Home తాజా వార్తలు శుభకార్యానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

శుభకార్యానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

Accident

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి/పెద్దశంకరంపేట: బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్ళిన వారికి తిరుగు ప్రయాణం అనంత లోకాలకు తీసుకెళ్లింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ హుషారుగా గడిపి, మరో పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకుండగా మృత్యువు రూపంలో వచ్చిన లారీ వారిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. మెదక్ మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. పాపన్నపేట మండల పరిధిలోని పోడ్చన్‌పల్లి కి చెందిన ఒక కుటుంబానికి చెందిన బంధు మిత్రులు శుభకార్యం నిమిత్తం కామారెడ్డి జిల్లా గునుకుల గ్రామానికి వెళ్ళారు. గురువారం మధ్యాహ్నం వీరు ఒక ఆటోను మాట్లాడుకుని వెళ్ళారు.

శుభకార్యం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మెదక్ మండల పరిధిలోని మాచారం-పేరూర్ గ్రామాల మధ్య వీరి ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకోట్టింది.ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పోడ్చన్‌పల్లికి చెందిన భూలక్ష్మి (40), సాయిలు(36), నాగ్సాన్‌పల్లికి చెందిన మంగళి అనసూజ (42)లు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హుటాహూటిన మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. లక్ష్మీ, దుర్గ్గాపతి, కార్తిక్‌ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి.

3 Killed In Road Accident In Medak district