Home ఎడిటోరియల్ శిశు మరణాలను ఆపలేమా?

శిశు మరణాలను ఆపలేమా?

Newborn mortality

 

నవజాత శిశు మరణాలను తగ్గించడంలో దేశంలోని సగానికి పైగా జిల్లాలు విఫలమయ్యాయి. దీంతో 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాన్ని అవి అందుకోలేకపోయాయి. ఈ సంస్థ ఇటీవల వెలువరించిన నివేదికలో వెల్లడైన కఠోర సత్యమిది. అత్యంత పేలవమైన పురోగతి వున్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే నవజాత శిశువు నుండి ఐదు సంవత్సరాల వయస్సుగల చిన్నారుల మరణాలు మన దేశంలోనే అత్యధికం.

2000 సంవత్సరం నుంచి 2015 వరకూ భారతదేశంలో సంభవించిన శిశు మరణాల గురించి అమెరికాలోని ప్రజా ఆరోగ్య అధ్యయన కేంద్రం జాన్స్ హోప్కిన్స్ టూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ నిర్వహించారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో చోటుచేసుకున్న బాలల అకాల మరణాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. మృతికి దారితీసిన కారణాలను ఆరా తీశారు. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలను ప్రధానంగా తీసుకున్నారు.భారత్‌లోనే చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉందని ఈ సర్వేలో తేలింది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు భారత్‌లోని 25 రాష్ట్రాల శిశు మరణాల నివేదికలను సేకరించి 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, అందుకు కారణమైన అంశాలపై పరిశోధన జరిపారు. చిన్నారుల మరణాలు అత్యధికంగా ఉంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే ఉందని, ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉందని, గోవాలో కన్నా ఆ రాష్ట్రంలో ఏడు రెట్లు ఈ రేటు అధికంగా ఉందని పేర్కొంది.

2016 సంవత్సరంలో వెల్లడైన పిల్లల అకాల మరణాలతో ఈ విషయం స్పష్టం అయింది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక శిశు మరణాలు నమోదు అయ్యాయి. వైద్య విజ్ఞాన వారపత్రిక లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాలల విషాద భారతం గురించి తెలియచేసిన ఈ అధ్యయనంలోనే మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. పేద సంపన్న దేశాలలో బాలల మరణాలపై కొట్టొచ్చే వ్యత్యాసాలు ఉన్నట్లు తేల్చారు. సగటున చూసుకుంటే పేద దేశాలలోని పిల్లలు ఎక్కువగా మృతి చెందుతున్నట్లు ఈ సందర్బంగా వెల్లడైంది. భారత దేశంలో శిశు మరణాల సంఖ్య క్రమంగా తగ్గినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది.

మన దేశంలోనే పసికందుల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తద్వారా శిశు మరణాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారతే ముందుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ప్రతీ వంద మంది చిన్నారుల్లో 29 మంది భారత్‌‌కు చెందిన వారే అయి ఉన్నారు. మొత్తం 186 దేశాల్లో ఈ స్వచ్ఛంధ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయంలో బైటపడింది. అన్ని దేశాల కంటే లక్సంబర్గ్‌లో శిశు మరణాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. భారత్‌లో పౌష్టికాహార లోపం వల్లే ఎక్కువ శిశు మరణాలు నమోదవుతున్నాయి. అయితే 1990తో పోలిస్తే ఇండియాలో పసిపిల్లల మరణాలు సగానికి పైగా తగ్గడం గమనించవచ్చు.

నవజాత శిశు మరణాలను తగ్గించడంలో దేశంలోని సగానికి పైగా జిల్లాలు విఫలమయ్యాయి. దీంతో 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాన్ని అవి అందుకోలేకపోయాయి. ఈ సంస్థ ఇటీవల వెలువరించిన నివేదికలో వెల్లడైన కఠోర సత్యమిది. అత్యంత పేలవమైన పురోగతి వున్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే నవజాత శిశువు నుండి ఐదు సంవత్సరాల వయస్సుగల చిన్నారుల మరణాలు మన దేశంలోనే అత్యధికం. ఏడాదికి నమోదౌతున్న మరణాలు-11 లక్షలు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ప్రతి వెయ్యి మందికి 12 మంది చనిపోతుంటే, మన దేశంలో 29 మంది మరణిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న జిల్లాలు- 9 శాతం. లక్ష్యానికి చేరువగా వున్న జిల్లాలు- 14 శాతంగా ఉన్నాయి. 1990లో వెయ్యి మంది నవజాత శిశువులకు గాను 109 మంది మరణించేవారు. 2013 నాటికి ఆ సంఖ్య 50కు చేరింది. అయితే నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇది రెట్టింపు. మరణాల్లో లింగ వివక్ష ఉంది. నవజాత శిశు మరణాల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ. ఇది ఐదేళ్ల లోపు శిశు మరణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. లింగ వివక్షనూ చూపుతుంది. సామాజిక ఆర్థిక అసమానతలు, భౌగోళిక అంతరాలు, మహిళల నిరక్షరాస్యత, ప్రభుత్వ పథకాల అమలు తీరు, అవసరమైన లేక అందుబాటులో వున్న ఆరోగ్య సంరక్షణ వంటి కారణాల వల్ల ఇటువంటి మరణాలను నియంత్రించడంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం నెలకొంటోంది.

ఈ మధ్యకాలంలో వరుసగా భారతదేశంలో శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా 2015 లో ప్రపంచంలోనే దీనికి సంబంధించి ఇండియా మొదటి స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో శిశు మరణాలు దాదాపు 21 లక్షల వరకూ ఉన్నాయి. అయితే 2015 నాటికి ఈ సంఖ్య 11 లక్షలకు తగ్గింది. అయితే ప్రపంచంలోనే ఇది అత్యధిక బాలల మరణ సంఖ్యగా రికార్డు అయింది. అసోంలో అత్యధికంగా బాలలు బలి అవుతున్నారు.

భారత దేశంలో శిశు మరణాల క్రమంలో వివిధ రాష్ట్రాలలో పరిస్థితిని బేరీజు వేశారు . ఇందులో అసోంలో అత్యధిక సంఖ్యలో బాలలు మృతి చెందారు. గోవాతో పోలిస్తే ఇక్కడ ఏడు శాతం ఎక్కువ బాలల మరణాలు చోటుచేసుకున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలలో మరణాలకు పలు కారణాలు ఉన్నట్లు వెల్ల డైంది. నవజాత శిశువుల దశలలో తలెత్తే సంక్లిష్టతలు, నయం చేయడానికి వీలున్న సంక్రమిత వ్యాధులు సోకడం, వాటి నుంచి సరైన రీతిలో పిల్లలను కాపాడుకోలేకపోవడం వంటి పలు అంశాలు ఉన్నాయి. కొన్నిరాష్ట్రాలలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నాయని, వివిధ రకాల టీకాలు, ప్రసవ అనంతర జాగ్రత్తలపై సరైన అవగావహనల విషయంలో సమగ్ర రీతిలో చర్యలు లేకపోవడం కీలకమైన విషయాలని తెలిపారు. శిశు , బాల్య దశ వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరింత ఎక్కువగా చేపట్టాల్సి ఉందని తెలిపారు.

భారతీయ ప్రభుత్వ ఆరోగ్య సర్వేలను ప్రాతిపదికగా తీసుకునే, వాటిలోని గణాంకాల మేరకే 25 రాష్ట్రాలలోని శిశు మరణాలు, అందుకు దారితీసిన కారణాలను విశ్లేషించారు. ఐరాస తలపెట్టిన సహాస్రాబ్ది లక్ష్యాలు పెండిటిలో భాగంగా 2015 నాటికే శిశు మరణాలను గణనీయంగా తగ్గించాలని సంకల్పించారు . 1990 అంకెలతో పోలిస్తే వీటిని మూడింట ఒక వంతు తగ్గించాలని తలపెట్టారు. ఇండియాకు సంబంధించినంత వరకూ పుట్టిన ప్రతి వేయి మంది శిశువులలో మరణాలను 39తో కట్టడి చేయాలని లక్ష్యం విధించారు . అయితే ఓ వైపు భారీ స్థాయిలోనే శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకుంటూ వస్తున్నా , భారతదేశం ఈ మేరకు శిశు మరణాలను తగ్గించలేకపోయింది . ప్రతి వేయి మంది శిశువులలో ఈ మరణాల రేటు మూడేళ్ల క్రితం వరకూ కూడా దాదాపు 21గా ఉందని వెల్లడైందని అధ్యయన కర్తలు తెలిపారు . ఇక పుట్టిన నాలుగు వారాలల్లోనే ఎక్కువగా పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఇది 57 శాతంగా ఉందని వెల్లడైంది. న్యూమోనియా, అంటువ్యాధులు వంటివి ఎక్కువగా పేదల పిల్లలకు ప్రాణాంతకాలు అవుతు న్నాయి. వారి ఉసురు తీస్తున్నాయి .

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఏటా విశ్వసనీయమైన నివేదికలు సమర్పిస్తున్న గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ సంస్థ 2016వ సంవత్సర నివేదికను ఇటీవల మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది. అందులో ఇండియాకు సంబంధించినంత వరకు శిశు మరణాలూ, గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. 195 దేశాలలో 330 రకాల వ్యాధులు, మరణాలకు కారణాలు అధ్యయనం చేసిన తర్వాత ఈ సంస్థ ఏటా తన నివేదికను వెల్లడిస్తుంది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అయిదేండ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 1970 దశకంలో 160 లక్షల మంది చనిపోగా 2016 నాటికి ఆ సంఖ్య 50 లక్షలకు తగ్గిపోయింది. అయితే 2016 సంవత్స రంలో అత్యధికంగా ఇండియాలోనే అంటే దాదాపు 90 వేల మంది చిన్నారులు వివిధ కారణాలతో కన్నుమూసారు. మన దేశంలో మరణాలకు దారితీస్తున్న మరో కారణం – రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులేనని ఈ సంస్థ గుర్తించింది. ఇంకా పోషకాహార లోపం, పొగాకు వాడకం కూడా కారణాలను గుర్తించింది.