Home జాతీయ వార్తలు కేరళ విద్యార్థికి నిఫా వైరస్

కేరళ విద్యార్థికి నిఫా వైరస్

Nipah virus for Kerala student

 

వైద్య పర్యవేక్షణలో మరో 86 మంది
కేరళకు కేంద్ర వైద్యబృందం

కోచి/ న్యూఢిల్లీ: కేరళలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. ఆ విద్యార్థి రక్త నమూనాల్ని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)లో పరీక్షించి, ఫలితాలు వెలువడిన తర్వాత నిఫా సోకినట్టు ధ్రువీకరించారు. మరో 86 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు కేరళ ఆరోగ్యమంత్రి కెకె శైలజ మంగళవారం చెప్పారు. అంతకు ముందు ఆ విద్యార్థి రక్త నమూనాల్ని మణిపాల్, కేరళ వైరాలజీ సంస్థల్లో పరీక్షించినప్పుడు నిఫా లక్షణాలు కనిపించాయి. ఇక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వెంటిలేటర్ వంటి సాధనాలేవీ అమర్చలేదని ఆరోగ్యమంత్రి చెప్పారు. ‘రోగిపట్ల అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.

జ్వరంవల్ల ఒక్కోసారి అస్థిమితంగా ఉంటున్నాడు. మంచి ఫలితం వస్తుందనే అనుకుంటున్నాం’ అని శైలజ తెలిపారు. అతనితో పాటు ఉన్న మరో 86 మంది జాబితాను తయారుచేసి వారిని వైద్యపర్యవేక్షణలో ఉంచామన్నారు. వారిలో ఇద్దరికి జ్వరం రావడంతో వారిని విడిగా ఒక వార్డుకు మార్చామన్నారు. అయితే, వైరస్ సోకిన విద్యార్థికి సేవలందించిన ఇద్దరు నర్సులకు గొంతు మంట, జ్వరం రావడంతో వారిని కూడా పర్యవేక్షణలో ఉంచారు.

కేంద్ర వైద్యబృందం కేరళకు
కేరళ విద్యార్థికి ప్రాణాంతకమైన నిఫా వైరస్ సోకిందని స్పష్టం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఎపిడెమియోలజిస్ట్‌తో సహా ఆరుగురు సభ్యులున్న వైద్య బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించింది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, వైరస్ సోకిన వారిని విడిగా ఉంచి చికిత్స చేయడంలోనూ ఈ బృందం తోడ్పడుతుంది. గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కేరళ ఆరోగ్య మంత్రి శైలజతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) లో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, 011 23978046 అనే నంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఆరోగ్యమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

23 year old student infected with Nipah virus