Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రాణం పోద్దాం రండి

ప్రతి సెకనుకు ఒకరికి రక్తం అవసరం

Blood-Donation2

ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల రక్తం అవసరమైన వారికి  తగినంతగా దొరకడం లేదు. రక్తదానాన్ని ప్రోత్సహించడానికి,
రక్తదానంపై అవగాహన కల్పించడానికి ప్రపంచఆరోగ్యసంస్థ (డబ్లూహెచ్‌ఓ) సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా, రక్తానికి ఇంకా కొరతగానే ఉంటోంది.

చావుబతుకుల్లో ఉన్న వ్యక్తిని చూసి.. అంతా దేవుని దయ. ప్రాణాలు పోసే శక్తి మనకెక్కడిది అంటూ నిట్టూరుస్తుంటాం.. కానీ ప్రాణం పోసే శక్తి  మనక్కూడా ఉందనే విషయం మర్చిపోతున్నాం. పోయే ప్రాణాన్ని కాపాడే శక్తి మనందరికీ ఉంది. రక్తదానంతో ఎందరికో జీవితాల్ని ఇవ్వగలం.  రక్తానికి కులమత భాష వర్గ ప్రాంతీయ భేదాలుండవు. అత్యవసర సమయంలో రక్తం దొరక్కపోవడం వల్ల ప్రాణాలు పోయేవారి సంఖ్య అధికంగా ఉంది. సరైన  అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రక్తదానం గురించి ఆలోచించరు. ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది.

రక్తం మనందర్నీ కలుపుతుంది.. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే (జూన్ 14) సందర్భంగా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) థీమ్‌లైన్ ఇది.. మనిషికి బ్లడ్ ఎంత అవసరమో, ఆ రక్తం అవసరమైన వారికి సమయానికి అందటం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం అన్ని దేశాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది వరల్డ్ బ్లడ్ డోనర్ డేను వివిధ థీమ్‌లతో నిర్వహిస్తోంది.పెను ప్రమాదాలకు గురైనప్పుడు, శస్త్ర చికిత్సలు చేయించుకునేటప్పుడు, రక్తహీనతకు దారితీసే వ్యాధులు సోకినప్పుడు రక్తం తప్ప మరేదీ ప్రాణాలను రక్షించలేదు. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటి వరకూ రక్తానికి ప్రత్యామ్నాయం ఏదీ అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రక్తదాతలే ఆపన్నులకు ప్రాణదాతలవుతున్నారు. వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసేవారికి ధన్యవాదాలు తెలుపుకునే రోజే బ్లడ్ డోనర్స్ డే. కొత్తగా రక్త దానం చేయాలనుకునేవారికి అవగాహన కల్పించడం, రక్త దానం వల్ల జీవితాలను ఎలా కాపాడవచ్చో తెలిపే రోజు కూడా. చూడటానికి అందరి రక్తమూ ఎర్రగానే ఉన్నా, అందరి రక్తం ఒకటే కాదని, రక్తాన్ని కొన్ని గ్రూపులుగా విభజించి ప్రపంచానికి చాటినవాడు కర్ల్ లాండ్‌స్టీనర్ అనే ఆస్ట్రియన్ అమెరికన్, బయోలజిస్ట్‌గా, ఫిజిషియన్‌గా అనేక ప్రయోగాలు చేసి బ్లడ్‌గ్రూప్‌లను కనిపెట్టాడు. అందుకే కర్ల్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజున బ్లడ్ డోనర్ డేను వివిధ థీమ్‌లతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రీసెంట్ సొసైటీస్ (ఐఎఫ్‌ఆర్‌సి), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్‌బిడివో), ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్‌బిటి) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రక్తదానం చేయమంటూ ఇవన్నీ కలిసి ప్రజలను, ముఖ్యంగా యువతను మోటివేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా బ్లడ్ డొనేట్ గురించి కరపత్రాల ద్వారా, చిన్న చిన్న స్కిట్‌ల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

Blood-Donation

రక్తం అవసరమైన వారి కోసం సాధారణంగా 1865 ఏళ్ల లోపు వయసుగల ఆరోగ్యవంతుల నుంచి రక్తం సేకరిస్తారు. రక్తం సేకరించిన తర్వాత హెచ్‌ఐవీ, హైపటైటిస్‌బి, హైపటైటిస్‌సి, సిఫిలిస్ తదితర వ్యాధులు ఉన్నదీ లేనిదీ పరీక్ష చేస్తారు. ఆ తర్వాతే ఆ రక్తాన్ని అవసరమైన రోగులకు ఎక్కిస్తారు. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్‌బ్యాంకులు అన్నీ ఈ కనీస జాగ్రత్తలను పాటిస్తాయి. అయితే, కొన్ని చోట్ల వైద్యసిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తూ, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దాఖలాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నిర్లక్షం కారణంగానే మన దేశంలో ఏటా దాదాపు రెండు వేలమందికి పైగా అభాగ్యులు కేవలం రక్తమార్పిడి వల్ల హెచ్‌ఐవీ బారినపడుతున్నారు. సాధారణంగా స్వచ్ఛంద రక్తదాతల వల్ల ఇలాంటి విపత్తులు తలెత్తిన ఉదంతాలు లేవు. అయితే, డబ్బుల కోసం తరచూ రక్తాన్ని అమ్ముకునే ‘ప్రొఫెషనల్ డోనర్స్’ వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. రక్తాన్ని కూడా కల్తీచేసే దుర్మార్గులు కూడా ఇటీవల పుట్టుకొస్తున్నారు. అలాంటివారిపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.

రక్తంలో స్లైన్ వాటర్ కలిపి కల్తీచేసిన ఉదంతం ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకివచ్చిన సంగతి తెలిసిందే. రక్తం అవసరమైన రోగులకు, బాధితులకు సురక్షితమైన రక్తం అందేలా చూసే బాధ్యత బ్లడ్‌బ్యాంకులు, ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యనిపుణుల పైనేఉంది. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ప్రచారం ఫలితంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగానే పెరిగినా, మిగిలిన రాష్ట్రాల్లో వీరి సంఖ్య మరింత పెరగాల్సి ఉంది.

 మరింత అవగహన అవసరం..

* ఒక వ్యక్తి చేసే రక్తదానంలో మూడు నిండు ప్రాణాలు నిలిచే అవకాశాలున్నాయి.
* ఒక పసికందు ప్రాణాలు కాపాడటానికి మూడు టీ స్పూన్ల రక్తం అవసరమౌతుంది.
* తీవ్రంగా కాలిన గాయాలకు గురైన వ్యక్తిని కాపాడాలంటే కనీసం 20 మంది రక్తదాతలు కావాలి.
* సేకరించిన తర్వాత రక్తం 42 రోజుల మాత్రమే నిల్వ ఉంటుంది.
* ప్లేట్‌లెట్స్ కేవలం 5 రోజులే నిల్వ ఉంటాయి.

మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు…

రక్తం మనిషికి ప్రాణవాయువు కొన్ని అవయవాలు లేకుండా జీవించొచ్చు. కానీ రక్తం లేకుంటే బతికే అవకాశాలే లేవు. రోడ్డు ప్రమాదాలు,శస్త్రచికిత్సలు, సందర్భం ఏదైనా రోగి శరీరంలో ఉన్న రక్తం బయటకు పోవడంతో ఒంట్లో రక్త శాతం తగ్గుతోంది. దీనివల్ల మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బాధితులకు వెంటనే రక్తం ఎక్కిస్తుంటారు. మహిళల విషయానికొస్తే ప్రసవం సమయంలో చాలా వరకు అవసరముంటుంది. గుండె, కాలేయం, కిడ్నీ తదితర పెద్ద పెద్ద శస్త్రచికిత్సల సమయంలో రోగులకు రక్తం ఎంతో అవసరం. సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే రోగి బతకడం కష్టమే.

ఆ రోగి బతకాలంటే మరొకరు రక్తదానం చేయాలి. రక్తదానం చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వీడి ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. సాధారణంగా ఒకవ్యక్తి నుంచి 450 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తం సేకరించే ముందు రక్తదానం చేసే వారికి కొన్ని ప్రధానమైన పరీక్షలు చేస్తారు. రక్తదానం చేసే వ్యక్తి 18 ఏళ్లు నిండి, 60ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. శారీరకంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. 45 కిలోలకు పైగా బరువు కలిగి ఉండాలి. రక్తదానం చేసిన వారికి పూర్తి స్థాయిలో రక్తం 21రోజుల్లో ఉత్పత్తి అవుతోంది. కనీసం మూడు నెలలకు ఒకసారైనా రక్తదానం చేయవచ్చు. రక్తంలో మొత్తం 9 రకాల గ్రూపులున్నాయి. వీటిల్లో ప్రధాన గ్రూపుల్లో నాలుగు పాజిటివ్‌కు, మరో గ్రూపులు నెగటీవ్‌కు సంబంధించినవి. అయితే మనుషుల్లో 90 శాతం మంది పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన వారే ఉంటారు. అందు లో ఎక్కువ మొదటి స్థానంలో ‘ఒ’ పాజిటివ్, రెండో స్థానంలో ‘ఎ’ పాజిటివ్, మూడో స్థానంలో ‘బి’ పాజిటివ్, నాలుగో స్థానంలో ‘ఎబి’ పాజిటివ్‌లకు గ్రూపులకు చెందిన రక్తాన్ని కలిగి ఉంటారు. అదే విధంగా ‘ఎ’నెగటివ్, ‘బి’ నెగటివ్, ‘ఎబి’ నెగటివ్, ‘ఒ’ నెగటివ్ గ్రూపులతో పాటు బొంబాయి బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల్లో ‘ఎబి’ నెగటివ్, బొంబాయి బ్లడ్ గ్రూపులు అరుదైనవి. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

* దేశ జనాభాలో కేవలం ఒక్క శాతం మంది రక్తదానం చేస్తే చాలు ఆ దేశానికి అవసరమైన రక్తం సమకూరుతుంది.
* ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతీ సెకనుకు ఎవరో ఒకరికి రక్తం అవసరం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 10 కోట్ల 80 లక్షల రక్తదాతల నుంచి రక్తాన్నిసేకరిస్తున్నారు. ఇందులో సగం అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉంటోంది.
* 62 దేశాలు రక్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద రక్తదాతల ద్వారానే సేకరిస్తున్నాయి.
* మన దేశంలో ప్రతి సంవత్సరం కోటీ 20 లక్షల యూనిట్లు అవసరమైతే 90 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభ్యమవుతుంది.
* యాక్సిడెంట్లు, ఎమర్జెన్సీ కేసుల్లో సమయానికి రక్తం దొరక్క కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు.
* ప్రెగ్నెన్సీ సమయంలో అనుకోకుండా వివిధ సమస్యలు ఉత్పన్నమై సమయానికి రక్తం లభించక ప్రపంచవ్యాప్తంగా 800 మంది మహిళలు మరణిస్తున్నట్లు అంచనా.
* ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, రక్తదాతల నుంచి కేవలం 80 లక్షల యూనిట్లు మాత్రమే దొరుకుతుంది.
* భారత్‌లో ఏటా 1.20 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్నది 90 లక్షల యూనిట్లు మాత్రమే.
* ప్రతి రెండు సెకండ్లకు ప్రపంచంలో ఎవరో ఒకరికి రక్తం అవసరం ఏర్పడుతూనే ఉంటుంది.
* ఒక యూనిట్ (సుమారు 500 మి.లీ) రక్తంతో మూడు నిండు ప్రాణాలను కాపాడవచ్చు.
* ప్రపంచంలో ఏటా 3 కోట్ల బ్లడ్ కాంపొనెంట్స్‌ను (రక్తంలోని అంశాలు ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా వంటివి) వైద్యులు అవసరంలో ఉన్న రోగులకు ఎక్కిస్తూనే ఉన్నారు.
* ఏ గ్రూపు రక్తం ఉన్నవారికైనా ‘ఓ’ నెగెటివ్ రక్తానికి చెందినవారి ఎర్ర రక్తకణాలను ఎక్కించవచ్చు. అందుకే ఈ గ్రూపు రక్తానికి డిమాండ్ ఎక్కువ. అయితే దీనికి తీవ్రమైన కొరత ఉంటుంది.
* అన్ని బ్లడ్‌గ్రూపుల వారికి ‘ఏబీ’ పాజిటివ్ గ్రూప్ వారికి చెందిన ప్లాస్మాను ఎక్కించవచ్చు. దీనిక్కూడా తీవ్రమైన కొరత ఉంటోంది.
* భారత్‌లో ఏటా వివిధ వ్యాధులకు గురైనవారికి 23.40 కోట్ల మేజర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. తీవ్ర ప్రమాదాలకు గురైన వారికి దాదాపు 6.30 కోట్లకు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. వీరితో పాటు ౩.10 కోట్లమంది కేన్సర్ రోగులకు, దాదాపు కోటి మంది గర్భిణులకు రక్తం అవసరమవుతోంది.
* ఇవి కాకుండా, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే లక్షలాది మందికి కూడా నిత్యం రక్తం అవసరమవుతోంది.
* రక్తదానం చేయాలనుకున్నవారు ప్రతి రెండునెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు. కేవలం ప్లేట్‌లెట్లు ఇచ్చేవారు వారానికి ఒకసారి ఇవ్వవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. * పూర్తి ఆరోగ్యంతో ఉండి, 1865 ఏళ్లలోపు ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం 18 ఏళ్ల వయసులో మొదలుపెట్టి, ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నట్లయితే, 60 ఏళ్ల వయసు నిండేసరికి కనీసం 500 నిండుప్రాణాలు కాపాడగలరు.

మల్లీశ్వరి వారణాసి

Comments

comments