Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మళ్లీ వాణిజ్య యుద్ధం ఆందోళనలు

bs

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలాకు గురువారం బ్రేక్ పడింది. మళ్లీ చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఆందోళనలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో మార్కెట్ బెంచ్‌మార్క్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 35,103 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు పతనమై 10,679 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 35,257 నుంచి -35,020 పాయింట్ల మధ్య శ్రేణిలో కదలాడింది. అమెరికా మార్కెట్ 0.8 శాతం వరకూ క్షీణించగా, ఆసియాలోని హాంకాంగ్, తైవాన్, సింగపూర్ సూచీలు 1-2 శాతం మధ్య పడిపోయాయి. భారత్‌లో బ్యాంక్ నిఫ్టీ 25,469 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయి మధ్యాహ్న సెషన్ తర్వాత వేగంగా కోలుకుని 25,700 పాయింట్లపైన స్వల్పలాభంతో ముగిసింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా నిఫ్టీ ఐటి సూచి 2 శాతం నష్టపోగా, రియల్టీ సూచి 1.6 శాతం, ఎఫ్‌ఎంసిజి సూచి 1.1 శాతం చొప్పున తగ్గాయి. క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన మెటల్ సూచి 0.7 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టీ-50 షేర్లలో అన్నింటికంటే అధికంగా సన్‌ఫార్మా 3.6 శాతం ర్యాలీ జరిపింది. ఇన్‌ఫ్రాటెల్ 3.3 శాతం పెరగ్గా, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టిపిసి, హిందాల్కో, వేదాంత షేర్లు లాభపడ్డాయి. నష్టాలపాలైన కంపెనీల్లో అధికంగా హెచ్‌సిఎల్ టెక్ 8 శాతం పతనమైంది. ఫలితాల ప్రకటన తర్వాత ఈ షేరు వరుసగా రెండో రోజు క్షీణించింది. యుపిఎల్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్‌లు 2.5 శాతం వరకూ నష్టపోయాయి.
52 వారాల కనిష్ఠానికి 21 స్టాక్స్
బిఎస్‌ఇ 500 సూచీలో 21 స్టాక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. వీటిలో ప్రధానంగా హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ(హెచ్‌సిసి), మహానగర్ గ్యాస్, సుజ్లాన్ ఎనర్జీ, ఐడియా సెల్యులార్, వక్రంజీ, పిసి జువెలర్ వంటి షేర్లు ఉన్నాయి. 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన స్టాక్స్‌లో ఇంకా.. భారత్ ఎలక్ట్రా న్సిక్స్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సిపిసిఎల్), డిసిఎం శ్రీరామ్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, సీమెన్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, యుకో బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు కూడా ఉన్నాయి.
22 శాతం నష్టపోయిన హెచ్‌సిసి
రుణాల పరిస్థితిపై లావస ఆడిటర్ ఆందోళన వ్యక్తం చేశారనే మీడియా వార్తలతో హెచ్‌సిసి స్టాక్ భారీగా పతనమైంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో గురువారం హెచ్‌సిసి షేరు అత్యంతగా 27 శాతం మేరకు పతనమై రూ.17.15 వద్ద ముగిసింది. హెచ్‌సిసి షేరు బిఎస్‌ఇలో రూ.23.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన అనుబంధ సంస్థ లావాసా కార్పొరేషన్ నికర విలువ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందనే ఆడిటర్ సమాచారంతో హెచ్‌సిసి పెద్దమొత్తంలో పతనమైంది. కంపెనీ రుణాలు రూ.2390 కోట్లకు చేరడంతో పాటు, నికర విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇకపై కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడం అనుమానమేనని ఆడిటర్ తెలిపారు. దీంతో ఈ హెచ్‌సిసి కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తాయి.

Comments

comments