Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

త్వరలో అన్నీ కిమ్ చెప్తారు

Trump replied to press questions

వాషింగ్టన్ : ఉత్తర కొరియా అన్ని క్షిపణి స్థావరాలను నిర్మూలించుకుంటుందని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి ఆ దేశాధినేత కిమ్ అతి కొద్ది రోజుల్లో తమ కార్యక్రమం వెల్లడిస్తారని వెల్లడించారు. చర్చల ఫలితం బాగుంటుందని, ఇది అంతా అనుకున్నట్లే జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఎబిసి న్యూస్ తెలిపింది. సింగపూర్ చర్చల సందర్భంగా ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పూర్తి స్థాయి అణు నిరాయుధీకరణకు హామీ ఇచ్చారని, దీనికి ఆయన కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని ట్రంప్ తెలిపారు. తమ దేశం నుంచి ఉత్తర కొరియాకు సరైన భద్రతా గ్యారంటీ దక్కిందని తెలిపారు. ఇందుకు ప్రతిగా కొరియా ద్వీపకల్పం అణు రహితం అవుతుందని ఈ దిశలో కిమ్ నుంచి వచ్చే కొద్ది రోజులలోనే సరైన స్పందన ఉంటుందని వెల్లడించారు. అయితే తమ దేశం నుంచి ఏ విధమైన భద్రతా గ్యారంటీని అందిస్తున్నది చెప్పడానికి ట్రంప్ నిరాకరించారు. ఇది ఏమిటనేది తాను నిర్థిష్టంగా చెప్పదల్చుకోలేదని, అయితే ఆయనకు (కిమ్‌కు) ఇచ్చిన గ్యారంటీ సముచితంగా ఉందని, దీనితో ఆయన సంతోషిస్తారని తెలిపారు. ‘ అవును వారు అణు రహితం కానున్నారు. ఈ ప్రాంతం అంతా అణ్వాయుధ విముక్తి పొందుతుంది.

కిమ్ ఈ పనికి త్వరలోనే దిగుతారని అనుకుంటున్నాను. వచ్చే కొద్ది రోజులలో ఆ దేశం నుంచి దీనికి సంబంధించి ప్రత్యేకించి క్షిపణి స్థావరాల విధ్వంసం గురించి తెలియచేసే ప్రకటన వెలువరిస్తారు’ అని విలేకరుల ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. మిస్సైల్ ఇంజిన్ పరీక్షా స్థావరాన్ని కూడా ధ్వంసం చేసుకోవడానికి కిమ్ సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇక దక్షిణ కొరియా ద్వీపకల్పం నిరాయుధీకరణ అంటే ఇందులో దక్షిణ కొరియాకు రక్షణగా ఉన్న అమెరికా అణు సంపత్తి కాదని, దీని గురించి కిమ్‌తో చర్చలు జరగలేదని, అసలు అజెండాలో ఇది లేదని , కేవలం ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణే కీలకం అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇక దక్షిణ కొరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ అంశం కూడా ప్రస్తావనకు రాలేదని వివరించారు. తాము రణచేష్టలకు దిగబోమని , యుద్ధ క్రీడలను నిలిపివేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. వారు పూర్తిగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని, అయితే వారు భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. యుద్ధం అంటూ పోతే దాని ఫలితం దారుణంగా ఉంటుందని, ఆర్థికవ్యవస్థలకు గండిపడుతుందని తెలిపారు. తాము కిమ్‌ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించినట్లు , అంతకు ముందు ఆయన అణు నిరాయుధీకరణలో కొంత వాస్తవికతను చాటుకోవల్సి ఉంటుందన్నారు.
మంట పుట్టిస్తోన్న ఒపెక్ : ట్రంప్
చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) చర్యలు అనుచితంగా ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఉత్పత్తి పరిమితులు, ధరల పెంపుదల నిర్ణయాలు సరికావని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ముడి చమురు ధరలు విపరీతంగా ఉన్నాయని , ఒపెక్ మరోసారి ఈ దూకుడుకు దిగుతోందని అసహనం ప్రదర్శించారు. చమురు ఉత్పత్తి ఓ వైపు దండిగా ఉండగా , చమురు ధరల పెంపుదల కృత్రిమంగా ఉంటోందని, దీనితో అస్థవ్యస్థ పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు.

Comments

comments