Home తాజా వార్తలు పొలంలో పిడుగు ముగ్గురు బలి

పొలంలో పిడుగు ముగ్గురు బలి

 

మృతులు ఒకే కుటుంబస్థులు

మన తెలంగాణ/వికారాబాద్:పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం రాజాపూర్గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్‌కు భార్య ముగ్గు రు సంతానం, వారికున్న కొద్దిపాటి పొలంలో టమాట పంట వేశారు. పిల్లలకు సెలవులు కావడంతో కుటుంబసభ్యులు అందరూ కలిసి పొలంలో పని చేయడానికి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తేలికపాటి వర్షపు జల్లులు కురుస్తూ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో పొలంలో పనిచేస్తున్న ఫక్రుద్దీన్‌కు తీవ్రగాయాలు కాగా భార్య ఖాజాబీ(38), కూతురు తబుస్సుమ్(16) చిన్న కుమారుడు అక్రమ్ (12) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న రెండు మేకలు కూడా పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. ఫక్రుద్దీన్ పెద్ద కుమారుడు ఫయాజ్(20) పొలంలో పనిచేస్తూ కొంత దూరంలో ఉండడంతో ఫయాజ్ బతికి బట్టకట్టాడు. సమీప పొలాల్లో పనిచేస్తున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఫక్రుద్దీన్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న ధారూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.

3 people died with thunderbolt in vikarabad