Home ఎడిటోరియల్ ఫార్మసిస్ట్‌లకు సముచిత వేతనాలివ్వాలి

ఫార్మసిస్ట్‌లకు సముచిత వేతనాలివ్వాలి

hospital pharmacists

 

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాణాల ప్రకారం ఔషధాలు అందిస్తున్న దేశం మనది. అందులో తెలంగాణది ప్రత్యేక స్థానం. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫార్మసీ పరిశ్రమలు, కళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ. రాజధాని హైదరాబాద్ నగరం ఫార్మాబాద్‌గా ప్రసిద్ధి. జనవరి 2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ప్రభుత్వాధినేతలు ముగ్ధులై రాష్ట్రంలో ఒక ఫార్మాసిటీనే నిర్మింపచేస్తున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే!

ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే హాస్పిటల్ ఫార్మసిస్ట్‌ల పరిస్థితి ఇక్కడ అతిదయనీయంగా ఉంది. అమెరికాలోని హాస్పిటల్స్‌లో ఫార్మసిస్ట్‌లు ఫిజిషియన్‌లతో సమమైన గుర్తింపు పొందుతున్నారు. ఇక్కడ మాత్రం మెడికల్ స్పెషలిస్ట్‌లైన ఫార్మసిస్ట్‌లను కేవలం స్టోర్ కీపర్‌లుగా, చిట్టీ చూసి మందులు ఇచ్చే కార్మికులుగా చులకన చేస్తున్నారు. ఎదుగుదలలేని ఉద్యోగం, అధిక పని భారం, అల్ప వేతనాలు, గుర్తింపు లేమితో ఫార్మసిస్ట్‌లు నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్స్‌వలె ప్రతిభతో అన్ని దశలలో ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్ పొంది కఠినమైన పాఠ్యప్రణాళిక కలిగిన డిప్లొమా ఇన్ ఫార్మసి (డి ఫార్మ్), బాచెలర్ ఆఫ్ ఫార్మసి (బి ఫార్మ్) లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసి (ఫార్మ్ డి) కోర్స్‌లు ఉత్తీర్ణులై ఫార్మసి కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పొందిన వారు మాత్రమే హాస్పిటల్ ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అర్హులు.

ఎంబిబిఎస్‌వలెనే ఈ అన్ని కోర్స్‌లకు పూర్వార్హత 10+2 సైన్స్. డి ఫార్మ్ వ్యవధి రెండున్నర, బి ఫార్మ్ వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. కాగా, ఫార్మ్ డి దేశంలోనే అతి ఎక్కువ నిడివి కల 6 సంవత్సరాల కోర్స్. దేశంలో ఫార్మసి విద్యను, వృత్తిని నియంత్రించే సంస్థ ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ). పిసిఐ ఇటీవల ఒక సంచలనాత్మక తీర్మానం చేసింది. దాని ప్రకారం డి ఫార్మ్ పట్టభద్రులు రిజిస్ట్రేషన్ కోసం ఎక్సిట్ ఎక్జామినేషన్ అనే మరొక అదనపు పరీక్ష ఉత్తీర్ణత కావలసి ఉంటది. కాగా, ఫార్మసి విద్య మీద పిసిఐ తోపాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) కి కూడా అధికారం ఉన్నది.

డి ఫార్మ్ అర్హతతో గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, వైద్యశాలలలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించే ఫార్మసిస్ట్‌లకు పదోన్నతి అవకాశాలు మృగ్యం. గ్రేడ్ 1 ఫార్మసిస్ట్, ఫార్మసి సూపర్‌వైజర్ పదోన్నతులు ఉన్నా తగిన నిష్పత్తిలో లేవు. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్‌గా ఉద్యోగంలో చేరి 95% గ్రేడ్ 2 ఫార్మసిస్ట్‌గానే పదవీ విరమణ పొందుతున్నారు. పారామెడికల్ ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు నాలుగైదు ప్రమోషన్‌లతో చూస్తుండగానే ఎదిగిపోతున్నారు. హాస్పిటల్స్‌లో బిఫార్మ్ ఆపై పట్టభద్రులను నియమించి ఫార్మసి డిపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేయవలసి ఉన్నా ప్రభుత్వాలకు పట్టింపులేదు. అప్పటికే ఉన్నత అర్హతలు కలిగిన వారికి తగిన అవకాశాలిచ్చి గుర్తించరు. డి ఫార్మ్ వారికి స్టడీ లీవ్ ఇచ్చి బి ఫార్మ్ లేదా బి ఫార్మ్ ప్రాక్టీస్ బ్రిడ్జ్ కోర్స్, ఇతర ఉన్నత కోర్స్‌లను చదివించరు.

నిరంతరం తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోడానికి లిటరేచర్ అలవెన్స్, బయట ఫార్మసి ప్రాక్టీస్‌కు అనుమతించనందున నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ఇవ్వరు. మెడికల్ ఆఫీసర్స్, నర్సులకు ఇస్తున్న ప్రత్యేక అలవెన్స్‌లు ఫార్మసిస్ట్‌లకు కూడా చెందవలసి ఉన్నా దిక్కు లేదు. నలభై, యాభై రకాల ఉద్యోగ బాధ్యతలతో సతమతమయ్యే ఫార్మసిస్ట్‌ల పని భారం అర్థం చేసుకునేవారేలేరు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్లయితే, ప్రతీ వ్యక్తికి ఇంజెక్షన్‌కు అవసరమైన నర్సు, రక్త పరీక్షకై లాబ్ టెక్నీషియన్, ఎక్స్‌రే కొరకు రేడియోగ్రాఫర్, కంటి పరీక్షకు ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, చర్మం మీద మచ్చలకు లెప్రసీ సహాయకుడు, గుప్త వ్యాధులకు హెచ్‌ఐవి కౌన్సెలర్… ఇట్లా అందరూ అక్కర పడకపోవచ్చు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికీ పని వేళలలోకాని, ఇతర సమయంలోకాని మందుల, ఫార్మసిస్ట్ అవసరం ఉంటుంది.

సహోద్యోగులకు కావలసిన అన్ని వస్తువులు సమకూర్చేది ఫార్మసిస్ట్‌లే! వైద్యాధికారి అనుపస్థితిలో చికిత్స, సేవలు అందచేసే బాధ్యత ఫార్మసిస్ట్‌లదే. ఇంత శ్రమ కేవలం ఒక వ్యక్తిగానే నిర్వహించవలసివస్తున్నది. ఒక ఎఎన్‌ఎంకు పనిలో హెల్త్ అసిస్టెంట్, 2వ ఎఎన్‌ఎం, ఐదారుగురు ఆశాలు సహాయపడతారు. చిన్న వైద్యశాలకు కూడా కనీసం ముగ్గురు ఫార్మసిస్ట్‌లను నియమించాలని ఎక్జైన్ కమిటీ 5 దశాబ్దాల క్రిందనే సిఫారసు చేసినా ఇప్పటికి ఏ మార్పూ లేదు.

దీనికి తోడు తక్కువ వేతనాలు ఫార్మసిస్ట్‌లను మరింత కుంగదీస్తున్న మరొక ముఖ్య అంశం. పదవ తరగతితో శిక్షణ పూర్తి చేసికొనే వారి కంటే తక్కువ వేతనాలు ఫార్మసిస్ట్‌లను న్యూనతకు గురి చేస్తున్నాయి. 1978 వేతన సవరణ నుంచి ఈ అన్యాయం కొనసాగుతూ వస్తున్నది. డిప్లొమా ఇంజనీర్‌ల కంటే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్‌లకు హెచ్చు వేతనాలు ఉండాలని ఎఐసిటిఇ చేసిన సిఫారసు కాగితాలలోనే మూలుగుతున్నది. కనీసం స్టాఫ్‌నర్స్‌కు సమానమైన వేతనమైనా లేనందున ఫార్మసిస్ట్‌లు బాధపడుతున్నారు. గ్రేడ్ 1 ఫార్మసిస్ట్‌లకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ లేదా హెడ్ నర్స్‌కు సమానమైన, ఫార్మసి సూపర్‌వైజర్‌లకు గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ లకు సమానమైన వేతనాలు స్థిరీకరణ చేయాలని పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభు త్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ వేసిన మొదటి వేతన సవరణ సంఘం ఈ విషయాన్ని సానుభూతితో అర్థం చేసికొని ఫార్మసిస్ట్‌లకు సముచితమైన, సానుకూలమైన వేతనాలు సిఫార్స్ చేస్తుందనే విశ్వాసంతో ఉన్నారు.

hospital pharmacists who provide direct service to public

Telangana Latest News