Home జాతీయ వార్తలు విలయ జల ఘాతం

విలయ జల ఘాతం

23 dead in 24 hours as flash floods hit Kerala

కనీవినీ ఎరుగని ముంపులో కేరళ విలవిల

ఊరూ, ఏరూ ఏకమైన రాష్ట్రం
సహాయక శిబిరాల్లో 4 లక్షల మంది
తిండి, నీరులేక ఆర్తనాదాలు
11 జిల్లాల్లో తాజాగా రెడ్ అలర్ట్
పలు రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల నుంచి విరాళాల వెల్లువ

కోచి: దేవభూమిగా పేరుగాంచిన కేరళపై ప్రకృ తి కన్నెర్ర కొనసాగుతూ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శనివారం మరో 23 మంది మృతి చెందారు. 15 మృత దేహాలు వరదనీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీంతో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య ౩24 దాటిపోయింది. మృతుల్లో 150 మంది గత రెండు రోజుల్లోనే చనిపోయారు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన ప్రకృతి విలయంతో రాష్ట్రం రూపు రేఖలే మారిపోయాయి.

ఒకప్పుడు ప్రకృతి అం దాలకు ప్రసిద్ధి చెందిన కేరళలో ఇప్పుడు ఎక్కడ చూసినా వరద నీటిలో మునిగిన ఇళ్లు, తెగిపోయిన రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కనీసం తాగు నీరు కూడా దొరక్క అల్లాడుతూ, సహాయం కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయులే కనిపిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక రాష్ట్రమంతటా కారు చీకట్లు కమ్ముకోవడడంతో పాటు, రైలు, రోడ్డు, విమాన సర్వీసులు దాదాపు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఆహారం, మంచినీరు, మందులు లాంటి అత్యవసరాల కొరత, సురక్షిత ప్రాంతాలకు తరలించాల్పిన వారు ఇంకా లక్షల్లో ఉండడంతో వీరందరినీ ఆదుకోవడం ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో 4 లక్షల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు.

11 జిల్లాల్లో తాజా రెడ్ అలర్ట్
శనివారం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని అధికారులు ఊపిరి పీల్చుకునే లోగానే బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండడంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో కేరళ వాసులు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 11 జిల్లాల్లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు.కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

మంచినీళ్లతో ప్రత్యేక రైలు
కేరళ వరద బాధితులకోసం మంచి నీటితో ప్రత్యేక రైలు శనివారం మహారాష్ట్రలోని పుణెనుంచి బయలుదేరింది. అలాగే కేరళ చిన్నారుల కోసం వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం వంద టన్నుల బాలామృతాన్ని పంపిస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రాల ఆపన్న హస్తం
వరదల తాకిడికి కకావికలమైన కేరళను ఆదుకోవడానికి రాష్ట్రాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశాలాంటి కొన్ని రాష్ట్రాలు భారీ సహాయాన్ని ప్రకటించగా శనివారం తాజాగా మరికొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, గుజరాత్ రూ. 10 కోట్లు, బీహార్ రూ.10 కోట్లు ఉత్తరప్రదేశ్ రూ. 15 కోట్లు సాయం ప్రకటించాయి.

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కేరళ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి వీలయిన సాయమంతా చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక రైల్వే వ్యాగన్ నిండా బియ్యం, రూ.2.5 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు, ఎంపిలు అందరూ ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.తమిళనాడునుంచి కోటి రూపాయల విలువైన మందులను రాష్ట్రానికి పంపిస్తున్నారు. కేరళలోని వరద పీడిత ప్రాంతాలను ఆదుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) ప్రకటించింది. భారత అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
మరో వైపు వరదల్లో చిక్కుకు పోయిన వారిని ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలతో పాటుగా, కోస్ట్‌గార్డు, ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు, స్థానిక యువకులు పాలు పంచుకుంటున్నారు. కేరళలో 58 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ డిజి సంజయ్ కుమార్ తెలిపారు. సహాయక సామగ్రిని అన్ని జిల్లాలకు తరలిస్తున్నామని, ఇప్పటివరకు 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఆపదలో ఉన్న 500 మందిని కాపాడినట్లు ఆయన చెప్పారు. ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు కోసం శనివారం అదనంగా 75 మోటరైజ్డ్ పడవలను, మరో ఏడు హెలికాప్టర్లను పంపించారు.