమైన ‘కాపెల్లా సింగపూర్’ హోటల్‌లో ముఖాముఖీ చర్చలు జరిపారు. ‘సమగ్రమైన పత్రం’పై సంతకాలు చేశారు. నవశకానికి నాంది పలికారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలపు చివరి అవశేషం కొరియా ద్వీపకల్పంలో శాంతి సుమాలు పూయించుదామని ప్రతినబూనారు. 195053 కొరియా యుద్ధంతో దేశం ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోయింది. కమ్యూనిజం విస్తరణను నిరోధించే పేరుతో దక్షిణ కొరియా పక్షాన అమెరికా సైన్యాన్ని దించింది. కమ్యూనిస్టు ఉత్తర కొరియా పక్షాన రష్యా, చైనా మోహరించాయి. అంతిమంగా యుద్ధ విరమణ ఒప్పందం జరిగిందిగాని శాంతి ఒప్పందం జరగలేదు. అంటే రెండు కొరియాలు ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్టే లెక్క. దక్షిణ కొరియాతోపాటు జపాన్‌లో లక్షలాది త్రివిధ దళాలతో అమెరికా సైనిక స్థావరాలు కొనసాగుతున్నాయి. నిరంతరం దురాక్రమణ భయంతో ఉన్న ఉత్తర కొరియా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ దేశభక్తి ప్రబోధంతో తన ప్రజలను ఐక్యంగా ఉంచుకుంటూ, అభివృద్ధి కృషితోపాటు సైనిక శక్తి పెంచుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోవియట్ యూనియన్ కూలిపోయాక చైనా ఒక్కటే దానికి సన్నిహిత మిత్రదేశంగా ఉంది.
ఉత్తర కొరియా అల్పశ్రేణి, దీర్ఘశ్రేణి మిస్సిలీల అభివృద్ధిని, అణుబాంబు పరీక్షలను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. 2003లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అంతర్జాతీయ ఒడంబడిక నుంచి వైదొలిగిన డిపిఆర్ కొరియా ఐరాస విధించిన ఆంక్షలను తట్టుకుంటూనే అణు కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. దానికి పాకిస్థాన్ తోడ్పడిందన్న అనుమానాలు, ఆరోపణలున్నాయి. అణు కార్యక్రమం విడనాడాలన్న అమెరికా హెచ్చరికలకు తలొగ్గతే తమ దేశానికీ లిబియా గతి పట్టిస్తారన్న ఆందోళన ఉత్తర కొరియా నాయకత్వంలో ఉంది. ఉత్తర కొరియా పూర్తిగా, తనిఖీలకు లోబడి, తిరుగులేని విధంగా అణ్వస్త్ర కార్యక్రమం విరమించాలని, తయారు చేసిన బాంబులను ధ్వంసం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, తమ భద్రతకు అమెరికా హామీలివ్వాలని, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, దక్షిణ కొరియా నుంచి అమెరికన్ సైన్యాలను ఉపసంహరించుకోవాలని కిం జోంగ్ అన్ షరతులు పెట్టాడు. సింగపూర్‌లో సంతకాలు జరిగిన సమగ్ర ఒప్పందం వివరాలు తెలియనప్పటికీ, పరస్పర హామీలు అందులో ఉండి ఉంటాయని, రానున్న రోజుల్లో అధికారుల స్థాయి చర్చల ద్వారా దశలవారీ ఒక్కొక్క అంశం అమలు మొదలవుతుందని సులభంగానే ఊహించవచ్చు. సింగపూర్ శిఖరాగ్ర సభ విజయవంతం అయినట్లు కిం, ట్రంప్‌ల వ్యాఖ్యలే తెలుపుతున్నాయి.
‘కొరియా ద్వీపకల్పాన్ని పూర్తిగా అణ్వస్త్ర రహితం చేసే దిశగా కృషి చేయటానికి కిం అంగీకరించారు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలకు (ఉ. కొరియా పరిభాషలో దండయాత్ర రిహార్సిల్స్) స్వస్తి పలకటానికి ట్రంప్ అంగీకరించారని’ సంయుక్త ప్రకటన తెలిపింది. ఉ. కొరియా, అమెరికా మధ్య నూతన సంబంధాల స్థాపనకు, కొరియా ద్వీపకల్పంలో మన్నికగల, బలమైన పాలనా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన సమస్యలను వారిరువురూ చర్చించినట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయి. ‘మీరు అణ్వాయుధాలను విడనాడతారా’ అన్న ప్రశ్నకు కిం చిరునవ్వే సమాధానమైంది. అంటే అణ్వస్త్ర నిరాయుధీకరణ పురోగతికి, ఆంక్షల ఎత్తివేతకు లంకె ఉందన్నమాట.
ఉత్తర కొరియా నేతతో చర్చలు జరిపిన తొలి అమెరికన్ అధ్యక్షునిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఉత్తర కొరియాతో నవ చరిత్ర ఆరంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు అయన ప్రకటించారు. అనుకున్నదానికంటే ఎక్కువే సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘గతాన్ని వెనక్కిపెట్టాలని మేము నిర్ణయించాం. పెద్ద మార్పును ప్రపంచం చూస్తుంది’ అని కిం భరోసా వ్యక్తం చేశారు.
పశ్చిమ, తూర్పు జర్మనీలు ఐక్యమైనట్లు ఉత్తర దక్షిణ కొరియాలు ఐక్యమవుతాయా? ఇది ప్రజల అభిమతం. ఇప్పటివరకు అడ్డుపడుతూ వచ్చిన అమెరికా దీన్ని ఇకపై ప్రోత్సహిస్తుందా? ఐక్యమైతే రాజ్య వ్యవస్థ ఎలా ఉంటుంది? చరిత్ర గమనమే సమాధానాలు వెదుకుతుంది. ఏమైనా కిం, ట్రంప్ శిఖరాగ్ర సమావేశాన్ని సుసాధ్యం చేయటానికి ఎంతో కృషి చేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయి ఇన్, తోడ్పడిన చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్, జపాన్ ప్రధాని అబె అభినందనీయులు. మూన్ అన్నట్లు ‘ఇది ఆరంభం మాత్రమే. అనేక చిక్కులు మున్ముందు ఉండవచ్చు.’ వాటిని అధిగమించగల రాజనీతిజ్ఞత ప్రదర్శించగలిగితేనే శాంతి నెలకొంటుంది, శాశ్వతమవుతుంది.

Comments

comments