Home కరీంనగర్ శుభం దారిలో మృత్యుదాడి…

శుభం దారిలో మృత్యుదాడి…

 Road Accident

రైస్ మిల్లు ప్రారంభానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

శుభకార్యం వారి ఇంట్లో అశుభాన్ని మిగిల్చింది.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్ వద్ద చోటుచేసుకొంది. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్ర శివారులోని కొండాపూర్‌కు చెంది న రాగి వీరేశం, సరోజన దంపతులు తమ కూతు రు, అల్లుడు కొండూరి మనోహర్, పద్మలతో కలిసి వెల్గటూర్ మండలంలోని గుల్లకోట వద్ద నూతనంగా నిర్మించిన రైస్‌మిల్ ప్రారంభోత్సవానికి కరీంనగర్ నుండి ధర్మారం వైపు వస్తుండగా బొమ్మిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్ వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాగి వీరేశం(71)తోపాటు అల్లుడు కొండూరి మనోహర్(50) అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి, కూతురు సరోజన, పద్మలు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ధర్మారం ఎస్సై కె.ప్రేంకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పద్మ మృతి చెందగా, సరోజన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

శుభకార్యానికి వస్తూ తండ్రి, కూతురుతోపాటు అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా సరోజన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడిమ్యాల హ్యామ్లెట్ గ్రామమైన కొండాపూర్‌తోపాటు ఇటు గుల్లకోటలోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటనలో కారులోని డ్రైవింగ్‌సీట్‌లో ఇరుక్కుపోయిన మనోహర్ మృతదేహాన్ని పోలీసులు అతికష్టం మీద బయటికి తీయించగలిగారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేంకుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా అత్త, మామ, భార్యతో కలిసి తోడు సోదరుని ఇంటికి వెళుతున్న మనోహర్ కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలంలో స్థానికులు, పోలీసులు, జర్నలిస్టులు చొరవ చూపడంతో పద్మ, సరోజనను సత్వర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ పద్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన అటు కోడిమ్యాల కొండాపూర్‌లోనూ, ఇటు గుల్లకోటలోనూ విషాదం నింపింది.

3 Killed in Road Accident In Karimnagar District