Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

జి.7 రసాభాస షాంఘై 8 ఐకమత్యం

Article about Modi china tour

గత వారాంతంలో రెండు ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. ఒకటి కెనడాలో జరిగిన సంపన్న దేశాల గ్రూపు 7 సమావేశం. రెండవది చైనాలో జరిగిన 8 ప్రవర్ధిత దేశాల షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఒ). జి.7 అగ్రనాయక సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకాకి అయినారు. సంయుక్త ప్రకటన నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరించే ఇష్టాగోష్టి వేదికగా 1975 నుంచి పని చేస్తున్న ఈ అమెరికా ప్లస్ పశ్చిమ ప్రజాస్వామ్యాల (పారిశ్రామిక దేశాల ) కూటమిలో ఇటువంటి పరిస్థితి బహుశా ఇదే ప్రథమం. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ ఇతర సభ్యదేశాలు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనది మొదలు ఆయన ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ఇతర ఏకపక్ష నిర్ణయాలు (పారిస్ ‘వాతావరణ మార్పు’ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి నిష్క్రమించటం, డబ్లుటిఒపై దాడి, ప్రపంచీకరణ నుంచి తిరోగమనం వగైరా) ఈ గ్రూపు సఖ్యతను దెబ్బతీసింది. ఒక సభ్యదేశంపై విదేశీ దాడి జరిగితే దాన్ని సభ్యదేశాలన్నిటిపై దాడికి పరిగణించి ప్రతిస్పందించాలన్న సమష్టిభద్రతా వ్యవస్థగా ఏర్పరుచుకున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమికి ‘కాలం చెల్లింద’న్న ట్రంప్, అటు తర్వాత వెనక్కి తగ్గారు. ట్రంప్ వైఖరులకు మూలమైన సూత్రం ఒకటే మిత్ర దేశాలు అమెరికా నుంచి చాలా లబ్ధిపొందుతున్నాయి, తిరిగి ఏమీ ఇవ్వటం లేదు.
ఇయు, కెనడా, మెక్సికోల నుంచి ఉక్కు దిగుమతిపై 25 శాతం, అల్యూమినియం దిగుమతిపై 10 శాతం చొప్పున ట్రంప్ సుంకం విధించటం ప్రస్తుతం జి.7లో వివాదమైంది. అమెరికా నుంచి దిగుమతులపై తత్సమాన సుంకాలను జులై 1 నుంచి విధిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ట్రూడో వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తూ సమావేశం వైఫల్యానికి అతని అసమర్థతను కారణంగా ట్రంప్ నిందించగా, ట్రంప్ కారణమని ఇతర పశ్చిమ దేశాల నేతలు విమర్శించారు. ప్రపంచ సంపదను దోచుకుంటున్న ఈ కూటమికి వ్యతిరేకంగా పేద దేశాల ప్రతినిధులు ప్రతిఒక్క జి.7 సమావేశం సందర్భంలో నిరసన ప్రదర్శనలు జరపడం గమనార్హం. 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభంతో పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ఆవహించిన పెను ఆర్థిక మాంద్యమే సంపన్న రాజ్యాల కూటమిలో ఉద్రిక్తతలకు, లుకలుకలకు అసలు మూలం.
ఇదిలా ఉండగా, ఇదే సమయంలో (శని, ఆదివారాలు) చైనాలో జరిగిన 8 సభ్యదేశాల షాంఘై సహకార సంస్థ సమావేశం విజయవంతమైంది. చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్, నాలుగు మధ్య ఆసియా రిపబ్లిక్‌లు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ అగ్ర నాయకుల సమావేశంలో సంయుక్త ప్రకటనతో పాటు 12 ఇతర పత్రాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ హాజరును గొప్ప చారిత్రక ప్రాముఖ్యతగల అంశంగా చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. వారిరువురూ మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. పరిశీలకుని హోదా కలిగిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని, తమ దేశంతో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన నేపథ్యంలో సహసంతకందారులైన రష్యా, చైనా తోడ్పాటు కోరారు. బాహాట ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికై ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్‌ను, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను రక్షించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, వాటికి తూట్లు పొడుస్తున్న అమెరికా పేరు ఎత్తకుండా, వక్కాణించారు. భారత్, పాకిస్థాన్ చేరికతో ఎస్‌సిఒ మరింత బలపడిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు.
టెర్రరిజం, వేర్పాటు వాదం, తీవ్రవాదంపై వచ్చే మూడేళ్లలో మరింత పట్టుదలతో పోరాడాలని ఎస్‌సిఒ సంయుక్త ప్రకటన ఉద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టం ప్రాతిపదికగా, రాజకీయాలు, ద్వంద్వ ప్రమాణాలకు అతీతంగా ఐక్యరాజ్య సమితి కేంద్ర సమన్వయ కర్తగా ఏకీకృత టెర్రరిజం వ్యతిరేక ప్రపంచ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి జరగాలని పిలుపు ఇచ్చింది. తీవ్రవాద భావజాలాలతో ప్రభావితం కావద్దని యువతకు విజ్ఞప్తి చేసింది. టెర్రరిజానికి ఏ రూపంలోనూ ఆర్థిక సహాయం చేయరాదని, పాదార్థిక, సాంకేతిక సహాయం అందించరాదన్న భద్రతా మండలి ప్రత్యేక తీర్మానాన్ని నెరవేర్చాలని ప్రపంచ దేశాలను కోరింది.

Comments

comments