Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రోగుల ప్రాణాలతో చెలగాటం

Ventilators shortage problem in MGM hospital

మన తెలంగాణ/ఎంజిఎం : ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్దదిక్కుగా పేరొందిన రాష్ట్రంలోనే హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రి తరువాత రెండవ అతిపెద్ద ఆసుపత్రిగా వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించే ఎంజిఎం ఆసుపత్రిలో వెంటిలేటర్స్ కొరత సమస్య వల్ల ఎంతో మంది రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రయ్‌మంటూ భారీ వాహనాలు నిత్యం దూసుకెళ్లే జాతీయ ప్రధాన రహదారుల కూడలి ఉమ్మడి వరంగల్ మహానగరం. ఈ మార్గం నిత్యం రోడ్డు ప్రమాదాలతో తరచూ రక్తమోడుతుంటుంది. ఈ ప్రమాదాలలో అధికులు తలకు గాయాలై మృతి చెందిన వారు కొందరైతే ప్రాణాలతో ఉండి అపస్మారక స్థితిలో చివరి దశలో ఉన్న వారు మరి కొందరు. అనారోగ్య రీత్యా, శ్వాసకోష సంబంధిత వ్యాధులు, తల గాయాలు, క్రిమిసంహారక మందు సేవించి కోమాలోకి వెళ్లిన తదితర సంబంధిత రోగులు నిత్యం ఎంజిఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల గూర్చి తెలిసిన వెంటిలేటర్ల కొరత సమస్యలపై అధికారులు చూసి చూడనట్లు గానే రోగుల ప్రాణాలలో చలగాటం ఆడుతున్నారు. నిత్యం వేల మంది రోగులు ఎంజిఎం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. ఇందులో కొన్ని ఎమర్జెన్సీ కేసులు పలు అత్యవసర విభాగాలలో చేరికలు అవుతాయి. ఇలాంటి తరుణంలో రోగులకు వెంటిలేటర్ పరికరం అవసరం. అత్యవసర పరిస్థితిలో వైద్యులు రోగి పరిస్థితి విషమంగా ఉన్న క్రమంలో గాలి, శ్వాస తీసుకోలేని పరిస్థితిలోగాని, సర్జరీ చేస్తున్న సమయంలో రోగి పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పడు వెంటిలేటర్ పరికరం సహాయంతో రోగికి చికిత్స అందించాలి. కానీ ఎంజిఎం ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు కలిపి కేవలం నాలుగు వెంటిలేటర్స్ పని చేస్తుండడం గమనార్హం. ఈ వెంటిలేటర్ల కొరత సమస్య వల్ల రోగుల బాధితులు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నట్లు సమచారం. రోగులు దిక్కుతోచని స్థితిలో వెంటిలేటర్ల కొరత కారణంగా వ్యాపారులు కేంద్రాలుగా కొనసాగిస్తున్న కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి లక్షల్లో జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. నిరుపేద వర్గానికి చెందిన వారు హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి రోగిని అంబులెన్స్ వాహనం ద్వారం తరలించడానికి చార్జీలకు డబ్బులు లేక ప్రాణాలు గాలిలో కలిసి కొన్ని కుటుంబాలు రోడ్డుపై పడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి.
వెంటిలేటర్ కొరత… చోద్యం చూస్తున్న వైద్యాధికారులు
ఎంజిఎం ఆసుపత్రిలోని నలబై విభాగాల నుండి వచ్చిన రోగులలో రోగి పరిస్థితి విషమంగా వుంటే ఆ రోగిని అత్యవసర విభాగమైన ఆర్‌ఐసియూ విభాగంలోకి పంపించి రోగికి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించి ఆ రోగి ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చికిత్స అందిస్తారు. కానీ ఆర్‌ఐసియూ విభాగంలో పనిచేస్తున్న వెంటిలేటర్లు నాలుగు మాత్రమే. అందులో ఉన్న పడకల సామర్థం పది కానీ వెంటిలేటర్ల అవసరమయ్యే కేసులు ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై పడకలతో ఆర్‌ఐసియులో కనీసం పదిహేను వెంటిలేటర్ల సౌకర్యం ఆవసరమవుతున్నట్లూ తెలుపుతున్నారు. ఐసియులో ఐదు వెంటిలేటర్ల సౌకర్యం అవసరమని ఆ విభాగం సిబ్బంది తెలుపుతున్నారు. కానీ ఐసియు విభాగంలో కనీసం ఒక్క వెంటిలేటర్ కూడా లేకపోవడం గమనార్హం. అత్యవసర సమయంలో ఆర్‌ఐసియు విభాగంలోని ఉన్న నాలుగు వెంటిలేటర్లలలో తప్పనిసరి పరిస్థితులలో బదిలీ మీద తీసుకొని తిరిగి సర్జరీ అనంతరం ఇచ్చే దుస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఖమ్మం, కరీంనగర్, జనగాం, కొత్తగూడం, ఛత్తీస్‌ఘఢ్ పలు ప్రాంతాల నుండి ఎమర్జన్సీ కేసులు ఎంజిఎంకు వస్తుంటాయి. దీనిని బట్టి చూస్తే వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల రోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్‌ఐసియు విభాగానికి పలు విభాగాల నుండి రోగులకు నాలుగు నుండి ఆరు మధ్యలో వెంటిలేటర్ల కేసులు వస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల భారినపడి తలకు గాయాలై రెండు, మూడు కేసులు ఆర్‌ఐసియు పంపించే అవకాశం ఉంటుంది. ఎంజిఎం మొత్తానికి ఉన్న ఈ నాలుగు వెంటిలేటర్లు ఏ రోగికి పెట్టాలో తెలియని పరిస్థితులలో వైద్యులు సతమతం అవుతున్నారు. కొన్ని సందర్భాలలో ఒక రోగిని కాపాడాలని ప్రయత్నం చేస్తే మరొక రోగిపై వెంటిలేటర్ తీయాల్సిందే. ఇందులో రాజకీయ పైరోవలు సైతం వైద్యులు అధిగమించాలి. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఉన్న ఇరవైరెండు వెంటిలేటర్స్ మరమ్మత్తులలో నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరించడం బాధాకరం.
అంబుబ్యాగ్‌తో చికిత్స
వెంటిలేటర్ కొరత సమస్యతో వెంటిలేటర్ అవసరమయ్యే రోగికి అంబుబ్యాగ్‌తో (24 గంటలు చేతితో ప్రెస్ చేసి కృత్రిమంగా శ్వాస అందించే పరికరం) సహాయంతో రోగి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాట్లుపడుతున్నారు. ఈ అంబుబ్యాగ్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్తున్న క్రమంలో, స్కానింగ్ సెంటర్‌కు వెళ్తున్న క్రమంలో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో దీనిని ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడి పరిస్థితి ఎడారిలో నీరులుగా మారింది. ఐసియు, ఆర్‌సియు, విభాగాలలో మానిటర్ పరికరం కూడా ఎంతో కీలకం. ఈ పరికరం రోగి యొక్క పరిస్థితి అనగా గుండె స్పందన, నాడీ కదలికలు, బిపి సంబంధిత అంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ మానిటర్ పరికరం దాదాపుగా ఇరవై అవసరం అవ్వగా కేవలం ఐదు వరకు ఉండడం గమనార్హం.
మరమ్మత్తులో జాప్యం ఎందుకు?
రాష్ట్రాలు మారి స్వరాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా వెంటిలేటర్ల మరమ్మత్తులలో జాప్యం మాత్రం మారలేదు. ఎంజిఎం ఆసుపత్రుల్లో పలు విభాగాలకు కలిపి ఇరవైరెండు వెంటిలేటర్లు వుండగా నాలుగు వెంటిలేటర్ల పరికరాలు మాత్రమే పని చేస్తుండడంలో అధికారుల నిర్లక్షమా…? నిధుల సమస్యనా..? మరమ్మత్తులలో జాప్య మా..? జాప్యం ఎక్కడో తెలియని పరిస్థితి. కోట్లల్లో నిధులు ఉన్నప్పటికీ ఎందుకు మరమ్మత్తులు చేయించడంలేదో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు కొనసాగిస్తున్నామని చెప్పిన మాటలు నీటిమీద రాతలుగా మారాయి. ఇప్పటికైనా వెంటిలేటర్లకు మరమ్మత్తులు చేసి జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకొని రోగుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.

Comments

comments