Home అంతర్జాతీయ వార్తలు మధ్యధరాలో 240 మంది గల్లంతు

మధ్యధరాలో 240 మంది గల్లంతు

23 మంది సురక్షితం
Sea

రోమ్: లిబియా దగ్గర మధ్యదరా సముద్రంలో మంగళవారం ఒక పడవ మునిగి 240 మంది గల్లంతయ్యారు. వారిలో చాలామంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ప్రమాదానికి గురైన పడవ దగ్గరికి ముందుగా చేరుకున్న చమురు నౌకలో నుంచి దిగినవారు 23 మందిని సురక్షితంగా కాపాడారు. బతికిఉన్న వారికోసం సముద్రజలాల్లో తీవ్రంగా గాలిస్తున్నారని, కొందరి మృతదేహాలు దొరికాయని తెలిసింది.

పడవ మునగడం ప్రారంభమైన నాలుగు గంటలకు చమురు నౌక వచ్చిందని ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ వ్యక్తి ఒకరు తెలిపారు. ‘ప్రమాదం జరిగినప్పుడు పడవలో 122 మంది ఉన్నారు. వారిలో పది మంది మహిళలు. పదిహేనేళ్ల లోపు వారెవరూ లేరు. ఒక్క మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడింది’ అని ఆయన చెప్పారు. ‘ ప్రాణాలతో బయటపడేందుకు చాలాసేపు నీటిలో తేలియాడుతూ వేచిఉన్నాం. పదిహేనేళ్ల వయసు గల నా తమ్ముడితో సహా చాలా మంది మరణించారు’ అని అన్నారు. సహాయ బృందాల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల ఎక్కువమంది బతికి బయటపడే ఆవకాశాలు లేవు.