Home తాజా వార్తలు పెట్టుబడి సాయం ఖాతాల పరిశీలన

పెట్టుబడి సాయం ఖాతాల పరిశీలన

30 lakh accounts in farmer comprehensive survey

రైతు సమగ్ర సర్వేలో ౩౦ లక్షల అకౌంట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి పెట్టుబడి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నందున నేరుగా రైతుల నుంచి కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్‌లను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. సేకరించిన బ్యాంకు ఖాతాలను సంబంధిత బ్యాంకు అధికారులకు పంపి అవి పనిచేస్తున్నాయో లేదో కూడా సరిచూసుకోనున్నారు. ఆ తరువాత వ్యవసాయ విస్తరణ అధికారుల చేత క్షేత్రస్థాయిలో అకౌంట్ నెంబర్లు లేని రైతుల వివరాలు తీసుకోవడంతో పాటు సేకరించిన అకౌంట్ నెంబర్‌లను ధ్రువీకరించుకోని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. అందులో భాగంగానే రైతబంధు పథకం కోసం మొదట్లో చేసిన రైతు సమగ్ర సర్వే వివరాలను వ్యవసాయ శాఖ జల్లెడ పడుతోంది. అందులో దాదాపు 30 లక్షలకు పైగా రైతుల బ్యాంకు అకౌంట్ నెంబర్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అవి దాదాపు ఒక ఏడాదిన్నర క్రితం తీసుకున్నవి కావడంతో వాటిని సంబంధిత బ్యాంకులకు పంపి సరిచూస్తున్నారు. అలాగే ఆసరా, పౌరసరఫరాల శాఖ, ఉపాధి హామీ పథకం, మార్కెటింగ్ శాఖ, సిసిఐ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల నెంబర్‌లను సేకరించనున్నారు.

ఆసరా పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్‌లలోనే ప్రతి నెల రూ. 1000 జమ చేస్తుంది. ఇలా ఆసరా ఫించన్ తీసుకుంటూ వానకాలం సీజన్‌లో రైతుబంధు సొమ్మును పొందిన అన్నదాతలు ఉన్నారు. అలాగే ప్రతి సీజన్‌లో వరిని రైతుల దగ్గర నుంచి పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుంది. వివిధ పంట ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ శాఖ, పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుంది. ఇలా రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులను మద్ధతు ధరకు సేకరించిన సమయంలో వారి బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకుని నేరుగా డబ్బును అకౌంట్‌లోనే జమ చేస్తున్నారు. ఇలా కొన్ని లక్షల అకౌంట్ నెంబర్‌లు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ వద్ద ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇలా వీలైనన్ని రైతుల బ్యాంకు అకౌంట్ నెంబర్‌లు సేకరించి, సంబంధిత బ్యాం కులకు పంపి పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోనున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి మన తెలంగాణకు తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులకు తెలుగులో ఒక కాపీని ఇస్తామని క్షేత్రస్థాయిలో వానకాలంలో లబ్ధిపొందిన రైతు దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, అకౌంట్ నెంబర్, ఖాతాదారుడి పేరు, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, ఫోన్‌నెంబర్, ఆధార్ నెంబర్, పాసు పుస్తకం నెంబర్ వంటివి తీసుకోనున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న అకౌంట్‌లో ఏమైనా మార్పులుంటే ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసే అవకాశం ఎఇఒలకు ఇచ్చారు.